బీజేపీలోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

By KTV Telugu On 17 December, 2022
image

ఒకవైపు ఆధిపత్య పోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమలో తాము తగవులాడుకుంటుంటే మరోవైపు సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. ఈమధ్యే సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు మరో సీనియర్ నాయకుడు కూడా పార్టీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలంగా పార్టీ లో అసమ్మతి స్వరం వినిపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాషాయ తీర్థం పుచ్చుకోడానికి డిసైడ్ అయినట్టే.

పీసీసీ చీప్‌ పదవి ఇస్తారని వెంకటరెడ్డి ఆశించారు. తనకు పీసీసీ పగ్గాలు ఇస్తే సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకువెళతానని చెప్పుకున్నారు. కానీ అధిష్టానం రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. అప్పటినుంచి రేవంత్‌ను టార్గెట్‌ చేసుకున్నారు వెంకటరెడ్డి. ప్రతిసందర్బంలో కూడా పార్టీ మీద అసమ్మతి గళం వినిపిస్తూ ఉన్నారు. ఆమధ్య తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉపఎన్నికలో పోటీచేశారు. అయితే తన సొంత పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి వెంకటరెడ్డి ఆసక్తి చూపలేదు. ఎన్నికల సమయానికి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. తాను ప్రచారం చేసినా చేయకున్నా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ గెలవదని వ్యాఖ్యానించారు.

పైగా కొందరు కాంగ్రెస్ నేతలకు ఫోను చేసి బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న తన తమ్ముడిని గెలిపించాలని విజ్ఞప్తి చేసినట్లున్న ఆడియో రికార్డులు బయటపడ్డాయి. వెంకటరెడ్డి తీరుపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధిష్టానం కూడా ఆయనకు రెండు సార్లు షోకాజు నోటీసులు ఇచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కొత్త ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ కి ఏర్పాటుచేసిన కొత్త కమిటీలపై ఫిర్యాదు చేశారు. అయితే ఖర్గేను కలిసిన రెండో రోజే ఆయన ప్రధాని మోడీని కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానిని కలిసిన తర్వాత తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన పెద కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తానని అనౌన్స్‌ చేశారు. ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననేది ఎన్నిక సమయంలో చెబుతానని మెలిక పెట్టారు. ఆయన మాటల్లోని మర్మం గమనిస్తే అతి త్వరలో బీజేపీలో చేరడం ఖాయం అనంటున్నారు రాజకీయ పరిశీలకులు. నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తనకు తాను ప్రకటించుకోవడం అందులో భాగమే అని అంటున్నారు.