తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశం అయిన సమయంలోనే బీఆర్ఎస్ పార్టీలోనూ అలాంటి కలకలమే రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో మేడ్చల్ జిల్లాకు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మీడియాకు సమాచారం ఇచ్చారు. అంతే కాదు బయటకు వచ్చి ఇది ఖచ్చితంగా అసంతృప్తి సమావేశమేనని నొక్కి చెప్పారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగానే సమావేశం అయ్యామని చెప్పారు. తర్వాత ఏ పరిణామాలు జరిగినా అసలు మైనంపల్లి హన్మంతరావు వ్యవహారశైలి మాత్రం బీఆర్ఎస్ పార్టీలో అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇంత ధిక్కారమా ఖచ్చితంగా అధినేత కేసీఆర్ చర్యలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. నిజానికి మైనంపల్లి హన్మంతరావు వ్యవహారశైలి మొదటి నుంచి అంతే ఉంటుంది. పలుమార్లు వివాదాస్పదమయింది. కానీ ఈ సారి మాత్రం ఆయన నేరుగా ఐదుగురు ఎమ్మెల్యేల్ని కూడగట్టడం మాత్రం తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదన్న వాదన బీఆర్ఎస్లో వినిపిస్తోంది.
బీఆర్ఎస్లో కొంత కాలంగా మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా ఉంది. మేడ్చల్ జిల్లాలో మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ మల్లారెడ్డి సీఎం కేసీఆర్కు అత్యంత ఇష్టమైన నేత. ఇటీవల ఐటీ దాడుల సమయంలో ఆయన ఎన్ని కష్టాలొస్తాయని తెలిసినా కేసీఆర్ పైనే అమితమైన విశ్వాసం చూపారు. ఇది ఆయనకు కేసీఆర్ వద్ద మరిన్ని మార్కులు తెచ్చి పెట్టింది. దీంతో జిల్లా మొత్తం తన హవాను మరింతగా విస్తృత పరుచుకున్నారు. అనచరులకు అన్నీ పదవులు కట్టబెట్టేసుకుంటున్నారు. చివరికి తాను తప్ప ఏ ఎమ్మెల్యే చెప్పిన పనులు కూడా చేయవద్దని కలెక్టర్కు హుకుం జారీ చేసేశారు. అప్పటికే రగిలిపోతున్న ఎమ్మెల్యేలకు ఇది మరింత కోపం తెప్పించింది. ఇదే అదనుగా మల్లారెడ్డి తీరుపై చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్న మైనంపల్లి నలుగురు ఎమ్మెల్యేల్ని కూడగట్టేశారు.
ఇప్పుడు మల్లారెడ్డి మాదంతా ఓ ఫ్యామిలీ కూర్చుని మాట్లాడుకుంటాం అవసరమైతే ఇంటికి పిలుస్తానని హైకమాండ్ ఆదేశాలతో చెప్పినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పార్టీ హైకమాండ్ కొంత మంది నేతలకే ప్రాధాన్యం ఇస్తోందని కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఓ సంకేతాన్ని మైనంపల్లి హన్మంతరావు పంపేశారు. క్యాడర్ ముఖ్యమని ఆయన నేరుగా చెబుతున్నారు. వారి ప్రయోజనాలను కాపాడాలని వారికి మేలు చేయాలని అంటున్నారు. అంటే ఇప్పటి వరకూ చేయలేకపోయామని ఆయన చెబుతున్నట్లే. ఇప్పుడు ఈ అంశం బీఆర్ఎస్కు ఎక్కువ డ్యామేజ్ చేస్తుందన్న అభిప్రాయం ఉంది.
నిజానికి మైనంపల్లితో పాటు ఆ ముగ్గురు ఎమ్మెల్యేల ఆవేదనలోనూ అర్థం ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా వారిపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. కానీ వారు క్యాడర్ కు ఏమీ చేయలేకపోతూండటంతో ఏదో ఒకటి చేయాలని తెరపైకి వచ్చారు. ఈ ధైర్యంతో ఇతర జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఎమ్మెల్యేల్లో ఓ రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ పాలన, పథకాలు, అభివృద్ధి పక్కన పెడితే రాజకీయంగా తాము ఇబ్బంది పడుతున్నామని భావించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఖమ్మంలో నాలుగు గ్రూపులు ఉన్నాయి. అధికార పార్టీలో ఉన్నామనే అడ్వాంటేజ్ వారికి ఉంది. రియల్ అధికారం ఉన్న గ్రూపు తమ వర్గాన్నే ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మిగిలిన మూడు గ్రూపుల్ని ఉడికిస్తూనే ఉంది. అక్కడ్నుంచి ఆదిలాబాద్ వరకూ అదే పరిస్థితి.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొంత కాలంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కేటీఆర్ పూర్తిగా పాలనా వ్యవహారాలను చూసుకుంటున్నారు. దీంతో జిల్లాల్లో మంత్రులదే ఇష్టారాజ్యం అయిపోయింది. ఫలితంగానే ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్న వాదన వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించకపోవడంతో ఇవి ముదిరిపోయాయన్న వాదన వినిపిస్తోందిక. ఇప్పుడు ఎమ్మెల్యేలతో మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేక భేటీ ద్వారా మంట పెట్టినట్లయింది. ఈ వ్యవహారంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని ఇప్పటికిప్పుడు హన్మంతరావుపై చర్య తీసుకుంటే అది తాత్కాలికంగా ఇలాంటి సమావేశాలను బ్రేక్ చేయవచ్చు కానీ పార్టీ హైకమాండ్ తమ వైపు లేదని కేవలం మంత్రుల వైపే ఉందని ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు అనుకుంటే కొత్త ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంత మందికి టిక్కెట్లు వస్తాయన్నదానిపై ఉత్కంఠకు గురవుతున్నారు. గత ముందస్తు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సిట్టింగ్లకు టిక్కెట్లు కేటాయించారు. కానీ ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితి లేదు.
మొత్తంగా మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో జరిపిన ఎమ్మెల్యేల భేటీని హైకమాండ్ తేలికగా తీసుకోలేని పరిస్థితి. అలాగని వెంటనే చర్యలకూ ఉపక్రమించలేరు. ఈ సమస్య సున్నితమైనది. బీఆర్ఎస్ చీఫ్ గా దేశ రాజకీయాల కోసం అత్యధిక సమయం కేటాయిస్తున్న కేసీఆర్ తెలంగాణలో పార్టీ వ్యవహారాలపైనా ఎంతో కొంత సమయం వెచ్చించక తప్పదని మైనంపల్లి గుర్తు చేసినట్లయింది.