మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో మంగళవారం మధ్యాహ్నం బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా దాడికి దిగాయి. ఆ వెంటనే బీజేపీ కార్యకర్తలు కూడా ఎదురుదాడికి దిగారు. దాంతో ఆ గ్రామంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. మొదట…ఈటల కాన్వాయ్ పలివెలకు రాగానే… కాన్వాయ్ లోని వాహనాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆ కాన్వాయ్ వెంటే వస్తున్న బీజేపీ శ్రేణులు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఎదురుదాడి ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేయలేకపోయారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో ఈటల కాన్వాయ్ లోని పలు వాహనాలతో పాటు ఆయన కారు కూడా ధ్వంసం అయింది. ఈటల పీఆర్వో కాలికి గాయమైంది. అదే సమయంలో బీజేపీ శ్రేణుల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్ కు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణులు తమపై దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ నిలుచున్నారని ఈటల మండిపడ్డారు. అంతేకాకుండా ఈ దాడికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డే కారణమంటూ ఆయన ఆరోపించారు. ఈ దాడుల గురించి ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మునుగోడు ప్రజలు అంతా గమనిస్తున్నారని, టీఆర్‌ఎస్‌కు బుద్ది చెబుతారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నిక సాఫీగా జరగాలంటే కేంద్ర పోలీసులను రంగంలోకి దించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు పలివెల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మునుగోడుకు అదనపు బలగాలను తరలించాలని ఆదేశించింది.