ప్రధాని వస్తే రణరంగమే

By KTV Telugu On 9 November, 2022
image

ప్రధాని మోడీ రామగుండం పర్యటనపై రగడ
12న మోడీ టూర్ ను సక్సెస్ చేసే పనిలో బీజేపీ
అడ్డుకుంటామన్న టీఆర్ఎస్, వామపక్షాలు, విద్యార్థి జేఏసీ
మోడీ వస్తే రామగుండం అగ్నిగుండమవుతుందని వార్నింగ్

ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌పై పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర, మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు, ఇతర అంశాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య విమర్శల యుద్ధం సాగుతుండగా ఇప్పుడు మోడీ పర్యటన, ప్రోటోకాల్‌ రగడ మరింత ఆజ్యం పోసే పరిస్థితి కనిపిస్తోంది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు ఈనెల 12న మోడీ తెలంగాణకు వస్తున్నారు. మోడీ టూర్ ను సక్సెస్ చేసే పనిలో బీజేపీ నేతలుంటే, అడ్డుకునే ప్రయత్నాల్లో టీఆర్ఎస్, వామపక్షాలున్నాయి. మోడీ, కేసీఆర్ ల మధ్య రెండేళ్ల క్రితం మొదలైన ప్రోటోకాల్ రగడ మళ్లీ తెరపైకి వచ్చింది. రామగుండం ఫ్యాక్టరీలో తెలంగాణ రాష్ట్రం అధికారిక భాగస్వామిగా ఉన్నా మోడీ సర్కార్ కనీస ప్రొటోకాల్‌ పాటించడం లేదని టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆహ్వాన పత్రంలో ప్రధాని తర్వాత సీఎం హోదాలో కేసీఆర్‌ పేరు ఉండాలని కానీ ప్రొటోకాల్‌ పాటించలేదని ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించింది. అదేసమయంలో పలు కీలక అంశాలపై నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా? ఏమైనా తెస్తారా? తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఏం చెప్తారు విభజన చట్టం హామీల సంగతేంటి? అంటూ బీజేపీని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది.

మోడీ పర్యటనను అడ్డుకుంటామంటూ వామపక్ష నేతలు, విద్యార్థి జేఏసీ ప్రకటనలు చేయడం హీట్ పుట్టిస్తోంది. ప్రధాని వస్తే రామగుండం అగ్నిగుండం అవుతుందంటూ హెచ్చరిస్తున్నారు. తక్షణమే యూనివర్సిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లును ఆమోదించాలని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. అటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా మోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. నిన్నటిదాకా మునుగోడులో గులాబీ, కాషాయ దళాలు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఈ హోరాహోరీ పోరులో పై చేయి సాధించిన గులాబీ దండు మరింతగా దూకుడు పెంచుతోంది. ఢిల్లీ లెవల్లో బీజేపీపై పోరుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. కేసీఆర్ కు తోడుగా కామ్రెడ్స్ జతకలవడంతో కమలనాథులపై అటాకింగ్ పెరుగుతోంది. అటు బీజేపీ కూడా గులాబీ దళపతికి కౌంటర్ గా మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతిభవన్ గా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ సమయంలో మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభ కార్యక్రమానికి రానుండడం రాజకీయ వేడి రగిల్చింది. గతేడాదే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమైందని ఇప్పుడు వచ్చి జాతికి అంకితం చేయడమేంటని ఇటు టీఆర్ఎస్, అటు వామపక్ష నేతలు ప్రధానిని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోడీ ఉత్సాహం చూపుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు

మరోవైపు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో రైతులతో రైతే రాజు అనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు కమలనాథులు. రైతులతో కిలోమీటర్ మేర ర్యాలీ నిర్వహించే ప్రయత్నాల్లో ఉన్నారు. దాంతో పాటు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక పనులపై ప్రజలకు తెలియజేప్పేందుకు 11న ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. మోడీ కార్యక్రమం రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూసేలా అన్ని నియోజకవర్గాల్లో ఫంక్షన్ హాల్ లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. 1000 మంది రైతులతో ప్రధాని మోడీ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ప్లాన్ చేశారు. ఇక పెద్దపల్లి జిల్లా తో పాటు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో రైతులను మోడీసభకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.