కమలం పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డి

By KTV Telugu On 20 January, 2023
image

బీసీలకు పెద్ద పీట వేస్తామని బీజేపీ అధిష్టానం చెబుతుంటుంది. అత్యధిక స్థానాలు వారికే ఇస్తామంటుంది. మాటలకు చేతలకు ఎంతో తేడా ఉందని మాత్రం వారి చర్యలు చెప్పకనే చెబుతుంటాయి. బీసీలకు ఇవ్వాల్సిన టికెట్లు అగ్రవర్ణాల చేతుల్లో పెడుతున్నారన్న ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి ప్రస్తుతం సికింద్రాబాద్ లోక్ సభా స్థానంలో జరుగుతున్న తంతు చూస్తే ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. బీసీలకు, దళిత వర్గాలకు కేటాయించాల్సిన నియోజకవర్గంలో కిషన్ రెడ్డి పోటీ చేసి గెలవడమే కాకుండా ఇప్పుడు అక్కడ రెడ్లకు పెద్ద పీట వేస్తున్నారని పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి..

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉంది. గతంలో సికింద్రాబాద్ నుంచి టీ.‌అంజయ్య, పీ.శివశంకర్, దత్తాత్రేయ లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నుంచి ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి అవుతారన్న సెంటిమెంట్ కూడా ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా పని చేసిన టీ.అంజయ్య ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. శివశంకర్, దత్తాత్రేయ కేంద్రమంత్రులుగా సేవలందించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కిషన్‌రెడ్డి మోదీ క్యాబినెట్‌లో కేంద్రమంత్రిగా ఉన్నారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని కమలం పార్టీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సిట్టింగ్ సీటైన సికింద్రాబాద్‌ను తిరిగి దక్కించుకోవాలని బీజేపీ హైకమాండ్ గట్టి పట్టుదలతో ఉంది. వాస్తవానికి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు కేటాయించడం ఆనవాయితీ వస్తోంది.‌ అయితే 2019లో పార్లమెంట్ ఎన్నికలో పాత సంప్రదాయాన్ని బీజేపీ తుంగలో తొక్కిందన్న వ్యాఖ్యలు అప్పట్లో విన్పించాయి. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ సీటును బీజేపీ ఎవరికి కేటాయిస్తోందనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటివరకు సికింద్రాబాద్ పార్లమెంట్‌కు 18సార్లు ఎన్నికలు జరగ్గా 11సార్లు కాంగ్రెస్ పార్టీ, 5 సార్లు బీజేపీ, రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. అధికార బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్‌ను ఒక్కసారి కూడా గెలుచుకోలేదు‌.

1957 నుంచి 1977 వరకు వరుసగా ఐదు సార్లు కాంగ్రెస్ నేత సాయికిరణ్ ముదిరాజ్ సికింద్రాబాద్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పి.శివశంకర్ రెండుసార్లు సికింద్రాబాద్ ఎంపీగా పని చేశారు. టీ.అంజయ్య, ఆయన సతీమణి మణెమ్మ కూడా ఇక్కడ నుంచే గెలిచారు. కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఐదుసార్లు సికింద్రాబాద్ ఎంపీ‌ సీటును గెలుచుకుంది. కురుమ సామాజివర్గానికి చెందిన బండారు దత్తాత్రేయ నాలుగుసార్లు సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్ సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీ నుంచి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు‌.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ బీసీ అభ్యర్థులు అంజన్‌కుమార్‌, సాయికుమార్‌యాదవ్‌లను రంగంలోకి దించారు. బీజేపీ మాత్రం రెడ్డి సామాజికవర్గానికి చెందిన కిషన్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు బీజేపీలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి అయిన తర్వాత సికింద్రాబాద్ బీజేపీలో బీసీలు, రెడ్ల పంచాయతీ ఎక్కువైనట్లు తెలుస్తోంది. బీసీల స్థానాలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రెడ్ల సీట్లుగా మార్చేస్తున్నారని బీజేపీలోని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్లాల్లో సైతం బీజేపీలో అగ్రవర్ణాలదే డామినేషన్. వీరందకీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆశీస్సుల మెండుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పుడు అంబర్‌పేట అసెంబ్లీ సీటును పలువురు బీసీ అభ్యర్థులు ఆశిస్తున్నట్లు బీజేపీలో టాక్‌ నడుస్తోంది. వీరిలో అమృతయాదవ్ లాంటి మహిళా కార్పోరేటర్ కూడా ఉన్నారు. అసలు అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి స్వయంగా పోటీ చేస్తారని మరో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఈ సారి బీసీలకు పెద్ద పీట వేస్తారా లేదా అన్న ప్రశ్న తెలుస్తోంది. డాక్టర్ లక్ష్మణ్ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నా… మున్నూరు కాపు సామాజికవర్గానికి చెంది‌న బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందిస్తున్నా ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం ఇస్తారన్న విశ్వాసం లేదని కొందరంటున్నారు. త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. అత్యధిక స్థానాల్లో బీసీలను రంగంలోకి దించితే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు నేతలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. మరి ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలి.