తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు.. బీకేర్‌ఫుల్‌

By KTV Telugu On 16 March, 2023
image

లక్షలమందిని వణికించింది. వేలప్రాణాలు తీసింది. ఇప్పటికీ ఆ మహమ్మారి ప్రభావంతో గుండెల ఆగిపోతున్నాయి. కొత్త రుగ్మతలు కబళిస్తున్నాయి. సైడ్‌ ఎఫెక్ట్స్‌తోనే ఆగడం లేదు కరోనా. నీడలా వెంటాడుతున్నట్లు మరోసారి భయపెడుతోంది. ప్రమాదఘంటికలు మోగిస్తోంది. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే తెలంగాణలో 52 కేసులు నమోదు కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో సగానికి పైగా కేసులు హైదరాబాద్‌లోనివే.
కరోనా లక్షణాలతో ఇప్పటికే H3N2 వైరల్ ఫీవర్స్‌తో జనం వణికిపోతున్నారు. ఆస్పత్రులకు వేలకు వేలు ఫీజులు ఇప్పుడు మళ్లీ కరోనా కేసులతో అందరిలో కలవరం మొదలైంది. ఈ ఏడాది జనవరి 27న తెలంగాణలో సున్నా కేసులు నమోదయ్యాయి. దాంతో వైరస్ పూర్తిగా తెరమరుగైందని అంతా అనుకున్నారు.

కానీ వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 5254 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే అందులో 52 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇంకా రిపోర్ట్‌ రావాల్సి ఉన్నవారిలో మరికొన్ని పాజిటివ్‌ కేసులు పెరగొచ్చు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తున్నట్టు అధికారిక నివేదికలు చెబుతున్నాయి.
రెండు వారాల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా మొత్తం ఐదు జిల్లాలకే కోవిడ్ కేసులు పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు ఏకంగా 12 జిల్లాల్లో వైరస్ కేసులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ మెదక్ మేడ్చల్ మల్కాజ్ గిరి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి భువనగిరి జిల్లాల్లో రోజూ ఎన్నోకొన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. మహారాష్ట్రలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రెండు మరణాలు కూడా సంభవించడం కలవరం కలిగిస్తోంది.