ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు ను పోలినట్లుండే ఇతర గుర్తులు తమ కొంప ముంచుతాయని టీఆర్‌ఎస్ నాయకుల భయం. ఆ భయంతోనే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వారు హైకోర్టును ఆశ్రయించారు. కారు గుర్తును పోలినట్లున్న ఇస్త్రీ పెట్టే, రోటీ మేకర్, రోడ్డు రోలర్, ట్రక్కు వంటి ఎనిమిది గుర్తులను తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ విధుల్లో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తరువాత రిటర్నింగ్ ఆఫీసర్ ఒక స్వతంత్య అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును రద్దు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎన్నికల సంఘం రిటర్నింగ్ ఆఫీసర్‌ను బదిలి చేసి అప్పటికప్పుడు మరో ఆర్.ఓను నియమించింది. ఆయన రద్దు చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పునరుద్ధరించింది. మొత్తానికి ఎన్నికలు ముగిసాయి.
టీఆర్‌ఎస్ నాయకులు భయపడినట్లుగానే కారు కారు గుర్తును పోలిన ఇతర గుర్తులకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు పడ్డాయి. ఆ గుర్తులకు మొత్తం కలిపితే సుమారు 5 వేలకు పైగా ఓట్లను పోలయ్యాయి. రోటీ మేకర్ గుర్తుపై పోటీ చేసిన మారమోని శ్రీశైలం యాదవ్ కు 2,407 ఓట్లు వచ్చాయి. రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ 1,874 ఓట్లను సాధించారు. టెలివిజన్ గుర్తుకు 511, కెమెరా గుర్తుకు 502, ఓడ గుర్తుకు 153, చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు పడ్డాయి. ఓటర్లు ఓటు వేసే సమయంలో గుర్తులు పోల్చుకోవడంలో పొరపాటు పడి కారుకు వేయాల్సిన ఓటు ఇతర గుర్తులకు వేస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకుల వాదన. ఈ గుర్తుల కారణంగానే తమకు రావలసిన మెజార్టీ సుమారు అయిదువేల ఓట్ల మెజారిటీ తగ్గిపోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్ల టీఆర్‌ఎస్ విజయాన్ని ఈ గుర్తులే దెబ్బతీశాయని ఆ పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు.