సీబీఐ విచారిస్తే ఇంత చర్చెందుకు?
నో డౌట్. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకొచ్చాక దర్యాప్తు సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. గతంలో కంటే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. టార్గెట్ అవుతున్నవారిలో ఎక్కువమంది విపక్షపార్టీలవారే. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పులేనిదే పొగరాదన్నది ఎంత నిజమో ఏమాత్రం ప్రమేయం లేకుండా దర్యాప్తుసంస్థలు రాలేవన్నది కూడా అంతే నిజం. ఏమాత్రం సంబంధంలేని అంశాల్లో ఏ ఈడీనో, సీబీఐనో నోటీసులిచ్చి విచారించడమనేది జరగని పని. మరి ఎక్కడోచోట ఎంతోకొంత మన ప్రమేయం ఉన్నప్పుడు మనం వేలు పెట్టినప్పుడు వివరణ ఇవ్వడానికి సిద్ధపడాల్సిందే. కాకపోతే ఆ మాత్రం దానికి సీబీఐ అవసరమా అంటే చిన్నపామునైనా పెద్దకర్రతోనే కొడతారంతే!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత పేరు ఉందన్న ప్రచారంతోనే అంతా ఉలిక్కిపడ్డారు. చివరికి నోటీసులిచ్చారు. సీబీఐ అధికారులు ఆమె ఇంటికి వచ్చి ఏడెనిమిది గంటలు విచారించారు. ఓ రాజకీయ నేత ఇంటిపై ఇదేమీ తొలి దాడి కాదు ఒక్క కవిత విషయంలోనే అసాధారణంగా ఏమీ జరగలేదు. ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇదే కేసులో ఈడీ ముందు విచారణకు హాజరు కాలేదా? మైనింగ్ కేటాయింపుల విషయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వలేదా? దేశంలో ఎంతోమంది ప్రముఖులు దర్యాప్తు సంస్థల స్కానింగ్‌లో ఉన్నారు. నోటీసులు అందుకుంటున్నారు, వివరణలు ఇచ్చుకుంటున్నారు. వారందరికంటే కవిత ఏరకంగా గొప్ప?
కవిత ఇంటికి సీబీఐ రావడాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ఓ శత్రుమూక దాడిలా చూశాయి. ఇక మీడియా అయితే మరో పనేం లేదన్నట్లు లోపలికి ఎంతమంది వెళ్లారో, ఏమేం అడుగుతున్నారో ఊహాగానాలు వండివార్చింది. సీబీఐ అధికారులు లోపలికి వెళ్లినప్పటినుంచి బయటికివచ్చేదాకా మరో అంశమే లేనట్లు కవితమీదే మీడియా అంతా ఫోకస్ పెట్టింది. కవితకు సీఆర్పీసీ 160 కింద నోటీసుఇచ్చిన సీబీఐ ఆమెను సాక్షిగానే విచారించింది. ఇప్పుడంటే ఆమె కేవలం సాక్షి. విచారణ జరిగింది ఆమె ఇంట్లోనే కాబట్టి ఏ ఇబ్బందీ లేదు. కానీ సీఆర్పీసీ 91 కింద సీబీఐ మరో నోటీసు ఇచ్చింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని చెప్పింది. ఈసారి కవితకు ఆప్షన్స్ ఉండవు. చెప్పిన రోజున పిలిచిన చోటికి విచారణకు హాజరు కావాల్సిందే.
లిక్కర్‌స్కామ్ కేసులో కీలక నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టే కవిత విచారణంలో కీలకం. కవిత 10కి పైగా ఫోన్లను ఎందుకు వాడాల్సి వచ్చింది. తన ప్రమేయం లేకపోతే ఆ ఆధారాలను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది. సీబీఐ చేతిలో కవిత కాల్‌డేటా రికార్డులున్నాయి. ఈ స్కామ్‌లో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. ఆ సౌత్‌గ్రూప్‌లోని కీలక వ్యక్తులతో కవిత మాట్లాడినట్లు, లావాదేవీలు జరిపినట్లు సీబీఐ సాక్ష్యాలు సిద్ధంచేస్తోంది. రాజకీయ కక్షసాధింపు అని కొట్టిపారేస్తే ఆ ఆధారాలేమీ బలహీనపడిపోవు. కచ్చితంగా ఆ కాల్స్‌కి కారణమేంటో సీబీఐకి సంతృప్తికరమైన వివరణ ఇస్తేగానీ కవిత ఈ కేసునుంచి బయటపడలేరు. మొన్నో పత్రిక రాసినట్లు కవిత అమాయకత్వమో, అత్యాశోగానీ బీఆర్ఎస్కి మాత్రం ఇది అపశకునమే!