మునుగోడు ఉప ఎన్నిక అంతకు ముందు ఉన్న అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతోంది. ఎన్నికల ఖర్చు విషయంలో ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక రికార్డును మించిపోయింది. ఇకపోతే ఇప్పుడు మద్యం అమ్మకాల్లోనూ మునుగోడు రికార్డులు బద్దలు చేస్తోంది. అక్కడ గతంలో ఎన్నడూ లేనివిధంగా మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. జనం రోజంతా మత్తులో మునిగి తేలుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు, మద్యం బాటిళ్లు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కార్యకర్తలకు డబ్బుతో పాటు తిన్నంతి తిండి, తాగినంత మందు పోస్తున్నారు. సాయంత్రం వేళ రాజకీయ పార్టీలు ప్రత్యేక ధావత్‌లు ఏర్పాటు చేస్తూ మద్యం బాటిల్స్ ఇస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఇంటింటికి ఒక్కో ఓటుకు ఒక్కో ఫుల్ బాటిల్ చొప్పున సరఫరా చేస్తున్నారు. దీనివల్ల మునుగోడులో ఏటు చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నుంచే ఇక్కడ మద్యం అమ్మకాలు ఊపందుకోగా.. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తరువాత రికార్డుస్థాయిలో అమ్మకాలు పెరిగాయి. ఈ నెల 22వ తేదీ వరకు సుమారు 160 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. పోలింగ్‌కు మరో 8 రోజులు సమయం ఉండటంతో మరింత జోరుగా మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నెల చివరి నాటికి 200 కోట్లు దాటే అవకాశం ఉందని అంటున్నారు. నియోజకవర్గంలో మునుగోడు మండలంలో ఎక్కువగా అమ్మకాలు జరగ్గా.. గట్టుప్పల్ మండలంలో తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయి. సాధారణంగా నల్లొండ జిల్లా మొత్తం ప్రతి నెల 132 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని.. కానీ మునుగోడు ఎన్నికల ప్రభావంతో ఒక్క నియోజకవర్గంలోనే 200 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉంది.