తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు పోటా పోటీగా తయారయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా చేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంటోంది. అయితే బీజేపీ పరిస్థితి ఏంటి? రాష్ట్ర పార్టీ చీఫ్‌గా ఉన్న కిషన్‌రెడ్డి ప్లేస్‌లో ఎవరు రాబోతున్నారు? కొత్త సారథి వచ్చేవరకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఉండదా? కమలం పార్టీలో పాత, కొత్త నేతల వివాదం ఆపరేషన్ ఆకర్ష్‌కు అడ్డంకిగా మారబోతోందా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
తెలంగాణలో ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేయాలని అటు కాంగ్రెస్..ఇటు బీజేపీ కంకణం కట్టుకున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్ వేగం పెంచింది. అయితే తెలంగాణ బీజేపీలో మాత్రం ప్రస్తుతం స్తబ్ధత ఆవరించింది. పార్టీ రాష్ట్ర సారథిగా ఉన్న కిషన్ రెడ్డి…కేంద్ర మంత్రిగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బిజీ అయ్యారు. అంతేకాకుండా కిషన్ రెడ్డిని జమ్మూకాశ్మీర్ పార్టీ ఎన్నికల ఇంఛార్జీగా నియమించారు. దాదాపుగా 20 రోజుల పాటు కిషన్‌రెడ్డి రాష్ట్రాని వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున వెంటనే తనను రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించి వేరొకరిని నియమించాలని ఇప్పటికే కమలం పార్టీ అధిష్టానానికి కిషన్ రెడ్డి విన్నవించుకున్నారు. కిషన్‌రెడ్డి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథి నియామకం తప్పనిసరి అయింది. వారం రోజుల్లోనే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీబీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో అంతుచిక్కకపోవడంతో…కమలం క్యాడర్ లో స్తబ్ధత కనిపిస్తోంది. ఈ పదవి కోసం డీకే అరుణ నుంచి ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు పార్టీలో పాత, కొత్త వివాదం కొనసాగుతోంది. తొలినుంచీ పార్టీలో ఉన్న నాయకులకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. కండువా కప్పుకున్న రోజు నుంచే ఎవరైనా పార్టీ కార్యకర్త అవుతారనే విషయాన్ని విస్మరించవద్దని కొత్తగా వచ్చిన మరికొందరు గుర్తు చేస్తున్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న కాషాయ దళానికి… పార్టీలో నెలకొన్న స్తబ్థత కొంత ఇబ్బందికరంగా మారింది.
పార్టీ అధిష్టానం త్వరితగతిన నిర్ణయం తీసుకుని రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని నియమిస్తే..లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటవచ్చని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో పడింది. ఈ సమయంలో కాంగ్రెస్‌కు పోటీగా బీజేపీ ఏం చేయబోతుంది ? ఆపరేషన్ ఆకర్ష్ చేపడతారా ? లేదా ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ స్థానంలో నిలబడాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ పెట్టుకున్న టార్గెట్ అచీవ్ చేయడం ప్రస్తుత సమయంలో క్లిష్టంగానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన 35 శాతం ఓట్లను కాపాడుకోవడం కూడా బీజేపీ ముందున్న సవాల్. పార్టీలో నెలకొన్న పాత, కొత్త నేతల మధ్య వివాదం.. ఆపరేషన్ ఆకర్ష్ కు అడ్డంకిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో రాష్ట్ర పార్టీ చీఫ్ పోస్ట్ ను వెంటనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. త్వరలోనే తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దానికి పార్టీని సమాయత్తం చేసే బాధ్యతను కొత్త అధ్యక్షుడిపై పెట్టనున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…