బుచ్చిబాబు, పిళ్లై కవితను నిండా ముంచేశారా

By KTV Telugu On 3 May, 2023
image

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన మూడో చార్జిషీటు సంచలనంగా మారింది. డాక్యుమెంట్లు, పత్రాలు, వాట్సాప్ చాట్‌లు, ఈ మెయిల్స్ పత్రాలనుకూడా ఈడీ కోర్టుకు సమర్పించింది. దీంతో ఇతర చార్జిషీట్ల కన్నా ఈ చార్జిషీటు మరితం బలంగా కనిపిస్తున్నాయి. మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ, కవిత, శరత్‌పై కొత్త అభియోగాలు చేర్చింది. హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్లపై ఈడీ ప్రస్తావన చేసింది. రూ.100కోట్ల ముడుపులపై ఆధారాలు దొరికాయంటోంది ఈడీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన అభియోగాలు మోపింది ఈడీ. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా భూములు కొన్నారని కొనుగోళ్ల లావాదేవీలు పిళ్లై అకౌంట్‌ నుంచే జరిగాయంటోంది ఈడీ.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన లాభాలతో కవిత హైదరాబాద్‌లో 3 చోట్ల భూముల కొనుగోలు చేశారని అదీ కూడా రాజకీయ పలుకుబడితో తక్కువ రేటుకు భూములు దక్కించుకున్నారని ఈడీ తెలిపింది. ఈడీ ఛార్జ్‌షీటులో కవితతో పాటు భర్త అనిల్ కుమార్ పేరును చేర్చింది. భూములు కొన్న ఓ కంపెనీలో ఆయన డైరక్టర్ లిక్కర్ లాభాలతో భూములు కొనేందుకు కవితకు ఫీనిక్స్‌‌కు చెందిన శ్రీహరి సహకరించారని తేల్చారు. ఫీనిక్స్ కంపెనీలో ఇప్పటికే పులమార్లు ఐటీ సోదాలు జరిగాయి. ఈడీ ఆర్ధిక లావాదేవీలను తెరపైకి తీసుకు రావడం సంచలనంగా మారింది. ఢిల్లీలో లిక్కర్‌ బిజినెస్‌ చేయడం కోసం కేజ్రీవాల్‌తో మాగుంట అనేకసార్లు సమావేశమైనట్టు కేజ్రీవాల్‌ కూడా మాగుంటను ఢిల్లీ లిక్కర్‌ బిజినెస్‌లోకి ఆహ్వానించినట్లుగా ఈడీ బయట పెట్టింది. మూడో ఛార్జిషీట్‌లో సంచలన అభియోగాలతోపాటు ఆధారాలను కూడా జత చేసింది ఈడీ. సూత్రధారులు, పాత్రధారుల మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్స్‌ను, ఈ-మెయిల్స్‌ను అందజేసింది. ఛార్జిషీటూ ఛార్జిషీటుకూ కొత్త అభియోగాలు నమోదు చేస్తూ కలకలం రేపుతోంది ఈడీ.

