2024 ఎన్నికల్లోనూ కేంద్రంలో అధికారంలోకి రాబోయేది తామేనని ధీమా వ్యక్తం చేస్తోన్న కమలనాథులు తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికలను మించి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని వారు పట్టుదలగా ఉన్నారు. ఇప్పట్నుంచే బలమైన అభ్యర్ధుల అన్వేషణలో ఉన్నారు. మరో పక్క అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన గులాబీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో తిరిగి క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్, బిజెపిలకు చుక్కలు చూపించాలని భావిస్తోంది. పకడ్బందీ ప్రణాలికలతో గులాబీ నాయకత్వం దూసుకుపోతోంది.
పార్లమెంట్ ఎన్నికల విషయంలో తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పదికి పైగా ఎంపీ సీట్లను తెలంగాణ నుంచి రాబట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో యాక్షన్ ప్లాన్ ప్రారంభించేసింది. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానంపై అధిష్టానం ఆలోచన చేస్తోంది. మిగతా స్థానాల్లో దాదాపుగా అభ్యర్థుల ఎంపికపై అధినాయకత్వం కసరత్తు ప్రారంభించేసింది.
మహబూబ్ నగర్ అభ్యర్థిగా డీకే అరుణ, చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి సుధాకర్ రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్, వరంగల్ అభ్యర్థిగా రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ పేర్లను దాదాపుగా ఫైనల్ చేసినట్లు సమాచారం.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి పరాజయం పాలైన ఈటల రాజేందర్… పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు డజను మందికి పైగా పోటీ పడుతున్నారు. మల్కాజిగిరి స్థానంలో గతంలో రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో రెడ్డి వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారని.. ఈ కోణంలో కూకట్‌పల్లికి చెందిన పన్నాల హరీశ్ రెడ్డి టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు.
ఇక బీజేపీ జాతీయ నేతలు మురళీధర్ రావు, వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి మల్కాజిగిరి టికెట్ పై ఆశలుపెట్టుకున్నారు. జహీరాబాద్ ఎంపీ టికెట్ కూడా బీజేపీలో భారీ డిమాండ్ ఉంది. ఈ స్థానం నుంచి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. జహీరాబాద్ సీటు కోసం బీజేపీలో అడ్వకేట్ రచనారెడ్డి, చీకోటి ప్రవీణ్, ఆకుల విజయ, విఠల్ తదితర నేతలు పోటీపడుతున్నారు.ఇక మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి రఘునందన్ రావును మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి విరించి ఆస్పత్రి ఛైర్మన్ మాధవిలత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో… రమేశ్ రాథోడ్ ను బరిలో దింపాలని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ టికెట్లు దక్కనివారు… డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు బీజేపీ హైకమాండ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అసమ్మతి నేతలకు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పని అప్పగించే ఆలోచన చేస్తున్నారు. ఇక బి.ఆర్.ఎస్. కూడా చాలా సీరియస్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో కాకుండా ఈసారి మరింత పకడ్బందీగా వ్యూహా రచన చేస్తోంది. ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్న ఎమ్మెల్యేలను మార్చకుండా అసెంబ్లీ ఎన్నికల్లో సిట్ట్టింగులకే అవకాశం కల్పించడంతోనే గులాబీ పార్టీ అధికారానికి దూరం అయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకూడదని భావిస్తోంది. కమలం, కాంగ్రెస్ పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వీలైన ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చేవెళ్ల, కరీంనగర్ లాంటి స్థానాల్లో గతంలో పోటీ చేసిన అభ్యర్థుల్ని పనులు చేసుకోండి అంటూ పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, కరీంనగర్ నుండి గతంలో పోటీ చేసి ఓడిన వినోద్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలో అభ్యర్థులను మార్పు చేయకపోతే జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో మార్పులు చేయడం ఖాయం అంటూ తెలంగాణ భవన్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…