ముదిరాజ్ వర్సెస్ బీఆర్ఎస్

By KTV Telugu On 30 October, 2023
image

KTV TELUGU :-

రాజకీయాల్లో చేసే కొన్ని వ్యూహాత్మక తప్పిదాలే పార్టీలకు గుదిబండవుతాయి. సీటు కిందకు నీళ్లు తీసుకు వస్తాయి. ఈ సారి ఇలాంటి స్ట్రాటజిక్ మిస్టేక్‌లు బీఆర్ఎస్ వైపు నుంచి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ముదిరాజ్ వర్గానికి ఒక్క టిక్కెట్ కూడా కేటాయించకపోవడం. ఆ వర్గం మొత్తం ఏకం అయింది. దీంతో ముదిరాజ్‌లను సంతృప్తి పరిచేందుకు బీఆర్ఎస్ ఆ వర్గానికి చెందిన ప్రముఖులకు తిరస్కరించలేని ఆఫర్లు ఇస్తూ పార్టీలోకి తీసుకుంటోంది. ఇది ఆ వర్గాన్ని మరింత రెచ్చగొట్టినట్లుగా అవుతోందన్న  ఫీడ్ బ్యాక్‌ను బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. తప్పు మీద తప్పు చేస్తూ ముదిరాజులను దూరం చేసుకుంటున్నారు. ఈ ప్రభావం బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాలపైనా పడే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ బీసీ వర్గాల్లో ముదిరాజుల వర్గం ప్రభావవంతమనది. ఈ వర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ ఆయన బయటకు వచ్చే వరకూ కీలకంగా ఉన్నారు. ఆలె నరేంద్ర, విజయశాంతి సహా అనేక మంది రెండో స్థానంలో ఉన్న నేతలు అవమానకరంగా బీఆర్ఎస్ నుంచి గెంటివేతకు గురైన పరిస్థితులే.. ఈటల రాజేందర్‌కూ ఎదురయ్యాయి.  అప్పట్నుంచి ముదిరాజులు బీఆర్ఎస్‌పై ఆగ్రహంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క టిక్కెట్ కూడా కేటాయించకపోవడంతో అది రెట్టింపు అయింది. నీలం మధు ముదిరాజ్ అనే నేతను ఆశపెట్టి చివరికి హ్యాండివ్వడం వారి ఆగ్రహం పెరగడానికి కారణం అయింది.

తెలంగాణ ఓటర్లలో సగం మందికిపైగా  బీసీ వర్గాల వారు ఉంటారు. ఆ బీసీ వర్గాల్లో ముదిరాజుల ఓట్లు కనీసం యాభై లక్షలు ఉంటాయని అంచనా. అంటే వీరిని ఏ మాత్రం తేలికగా తీసేసేందుకు ఏ రాజకీయ పార్టీలూ సిద్ధంగా ఉండవు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఆ వర్గానికి ప్రతినిధిగా ఉన్నారు. ఆయను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాత ఆ వర్గం ఓట్లు దూరమవకుండా ఉండేందుకు కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. చివరికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ను రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీని చేశారు. ఆయనను మంత్రిని చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ మంత్రి వర్గంలో మార్పు చేర్పులు చేస్తే ఆ రచ్చ తట్టుకోవడం కష్టమని ఆగిపోయారు. బండా ప్రకాష్ హోదాను తగ్గించినట్లయింది. అంటే అక్కడా ముదిరాజ్ వర్గానికి అన్యాయం జరిగింది. ఇలాంటి పరిణామాలతో  ముదిరాజులు బీఆర్ఎస్‌కు దూరమవుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క టిక్కెట్ కూడా ముదిరాజుల వర్గానికి కేటాయించలేదు. దీంతో మరితం రచ్చ అయింది.

ఉమ్మడి మెదక్ జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో నీలం మధు ముదిరాజ్ అనే నేతను బీఆర్ఎస్ హైకమాండ్ ప్రోత్సహించింది. ఆయనకు టిక్కెట్ అన్నట్లు ఆశ పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు పోటీగా ఆయన బలంగా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న మహిపాల్ రెడ్డి పై అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముదిరాజ్ కోటా కింద నీలం మధుకు టిక్కెట్ ఖాయమనుకున్నారు. కానీ కేసీఆర్ ఆలోచించారో కానీ నీలం మధుకు టిక్కెట్ కేటాయించలేదు. ఇది ముదిరాజ్ వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. నీలం మధు పట్టు విడవకుండా.. బుజ్జగింపులకు లొంగకుండా పోటీకి సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజ్ వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. బహిరంగసభ నిర్వహించారు. ఇది బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. వెంటనే ఆపరేషన్ ముదిరాజ్ ప్రారంభించారు.  దిద్దుబాటు చర్యలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. తిరస్కరించలేని ఆఫర్లు ఇచ్చి ముదిరాజ్ వర్గంలో పేరున్న వారిని పార్టీలో చేర్చుకుంటోంది.

రెండేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ రాజీనామా చేయించి ఉద్యోగ సంఘం నేత మామిళ్ల రాజేందర్ ను ముదిరాజ్ అన్న కారణంగానే పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ను కూడా పిలిచి ఆఫర్ ఇచ్చి కండువా కప్పుకోబోతున్నారు. ముదిరాజ్‌ల బహిరంగసభలో బిత్తిరి సత్తి ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనకే కండువా కప్పేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై ఊగిసలాడుతున్న  టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీఆర్ఎస్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా చెబుతున్నారు.

ముదిరాజుల విషయంలో తాము తప్పు చేసినట్లుగా.. దిద్దుకుంటున్నట్లుగా నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తోంది కానీ.. మెరుగు పర్చడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వినిపిస్తోంది. ముదిరాజులు ఏకమైతే.. బీఆర్ఎస్ అగ్రనేతల నియోజవర్గాల్లోనే గడ్డు పరిస్థితులు ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ముదిరాజుల విషయంలో తాము తప్పు చేసినట్లుగా బీఆర్ఎస్ వ్యవహారశైలి ఉందన్న అభిప్రాయం ముదిరాజులకు ప్రాధాన్యత కల్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారికి ఆఫర్లు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటూడటంతో ఏర్పడుతోంది.  ఆ వర్గంలో ప్రముఖుల్ని పిలిచి కండవా కప్పినంత మాత్రాన దిగువస్థాయిలో అసంతృప్తి పోదని.. ఇలాంటి చర్యల వల్ల వారు మరంత ఏకమవుతారన్న వాదన వినిపిస్తోంది. మరో వైపు కాంగ్రెస్ ఈ ముదిరాజుల అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. నీలం మధుకు టిక్కెట్ ఇచ్చే ఆలోచన చేస్తోంది. అయితే బీఆర్ఎస్‌లో ముదిరాజుల టెన్షన్ పెరగడానికి మరో కారణం ఉంది.  ముదిరాజ్‌ సామాజిక తరగతి ఓట్లు గజ్వేల్‌లో 60 వేలు, సిద్ధిపేటలో 45 వేలు, సిరిసిల్లలో 40 వేలు, కామారెడ్డిలో 30 వేల దాకా ఉన్నాయి. ఇవి ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. ఈ అంశాన్ని బీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ముదిరాజ్‌ల ఓట్లతోపాటు గజ్వేల్‌లో బీజేపీ నుంచి పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్‌ రూపంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఆ సామాజిక తరగతి దూరమవుతున్న విషయాన్ని గమనించి నష్ట నివారణా చర్యలను చేపట్టింది. 2014 నుంచి గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్ధిపేటలో వారు ముగ్గురూ బంపర్‌ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ముదిరాజ్‌ సామాజిక వర్గం వల్ల ఆ మెజారిటీ భారీగా తగ్గే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఓ వైపు బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలతో ముదిరాజులు పట్టు పెంచుతున్నారు. తమ వర్గంలో ఒకరిద్దరికి పిలిచి కండువా కప్పినంత మాత్రాన తమ అభిప్రాయం మారిపోదని అంటున్నారు. అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకపోవడం ఇంత మైనస్ అవుతుందని బీఆర్ఎస్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోయాయి. గతంలోనే ఈ వర్గం పార్టీకి దూరమైందని… కానీ సగానికిపైగా  బీఆర్ఎస్‌కే అండగా ఉంటారని భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ వర్గం చూపించే ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాలు రావడంతో… ప్రాధాన్యత కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ఓ సారి అవమానించారని తెలిసిన తర్వాత ఆ వర్గం మళ్లీ దగ్గరవ్వాలంటే.. ఎన్నికలకు ముందు ఎన్ని చేసినా సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.

ఎన్నికలు అంటేనే సామాజికవర్గాల సమీకరణాలు. బెస్ట్ కాంబినేషన్లను ఆకట్టుకున్న వారికి విజయం లభిస్తుంది. తెలంగామ సెంటిమెంట్‌తో అన్ని వర్గాలు ఇటీవలి కాలంలో వరకూ బీఆర్ఎస్‌కు అండగా ఉండేవి. మరి ఇప్పుడు ?

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి