హోరాహోరీ ప్రచారం , ఆఖరి గంటల్లో స్ట్రీట్ ఫైట్లు జరిగినా ఇతర పార్టీలు ….కారు స్పీడును బ్రేకులు వేయలేకపోతున్నాయి. ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కే విజయావకాశాలున్నట్లు అన్ని సర్వేలు చెబుతున్నాయి.
ఉప ఎన్నిక షెడ్యూల్ నుంచే టీఆర్ఎస్ లో ఆత్మవిశ్వాసం
కార్యకర్తల్లో జోష్ తగ్గకుండా చూసుకుంటున్న నేతలు
జనం టీఆర్ఎస్ వైపే ఉన్నట్లు చెబుతున్న సర్వేలు
ఉప ఎన్నిక వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ లో ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ప్రతీ నేతలో విజయహాసం దర్శనమిస్తోంది. ప్రచారంలో సంఘర్షణ, అన్ని పార్టీలు డబ్బు పంచడం లాంటి అంశాలు ఎలా ఉన్నా…. టీఆర్ఎస్ నాయకులు మాత్రం తమ కార్యకర్తల్లో జోష్ తగ్గకుండా చూసుకున్నారు. ఎంత విభజన వచ్చినా.. ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా… జనం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి.
ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు
నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గం
అంకితభావంతో పనిచేసిన టీఆర్ఎస్ కేడర్
భౌగోళికంగా మునుగోడు నియోజకవర్గం ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల పరిధిలో విస్తరించి ఉంది. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాలు నల్లగొండ జిల్లా పరిధిలోకి వస్తుండగా, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలు యాదాద్రి జిల్లా పరిధిలోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు, యాదాద్రి జిల్లాల్లోని చౌటుప్పల్ మునిసిపాలిటీలుగా ఉన్నాయి. మునుగోడు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం కాగా, మొత్తం 2,27,265 ఓట్లు ఉన్నాయి. చౌటుప్పల్ నుంచి గట్టుప్పల్ వరకు అన్ని చోట్ల టీఆర్ఎస్ కేడర్ మనసు పెట్టి పనిచేశారు.
నియోజకవర్గంలో టీఆర్ఎస్ దే ఆధిక్యం
కేసీఆర్ ఆశించిన మెజార్టీ ఖాయమా ?
నాంపల్లి, సంస్థాన్ నారాయణపురంలో టీఆర్ఎస్ కు అత్యధిక మెజార్టీ
చౌటుప్పల్ లో కొంత మేర టఫ్ ఫైట్
నియోజకవర్గ కేంద్రంలో పుంజుకుంటున్న బీజేపీ
నియోజకవర్గం మొత్తం మీద టీఆర్ఎస్ కు ఎనిమిది శాతం ఆధిక్యం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. గూలాబీ దళపతి కేసీఆర్ ఆశించిన మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. . నాంపల్లి , సంస్థాన్ నారాయణపురం మండలాల్లో టీఆర్ఎస్ కు అత్యధిక మెజార్టీ రావచ్చని తాజా సర్వేల సారాంశం. గట్టుప్పల్ లో కూడా మెజార్టీ పక్షం గులాబీ పార్టీ వైపే ఉన్నారు. మిగతా మండలాలతో పోల్చితే చౌటుప్పల్ లో బీజేపీ కొంత మేర టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కూడా తక్కువ శాతమే తేడా ఉంది. నియోజకవర్గ కేంద్రం మునుగోడులో బీజేపీ రోజురోజుకు పుంజుకున్నట్లు చెబుతున్నారు. మర్రిగూడ, చండూర్ మండలాలతో పాటు, చండూరు మున్సిపాలిటీలో కూసుకుంట్లకు కంఫర్టబుల్ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది.
బాగా వెనుకబడిపోయిన కాంగ్రెస్
టీఆర్ఎస్, బీజేపీ మధ్య మౌలికమైన వ్యత్యాసం
సీఎం కేసీఆర్ పరపతిని చూసే ఓటేసే జనం
బీజేపీ కంటే కోమటిరెడ్డికే బలమైన ఇమేజ్
స్రవంతి కంటే గోవర్థన్ రెడ్డికే ఎక్కువ సానుభూతి
ఏడు మండలాల్లోని ఓటర్ల అభిప్రాయాన్ని బట్టి కాంగ్రెస్ బాగా వెనుకబడి ఉంది. హస్తం పార్టీకి బీజేపీకి వచ్చిన ఓట్ల శాతంలో సగం కూడా రావు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మౌలికమైన ఒక వ్యత్యాసం ఉంది. కారు పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల కంటే… పార్టీ ఇమేజ్, సీఎం కేసీఆర్ పరపతిని చూసే జనం ఓటెయ్యాలనుకుంటున్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాల్లో కొన్ని తమకు ప్రయోజనకరంగా ఉన్నాయని అందుకే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నామని సగటు ఓటర్లు చెబుతున్నారు. సమీప ప్రత్యర్థి విషయంలో మాత్రం అలా లేదు. బీజేపీ కంటే ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాలుగైదు రెట్లు అధిక పరపతి ఉంది. తనకు తోచిన సాయం చేసే రాజగోపాల్ రెడ్డిని చూసి ఓటేస్తున్నామని, బీజేపీ పట్ల తమకు ఎలాంటి సానుభూతి లేదని ఓటర్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. జాతీయ పార్టీ గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలను చూసే ఓటేస్తున్నామని కొందరంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయ్ స్రవంతి కంటే నాలుగు సార్లు మునుగోడు ఎమ్మెల్యేగా చేసిన ఆమె తండ్రి దివంగత గోవర్థన్ రెడ్డికే ఎక్కువ పరపతి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గోవర్థన్ మంచి నాయకుడే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ కే ఓటేస్తామని జనం చెబుతున్నారు…
టీఆర్ఎస్ వైపే మహిళా ఓటర్లు
45 ఏళ్లు దాటిన వారి ఓటు టీఆర్ఎస్ కే…
బీజేపీ వైపే యువత
టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల మద్దతు కొంతమేరకే ప్రయోజనం
టీఆర్ఎస్ వైపే వెనుకబడిన సామాజికవర్గాలు
అన్ని మండలాల్లోనూ మహిళా ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉన్నట్లుగా తెలుస్తోంది. 45 ఏళ్ల వయసు దాటిన ఓటర్లు, పెన్షన్లు పొందే వాళ్లు కూడా టీఆర్ఎస్ నే బలపరుస్తున్నారు..యువత మాత్రం బీజేపీని, రాజగోపాల్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటోంది. అయితే అందులోనూ ఒక సమస్య ఉంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను జనం ఆమోదించలేకపోతున్నారు. ఆయన తన స్వప్రయోజనాల కోసం ఉప ఎన్నిక తెచ్చారని అభిప్రాయపడుతున్నారు. అందుకే టీఆర్ఎస్ పట్ల కాస్త ప్రేమ తగ్గినా నడివయస్కులు ఇంకా గులాబీ పార్టీకే ఓటు వేస్తున్నారు. టీఆర్ఎస్ కు కమ్యూనిస్టులు మద్దతివ్వడం ఆ పార్టీకి కొంతమేర మాత్రమే ప్రయోజనం కలుగుతోంది. సామాజిక వర్గాల వారీగా కూడా యాదవ, గౌడ, ముస్లిం, లంబాడీ, కుమ్మర, విశ్వబ్రాహ్మణ వర్గాల్లో ఎక్కువ మంది కూసుకుంట్లకే ఓటెసే అవకాశం ఉంది.