ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురూ నాన్న కుట్టిలే. నాన్నతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నవారే. ఇపుడు నాన్నలు లేరు. వారి ఆశయాలను తాము నిజం చేస్తామంటూ ఆ ముగ్గురు అమ్మాయిలు ఎన్నికల బరిలో ఉన్నారు. తమని గెలిపిస్తే తమ తండ్రులు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. ఎన్నికల ప్రచాంరలో ముగ్గురూ దూసుకుపోతున్నారు. పైగా ముగ్గురు అమ్మాయిల నాన్నలకు సమాజంలో వారి వారి నియోజక వర్గాల్లో చాలా మంచి పేరే ఉంది. అందుకే తమ విజయాలపై ముగ్గురూ ధీమాగా ఉన్నారు. డిసెంబరు మూడున తాము ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమంటున్నారు.
ఈ సారి తెలంగాణా ఎన్నికల బరిలో ముగ్గురు అమ్మాయిలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ ముగ్గురూ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకే నియజక వర్గంలో ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. మరో అమ్మాయి తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన కీలక నియోజక వర్గం నుండి ఎన్నికల బరిలోఉన్నారు. ఈ ముగ్గురు అమ్మాయిల తండ్రులూ కాలం చేశారు. జీవించి ఉన్న సమయంలో ఈ అమ్మాయిలు తమ తండ్రులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న నడవడిక.. ఆయన వ్యవహారశైలిని దగ్గరగా గమనించారు.ఇపుడు వారి వారసులుగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచాక వారి ఆశాయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేయాలని భావిస్తున్నారు.
కంటోన్మెంట్ నియోజక వర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున కంటోన్మెంట్ నియోజక వర్గం నుండి గెలిచిన సాయన్న ఆ తర్వాత 1999,2004 ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ నుండి వరుస విజయాలు సాధించారు.
2009 ఎన్నికల్లో నాలుగోసారి గెలిచారు. 2014 లోనూ టిడిపి తరపున బరిలో దిగి నాలుగోసారి గెలిచారు. ఆ తర్వాత బిఆర్.ఎస్. లో చేరారు. 2018 ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. అభ్యర్ధివగా విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్ర ఆనారోగ్యంతో ఆయన మృతి చెందారు. ఆయన కూతురు లాస్య నందిత ఇపుడు ఆమె బి.ఆర్.ఎస్. అభ్యర్ధిగా తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తోన్న కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచే బరిలో ఉన్నారు. తన తండ్రి మిగిల్చి పోయిన అభివృద్ధి పనులు తాను పూర్తి చేస్తానని ఆమె అంటున్నారు.
కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ గుమ్మడి వెన్నెల పోటీ చేస్తున్నారు. ఈమె పరిచయం అవసరంలేని ప్రజాగాయకుడు గద్దర్ కూతురు. తన పాటతో మావోయిస్టు ఉద్యమానికి ఊపు తెచ్చిన గద్దర్ దశాబ్ధాల పాటు విప్లవ ఉద్యమంలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా గద్దర్ కు వీరాభిమానులు ఉన్నారు. సాయుధ పోరాట నినాదంతో ఉద్యమంలో అడుగు పెట్టిన గద్దర్ చివరకు బులెట్ కాదు బ్యాలెటే బెటరని నిర్ణయించుకుని సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు. ఆయన కూతురు వెన్నెల తన తండ్రి కలలు కన్న ప్రజాసంక్షేమం కోసం పాటు పడాలని భావిస్తున్నారు. ఆమెను గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఇక రేసులో ఉన్న మూడో అమ్మాయి పి.విజయారెడ్డి. ఖైరతాబాద్ దివంగత ఎమ్మెల్యే పి.జనార్ధన రెడ్డి గారాల పట్టి విజయారెడ్డి. ఖైరతాబాద్ నియోజక వర్గంలోనే కాదు గ్రేటర్ పరిధిలో కార్మిక సంఘాల్లో పి.జె.ఆర్.కు చాలా పట్టుంది. జననేతగా పేరు గడించారు. 1985లో మొదటి సారి ఖైరతాబాద్ నియోజక వర్గం నుండి గెలిచిన పి.జె.ఆర్. ఆ తర్వాత వరుసగా 1989,1994 ఎన్నికల్లోనూ విజయభేరి మోగించారు. నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఆయన కూతురు పి విజయారెడ్డి ప్రస్తుతం ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు.
కంటోన్మెంట్ నుండి బరిలో ఉన్న లాస్య నందిత- వెన్నెల లో ఎవరో ఒకరు గెలిచే అవకాశం మాత్రమే ఉంది. ఖైరతాబాద్ లో విజయారెడ్డి గెలిచే అవకాశాలు బానే ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. అదే విధంగా కంటోన్మెంట్ లో సాయన్న వారసురాలిగా లాస్య నందిత కూడా గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు . మొత్తానికి నాన్నల వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఈ ముగ్గురు అమ్మాయిల భవితవ్యం ఎలా ఉందో డిసెంబరు మూడున తేలిపోతుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…