తెలంగాణ కాంగ్రెస్ గురించి గులాబీపార్టీ పెద్దగా టెన్షన్ పడటంలేదు. ఎందుకంటే వాళ్లలో వాళ్లు కొట్టుకోడానికే టైం సరిపోదు. అంతా కలిసికట్టుగా గట్టి పోటీ ఇస్తారని భయపడాల్సిన పన్లేదు. ఆ పార్టీలో అంతా కట్టప్పలేనన్నట్లు ఉంటుంది పరిస్థితి. కాంగ్రెస్ బలహీనతను క్యాష్ చేసుకోవచ్చనుకున్న కమలం పార్టీలోనూ చివరికి అదే జరుగుతోంది. తెలంగాణలో ఈసారి అధికారం మాదేనంటున్న కాషాయపార్టీ చొక్కావిప్పితే చిరుగుల బనీనేనన్న విషయం అందరికీ అర్ధమవుతోంది.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక ఆ పార్టీలో జోష్ పెరిగింది. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు బండి సంజయ్. కానీ అదే సమయంలో అంతా తానేనన్నట్లు అహంభావంతో ప్రదర్శించటంతో ఆ వ్యతిరేకత ఇప్పుడు బయటపడుతోంది. కొత్తగా పార్టీలోకొచ్చి సొంతబలంతో హుజూరాబాద్‌లో గెలిచిన ఈటల రాజేందర్‌నుంచి మొదలుపెడితే పార్టీలో చాలామంది సీనియర్లు బండి సంజయ్‌తో విభేదిస్తున్నారు. చివరికి ప్రజాసంగ్రామయాత్రను కూడా తన సొంత ప్రోగ్రామ్‌లా మార్చుకున్నారన్నది బండి సంజయ్‌పై పార్టీ నేతలకున్న ఆక్షేపణ.
కవితపై ఈమధ్య బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై దుమారం రేగింది. అరెస్ట్ చేయకుండా ముద్దుపెట్టుకుంటారా అన్న మాట ఫ్లోలో వచ్చినా ఆ కామెంట్‌ని సొంతపార్టీ నేతలే అంగీకరించడం లేదు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బండి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు. అదే సమయంలో బీజేపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి పవర్‌సెంటర్ కాదని ఘాటువ్యాఖ్యలు చేశారు అర్వింద్. అర్వింద్ వ్యాఖ్యలను సమర్థిస్తూ అంతకంటే సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ సీనియర్ నేత పేరాల శేఖర్‌రావు. బండి తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని తప్పుపట్టారు.
బండి సంజయ్ దూకుడుతో డమ్మీలుగా మిగిలిపోతున్నామన్న అసంతృప్తితో చాలామంది నేతలున్నారు. అందరూ కష్టపడుతున్నా బండి సంజయ్ ఒక్కడే క్రెడిట్ కొట్టేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఆయన ఎవరినీ కలుపుకుని పోకుండా తానొక్కడే హైలైట్ కావాలనుకుంటున్నరన్నది పార్టీనేతల ఫీలింగ్. అంతర్గతంగా విభేదాలు పెరుగుతున్నాయని గ్రహించే ఈమధ్య అమిత్‌షా నడ్డా ఒకటికి రెండుసార్లు తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. బండి సంజయ్ పాదయాత్రకు కూడా బ్రేకేశారు. ఆ మీటింగ్ తర్వాత కూడా టీబీజేపీ నేతల్లో సఖ్యత కుదరలేదనేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. అర్వింద్ వ్యాఖ్యలను రాజాసింగ్ విజయశాంతి తప్పుపట్టినా టీబీజేపీలో లుకలుకలు కాంగ్రెస్‌తో పోటీపడుతున్నాయనేది మాత్రం వాస్తవం.