నాగర్ కర్నూలు విజేత ఎవరూ..? – Nagarkurnool – BRS – Congress-BJP

By KTV Telugu On 8 March, 2024
image

KTV TELUGU :-

లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. అభ్యర్థుల  టెన్షన్ లేని చోట ప్రకటనలు ఈజీ అవుతున్నాయి. నిజానికి ఈ పరిస్థితి అన్ని పార్టీలకు ఉన్నదే. ముఖ్యంగా నాగర్ కర్నూలు  నియోజకవర్గంలో ఆశావహుల తీరు చూస్తే అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలకు తలనొప్పులు తప్పవనిపిస్తోంది.

17 లోక్ సభా నియోజకవర్గాలకు గానూ రెండు విడతలుగా బీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి బి. వినోద్ కుమార్,  పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి  నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పోటీ చేయనున్నారు. వీరిలో నామా, కవిత ఇద్దరూ సిట్టింగులే. ఇక మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని కూడా బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. అదే మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి బరిలోకి దిగుతారని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలిపారు. అయితే నాగర్ కర్నూలు వ్యవహారంలో మాత్రం వెనుక పీకుడు, ముందు పీకుడు ఇంకా కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో కొన్ని సీట్లను ప్రకటించింది. అందులో ఇటీవలే పార్టీలో చేరిన సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు తనయుడు భరత్ పేరును నాగర్  కర్నూలు నియోజకవర్గానికి ఖరారు చేశారు. ఆయన బలమైన అభ్యర్థి అవుతారని భావించినప్పటికీ అంత సీన్ లేదన్న  విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు టఫ్ ఫైట్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరిని రంగంలోకి దించాలో అర్థం కాక రెండు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు..

కాంగ్రెస్ పార్టీకి ఈ సారి అభ్యర్థుల ఎంపిక కష్టంగానే ఉంది.  పలువురు అభ్యర్థులు కర్ఛిప్ వేయడంతో ఏం చేయాలో అధిష్టానానికి  పాలు  పోవడం లేదు. చాకచక్యంగా పని కానిచ్చేయాలని అధిష్టానం ప్రయత్నిస్తోంది….

ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా ఉన్న నాగర్ కర్నూల్ ఇపుడు రాష్ట్రంలోనే అత్యంత సంక్లిష్టంగా మారింది.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ  తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పార్టీ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రావడం..కేంద్రంలో కూడా అధికారం చేజిక్కించుకోవడం కోసం కొత్త రాజకీయ సమీకరణాలు కుదిరిన ఈ తరుణంలో నాగర్ కర్నూల్ నుంచి పెద్ద నాయకలు టికెట్ కోసం పోటీపడుతున్నారు.  గాంధీ భవన్ లో ఏకంగా 27 మంది ఆశావహులు టికెట్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు.ఇందులో ముఖ్యంగా మల్లు రవి..ఎస్.ఎ. సంపత్ కుమార్, మందా జగన్నాథ్ లు ఉన్నారు. మల్లు రవిని ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి వరించింది. తనకు నాగర్ కర్నూలు టికెట్ కావాల్సిందేనంటూ ఆయన ఢిల్లీ పదవికి రాజీనామా చేశారు. పైగా రేవంత్  రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి మల్లు రవి ఆయన వెంటే ఉన్నారు. ఇక  ఏఐసీసీ కార్యదర్శి ఎస్ ఏ సంపత్ కుమార్.. తన ప్రయత్నాల వేగాన్ని పెంచారు.ఢిల్లీలోనూ..హైద్రాబాద్ లోనూ బడా నాయకులను కలిసి తను నాగర్ కర్నూల్ పోటీ ఉంటానని ప్రతిపాదనలు ముందుంచారు.సీఎం రేవంత్ ను కూడా కలిశారు.ఇక నియోజకవర్గంలో మల్లు రవికి పెద్ద పదవి వచ్చినందున టికెట్ తనకేనంటూ ప్రచారాన్ని ఉదృతం చేశారు. ఎన్నికలకు వనరులను సమకూర్చుకుంటున్నానని..తనకు చెందిన ఓ ఇంటిని సైతం విక్రయించి రెడీ అయ్యానంటూ ఓ సంధర్భంగా చెప్పారు.తన ప్రచారాన్ని సైతం ప్రారంభిస్తున్నానని వెల్లడించారు.అలంపురం నుంచి అచ్చెంపేట వరకు  పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక వాళ్లకు కాదు టికెట్ తనకు ఇవ్వాలని మాజీ ఎంపీ మందా జగన్నాథం భీష్మించుకు కూర్చున్నారు. బీఆర్ఎస్ లో ఉండి ఉంటే ఈ పాటికి టికెట్ వచ్చి ఉండేదని  కూడా  తన అనుచరులతో అంటున్నారు. మరో పక్క  బీఆర్ఎస్ లో పరిస్థితి గుంభనంగా  ఉంది. సిట్టింగు ఎంపీ రాములు వెళ్లిపోవడంతో టికెట్ తనకేనంటూ గువ్వల బాలరాజు సంబరపడిపోతున్నారు. రాములు ఫ్యామిలీని బీఆర్ఎస్ నుంచి గెంటివేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అయితే ఈ సారి నాగర్  కర్నూలు నుంచి కొత్త మొహాలకు అవకాశం ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం…

నాగర్ కర్నూలు గెలుపు అంత సులభం కాదని అంటున్నారు. జననాడి అర్థం కాక ఇబ్బందిగా ఉందని మూడు పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకుంటున్నప్పటికీ.. నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని జనం నిలదీసే అవకాశం ఉంది. అదే ఇప్పుడు ఆశావహుల పాలిటి శాపమై కూర్చుంది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి