అన్నా చెల్లెమ్మల మధ్య ట్విట్టర్ వార్‌

By KTV Telugu On 21 December, 2022
image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కు సంబంధించి ఈడీ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన రెండవ చార్జిషీట్‌ల కవిత పేరు ఉండడం సర్వత్రా కలకలం రేపుతోంది. గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. దీని ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. తాజాగా ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జిషీట్‌లోనూ కూడా కవిత పేరు ఉండటం సంచలనంగా మారింది. ఇప్పటికే అరెస్ట్ అయిన విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్, బినయ్ బాబు, సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈడీ తాజా ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. చార్జిషీట్‌లో కవిత పేరు ప్రస్తావించడంపై బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కవితను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కవితను ఉద్దేశించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఛార్జ్‌షీట్‌లో లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ఉందని
ట్వీట్‌ చేశారు. దానికి కౌంటర్ గా రాజగోపాల్‌ అన్నా తొందరపడకు మాట జారకు 28 సార్లు నాపేరు చెప్పించినా 28 సార్లు నాపేరు చెప్పించినా అబద్దం నిజం కాదు అని కవిత ట్వీట్‌ చేశారు. దానిపై రాజగోపాల్‌రెడ్డి మళ్లీ రియాక్టయ్యారు.

నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా నువ్వు లిక్కర్ స్కామ్‌లో ఉన్నది నిజం. జైలుకు వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న, మీ నాయన ఎవరూ కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కోల్ బ్లాక్‌ టెండర్‌ విషయంలో నాపై విషప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రానున్న రోజుల్లో అవినీతిమయమైన మీ కుటుంబం అంతా జైలుకు వెళ్లడం ఖాయం అని ట్వీట్‌ చేశారు. దానికి కవిత ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా కవిత ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలకు కవిత ఇవ్వాల్సిన వివరణలు చాలా ఉన్నాయని ఆరోపించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకం అబద్ధం. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది అని జవాబిచ్చారు కవిత. ఒకవైపు ఈ ట్వీట్ల వార్‌ ఇలా కొనసాగుతుండగా మరోవైపు చార్జిషీట్ లో తన పేరు చేర్చడంపై ఎమ్మెల్సీ కవిత న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేసీఆర్ తో మరోసారి కవిత భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం