ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా
ఎం.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
అంతర్గత ప్రజాస్వామ్యంతో నిత్య అసమ్మతివాదులతో అంతులేని వివాదాలతో తలమునకలై ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు మొదలైంది. అధిష్టానం ప్రకటించిన కమిటీలు కాంగ్రెస్ పార్టీలో మరో వివాదానికి ఆజ్యం పోశాయి. కొత్త కమిటీల్లో తనను విస్మరించడంపై మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సీనియారిటీని పట్టించుకోకుండా తనకంటే జూనియర్లకు కమిటీల్లో స్థానం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు సురేఖ. అందుకు నిరసనగా ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. ఎం.పి, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా కొత్తగా ఏర్పాటు చేసిన ఏ కమిటీలోనూ చోటు దక్కలేదు. దాంతో ఆయన కూడా ఘాటుగా స్పందించారు. మంత్రి పదవినే వదిలేసుకున్న తనకు కమిటీల్లో పదవులు అవసరం లేదని వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు మరింతగా పెచ్చరిల్లాయి.
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఒంటెద్దు పోకడలు పోతున్నారని అందరినీ కలుపుకుని పోవడం లేదని కొందరు సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బాహటంగానే ప్రదర్శిస్తున్నారు. నిత్యం అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన కమిటీలతో కొందరు సీనియర్ నేతలు హర్ట్ అయ్యారు. కొండా సురేఖ నేరుగా రేవంత్ రెడ్డిని కలిసి ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా పత్రాన్ని అందచేశారు. కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని చెప్పారు. ఇప్పుడు తాను రాజకీయాలు మాట్లాడనని ఎన్నికలకు నెల రోజుల ముందు ఏ పార్టీలో చేరతానో చెబుతానని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అటు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తాడనే ఊహాగానలు బలపడుతున్న తరుణంలో అసంతృప్తులు, అలకలతో కాంగ్రెస్ పార్టీ మరింత వెనకబడిపోతుందేమోనని ఆ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.