తెలంగాణా పిసిసికి కొత్త బాస్ ఖాయమా?

By KTV Telugu On 14 June, 2024
image

KTV TELUGU :-

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడు  రాబోతున్నారని  ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడంతో  కొత్త నేతకు పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు.తెలంగాణ కాంగ్రెస్ కి రానున్న  కొత్త రథసారథి ఎవరు ? అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నదెవరు? చాలామంది పార్టీ చీఫ్ కోసం ప్రయత్నిస్తున్నా పోటీ వారి మధ్యేనా? ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని హైకమాండ్ ఆరా తీస్తోందా?  ఇంతకీ కొత్తగా రానున్న టీ కాంగ్రెస్ అధినేత ఎవరు. వాచ్ ది స్టోరీ…

పార్లమెంట్ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని చర్చ నడుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2021 జూన్ 27న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పీసీసీ చీఫ్ పదవి వేరేవాళ్ళకి ఇస్తారనే ప్రచారం కొనసాగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని ఎంపిక చేస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ హై కమాండ్ భావించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను నియమించే ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది.

పీసీసీ చీఫ్ ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనే అంశంపై ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. తన తర్వాత పీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారనే విషయాన్ని రేవంత్ తో ప్రస్తావిస్తే ఆ విషయం తన పరిదిలో లేని అంశమని, హై కమాండ్ ఎవరిని పీసీసీ చీఫ్  గా నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ రెడ్డి చెప్తున్నారట. ప్రతిపక్షం నుంచి ప్రభుత్వం లోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? ఎవరికి పదవి ఇస్తే పార్టీ నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే విషయంలో పలువురు నేతల నుండి హై కమాండ్ సమాచారం స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

పీసీసీ చీఫ్ పై చాల మంది కీలక నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలారోజుల నుండి అడుగుతున్నారు. ఇక ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మేల్యే రాజ్ గోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ కావాలని హై కమాండ్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వరనే చర్చ బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

పీసీసీ చీఫ్ పదవికోసం పలువురు మంత్రులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకి ఇవ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారట. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారని తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలని భట్టి పట్టుపడుతున్నట్లు సమాచారం.. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి విభాగం నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అవుతారని చాలా రోజుల నుండి వినిపిస్తోంది.

ఇక మరో బీసీ నేత మధుయాష్కీ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధుయాష్కీకి ఎన్నికల్లో ఓడిపోవడంతో నిరాదరణకు గురవుతున్నారని ఆయనకి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అందర్నీ కలుపుకుపోతారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇక ఏఐసీసీ సెక్రటరీ సంపత్ సైతం పీసీసీ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. మొన్న నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు.

మాదిగలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లే్లదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజికవర్గానికి చెందిన సంపత్ కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే ప్రధానంగా జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ,సంపత్ కుమార్ ల మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు సమాచారం.

అధికార పార్టీ అధ్యక్ష పదవి కోసం పదికి పైగా మంది నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు.అయితే రెడ్డి సమాజికవర్గం నుంచి సీఎం ఉండడం తో బీసీ, ఎస్సీ, ఎస్టీ లలో ఓకరికి పీసీసీ పదవి దక్కనుందని పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అయినా జగ్గారెడ్డి రెడ్డి లాంటి నేతలు పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి  ఇక ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో ..

ఎవరు పీఠం అధిరోహించినా అది ముళ్లకిరీటమే అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొత్త చీఫ్ అయిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి విజయాలు తేవలసిన బాధ్యత ఉంటుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి