కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎం.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంతకాలంగా పీసీసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఆయనకు పొసగడం లేదు. ఆయనొక్కరే కాదు పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్నవారే. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరగింది. ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఆయన మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. తాను ప్రచారం చేసినా చేయకపోయినా అక్కడ కాంగ్రెస్ గెలవదని జోష్యం చెప్పి ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిపోయారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధిష్టానం ఆయనకు రెండు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ఇటీవల 18 మంది నేతలతో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటైంది. అలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షులతో పాటు 24 మంది వైస్ ప్రెసిడెంట్లు, 84 మంది జనరల్ సెక్రటరీలను అధిష్టానం నియమించింది. ఈ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తితోనే ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. త్వరలో జాతీయ స్థాయిలో వెంకటరెడ్డికి కీలక పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది.
అయితే అనూహ్యంగా ప్రధాని మోదీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అపాయింట్‌మెంట్ ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ కావాలని పీఎంవో నుంచి సమాచారం అందింది. మోదీతో కోమటిరెడ్డి భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరతానని కోమటిరెడ్డి చెబుతున్నారు. అయితే ఆయన బీజేపీలో చేరడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అందుకే బీజేపీలో చేరేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. త్వరలో వెంకటరెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.