కవిత ఏ భూములు కొన్నారు ఎక్కడ కొన్నారు డబ్బులు ఎలా ఇచ్చారో అన్ని వివరాలు ఈడీ బయటకు తీసింది. ఇవన్నీ కవిత ఇచ్చిన ఫోన్లలో ఉండే సమాచారం ఆధారంగానే బయటకు వచ్చాయని చెప్పడానికి లేదంటున్నారు. అసలు ఆమె నమ్ముకున్న బుచ్చిబాబు, పిళ్లై ఇద్దరూ ఈడీకి వివరాలు చెప్పడం వల్లనే సాధ్యమయిందని అంచనా వేస్తున్నారు. మూడు రోజుల కిందట ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ అయ్యాడన్న ప్రచారం జరిగిందిఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ కవితకు పర్సనల్ ఆడిటర్ గా పని చేయడమే కాకుండా సౌత్ లాబీ తరపున మొత్తం ఆర్థిక వ్యవహారాలను చక్క బెట్టారు హైదరాబాద్ కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఒక్క దినేష్ అరోరా మాత్రమే అప్రూవర్ గా మారారు. ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ గా మారితే ఎంపీ కవిత మరిన్ని కష్టాల్లో కూరుకున్నట్లే. డబ్బుల ట్రాన్స్ ఫర్ గుట్లన్నీ ఆయన చెబితే కేసు మొత్తం వీడిపోతుంది. నగదు లావాదేవీలు జరిగాయని తేల్చితే కేసును త్వరగా ముగిస్తారు. ఇప్పుడు ఆర్థిక లావాదేవీల విషయాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. బుచ్చిబాబు ఆప్రూవర్‌గా మారితే ఆ విషయాన్ని కోర్టుకు చెప్పాలి. కానీ ఇంకా ఈడీ కోర్టుకు చెప్పలేదు.

అప్రూవర్ మారుతున్నట్లుగా బుచ్చిబాబు పిటిషన్ వేస్తాడో లేదో కానీ ఆయన కవిత ఆర్థిక వ్యవహారాలు ఢిల్లీ లిక్కర్ స్కాం ఆదాయాలు ముడుపులు పెట్టుబడులు భూముల గురించి మొత్తం బయట పెట్టేసినట్లుగా ఈడీ తాజా చార్జిషీట్‌లో స్పష్టమయింది. ఓ ఆడిటర్ చెప్పారంటే దానికి ఇక తిరుగులేనట్లే భావించవచ్చు దానికి తగ్గ ఆధారాలు ఉంటాయి. ఇక కవిత తన పేరును బినామీగా పెట్టుకున్నట్లుగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై పూర్తిగా చేతులెత్తేశారు. తన పేరు మీద నడుస్తున్నా అది తనది కాదని కవితదేనని ఆయన ఎప్పుడో చెప్పేశారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని మరో పిటిషన్ వేశారు. కానీ మరీ పిల్ల చేష్టలాగా ఉందన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో ఉంది. ప్రస్తుతం ఈడీ దాఖలు చేసిన మూడో చార్జిషీటు దాఖలు తర్వాత బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆందోళన కనిపిస్తోంది.

ఈడీ అరెస్ట్ చేయకుండా కవిత ఇప్పటికైతే తప్పించుకున్నారు. కాలు ఫ్రాక్చర్ పేరుతో గత ఇరవై రోజులుగా ఆమె బయట కనిపించడం లేదు. ఈ మధ్యలో సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పై త్వరగా విచారణ కావాలని ఓ సారి మెన్షన్ చేయించారు. మహిళల్ని ఆఫీసుకు పిలిపించి ప్రశ్నించకూడదని ఇంటికే వచ్చి ప్రశ్నించాలని కోరడంతో పాటు అసలు ఢిల్లీ లిక్కర్ స్కాంను ప్రత్యేక సిట్ తో దర్యాప్తు చేయించాలని ఆ పిటిషన్‌లో కవిత కోరారు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందో లేదో స్పష్టత లేదు. ఆ పిటిషన్ వర్కవుట్ అవుతుందో లేదో కానీ ఇప్పుడు కవిత మాత్రం తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. సాక్ష్యాలు పక్కాగా ఈడీ సేకరించింది. తాజా చార్జిషీటు ద్వారా స్పష్టమయింది. అంత కంటే ముఖ్యంగా బుచ్చిబాబు, పిళ్లై అసలు విషయాలు చెప్పడంతోనే కవితకు తప్పించుకోలేనన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్‌లు రిలీజ్ చేసినప్పుడు తీవ్రంగ ఖండించిన కవిత ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత మాత్రం స్పందించలేదు. న్యాయవర్గాలతో ఆమె విస్తృత సంప్రదింపులు జరుపుతున్నారని భావిస్తున్నారు.