పొగచూరింది.. బీజేపీలోకి పొంగులేటి?

By KTV Telugu On 5 January, 2023
image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం గుమ్మంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో గులాబీ నేతలు ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. తుమ్మల ఎక్కడా పార్టీని పల్లెత్తు మాట అనకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతుంటే కొత్త ఏడాది రోజు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన తిరుగుబాటు వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్టీ ఏదైనా ఈసారి పోటీ పక్కా అని చెప్పిన పొంగులేటి సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానంటూ బాంబ్ పేల్చారు. పార్టీకి తనకు ఇచ్చిన గౌరవం ఏపాటిదో చెబుతూ వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని చెప్పడం గులాబీ పార్టీలో దుమారం రేపింది. అయితే అంతే స్పీడ్‌గా స్పందించిన అధిష్టానం పొంగులేటికి షాక్ ఇచ్చింది. ఆయనకున్న త్రీ ప్లస్ త్రీ భద్రతను టు ప్లస్ టు కి తగ్గించింది. పైలెట్ సెక్యూరిటీని ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించారు. ఇంటి దగ్గర భద్రతా సిబ్బందిని కూడా తగ్గించారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

2014 ఎన్నికల్లో ఖమ్మం వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధుల ఓటమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటిని ఆయన ఖండించారు. అప్పుడే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ముద్రపడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సేవలు పార్టీకి అవసరమని భావించిన కేసీఆర్ కేటీఆర్ ద్వారా అదుపు చేస్తూ వస్తున్నారు. కేటీఆర్ ఇచ్చిన గట్టి హామీ మేరకు పొంగులేటి పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఓ సారి రాజ్యసభకు పంపుతారని మరోసారి చర్చ జరిగింది. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. అయినా మంత్రి కేటీఆర్ తో ఉన్న అనుబంధం రీత్యా పార్టీలోనే ఉన్నారు పొంగులేటి.

ఇక పార్టీలో అవమానభారంతో ఉన్న పొంగులేటి అనుచర వర్గం మరో దారి చూసుకోవాలంటూ తమ బాస్‌పై ఒత్తిడి పెంచుతూ వస్తుంది. దాంట్లో భాగంగానే జనవరి ఒకటిన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. దాంతో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జోరందుకుంది. పొంగులేటితో పాటు ఆయన అనుచరులకు బీజేపీలో టికెట్లు ఖాయమనైట్లు సమాచారం. జిల్లాలో మంచి పేరు అంగబలం అర్ధబలం ఉండడంతో పాటు ఆయన ఏ పార్టీలో చేరినా గెలుపు ఖాయం అన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఆయనతో టచ్‌లోకి వెళ్లిన బీజేపీ పార్టీలోకి రావాలని పలుమార్లు సంప్రదింపులు జరిపిందట. పొంగులేటిని పార్టీలోకి తీసుకొని ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా పొంగులేటితో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా ఆయనపై తీవ్రస్థాయిలో స్పందించారు. చెంపలు నిమురుతూ, అన్నా అక్కా అనుకుంటూ మీ వద్దకు వస్తుంటారు వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గంగిరెద్దు వాళ్ళ వేషాలను కట్టిపెట్టాలని కాస్త గట్టిగానే మాట్లాడారు. మొత్తంగా అధిష్టానం సెక్యురిటీని తగ్గించి పొగబెట్టడంతో పొంగులేటి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో ఆయన అడుగులు ఏవిధంగా ఉండబోతున్నాయనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.