ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో సమర శంఖం పూరించారు. వచ్చె ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని మోదీ హైదరాబాద్‌లో కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ శ్రేణుల కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ కుటుంబ పాలన పోవాల్సిందేనని చెప్పారు. తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందని దేశంలో ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ కమలం వికసిస్తుందని అన్నారు. అవినీతి, కుటుంబపాలన ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువని మోదీ చెప్పారు. తెలంగాణలో చీకటి తొలగిపోయే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు.
ఆ తరువాత మోదీ పెద్దపల్లి జిల్లా రామగుండంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలని రాజకీయ కుతంత్రాలతో స్వార్థ రాజకీయాలతో అబాసు పాలు చేస్తున్నారని అలాంటి వాళ్లని వెతికి పట్టుకుంటామన్నారు. తెలంగాణలో రోజుకో రంగు మారుతున్న ప్రభుత్వం ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ సభకు వచ్చిన జన సమూహంతో హైదరాబాద్‌లో కొందరికి నిద్ర పట్టదంటూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. నిద్ర పట్టనిది ఎవరికి అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.