హైదరాబాద్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిపోయిందని మజ్లిస్ ఉగ్రవాద పార్టీ అన్నట్లుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు ప్రారంభించారు. దీనికి కారణం మధ్యప్రదేశ్ పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సాయంతో పదహారు మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. వారిలో కొందరు ఓవైసీ కుటుంబానికి చెందిన కాలేజీల్లో పని చేస్తున్నారు. అందులో మరికొందరు హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినవారు. అయితే వారు నిజంగానే ఉగ్రవాద కార్యకలాపాల కోసం కుట్రలు చేస్తున్నారా లేదా అన్నది దర్యాప్తు సంస్థలు ప్రకటించాల్సి ఉంది. వారి గురించి రకరకాల ప్రచారాల మాత్రం జరుగుతున్నాయి. కారణం ఏదైనా అలాంటి ఉగ్రకోణం ఉంటే మాత్రం భారీ కుట్రనలు చేధించినట్లే అనుకోవాలి. అయితే ఇలాంటి విషయాల్లో రాజకీయాలు తీసుకు వస్తే ఎంత వరకూ విషయం పక్కదారి పట్టకుండా ఉంటుందన్నదే ఇక్కడ చర్చ. ఉగ్రవాద బాధితులు ఎప్పుడూ ఓ మతం వారే ఉండరు. ఓ ఉగ్రవాది పేలుడుకు పాల్పడితే అందరూ చనిపోయారు. వర్గాలను చూసుకుని బాంబులు గాయాలు చేయవు. అందుకే ఉగ్రవాదాన్ని అందరూ వ్యతిరేకించాలి. కానీ రాజకీయం చేస్తే ఏమవుతుంది సమస్య మరింత క్లిష్టమవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
ఎక్కడ ఉగ్రవాద వ్యవహారాలు బయటపడినా మూలాలు హైదరాబాద్లో ఉంటాయనే ఓ ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. గోకుల్ చాట్ పేలుళ్ల తర్వాత హైదరాబాద్లో ఉగ్ర కదలికలు అనేవే లేవు. దాదాపుగా అంతమయ్యాయి. అడపాదడపా ఎన్ఐఐ, ఏటీఎస్ వంటి దర్యాప్తు సంస్థలు కొంత మందిని అదుపులోకి తీసుకుంటూ వస్తున్నాయి. గత ఏడాది కూడా ఐసిస్ సానుభూతిపరుడ్ని అరెస్ట్ చేశారు. నిజానికి ఇలా అరెస్టవుతున్న వారంతా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారేనా అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు సానుభూతిపరులు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకున్నవారు. నేరుగా ఆయా సంస్థలతో కాంటాక్ట్ అయ్యారో లేదో తెలియదు. కానీ వారు అలాంటి భావజాలంతో ఉన్నారని తెలుసుకుని దర్యాప్తు సంస్థలు వేగంగా స్పందించి వారిని అదుపులోకి తీసుకున్నాయి. అందుకే హైదరాబాద్లో ఉగ్రకదలికలు దాదాపుగా లేవన్న అభిప్రాయం బాగా పెరిగింది. గత పదేళ్లుగా మత కలహాలు కూడా తగ్గిపోయాయి. ఓ మంచి వాతావరణం ఏర్పడింది.
శాంతిభద్రతల పర్యవేక్షణలో హైదరాబాద్ పోలీసులకు అత్యున్నత అవార్డులను కేంద్రం ఇస్తోంది. 2022 సంవత్సరానికి గాను 30 మంది పోలీస్ అధికారులకు అతి ఉత్కృష్ట సేవా పతకం, 28 మందికి ఉత్కృష్ట సేవా పతకం, అసాధారణ ఆసూచన కుశలత పతకం ఏడుగురికి, ఇన్వెస్టిగేషన్లో ప్రతిభ చూపిన ఎనిమిది మందికి హోంమినిస్టర్ మెడల్స్, ట్రైనింగ్ సమయంలో ప్రతిభ చూపిన 11 మందికి హోంమంత్రి మెడల్స్, శౌర్య పతకం 11 మంది, మహోన్నత సేవ పతకాలు పొందారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీసు పతకాలకు తెలంగాణ నుంచి 15 మంది ఎంపికయ్యారు. దేశంలోనే అత్యుత్తమ నిఘా వ్యవస్థ తెలంగాణకు ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ తో మొత్తం వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. అందుకే తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో మెరుగ్గా ఉన్నాయని అనుకోవచ్చు.
అయితే బీజేపీ అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులు హైదరాబాద్లో యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఒక్క సారిగా ప్రచారం ఊపందుకుంది. ముందూ వెనుకా చూసుకోకుండా ప్రకటనలు చేయడంలో మందుండే బండి సంజయ్ హైదరాబాద్ మొత్తంపై ఉగ్ర ముద్ర వేసేందుకు వెనుకాడలేదు. హైదరాబాద్ ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిపోయిందని ఆరోపించేశారు. ఇదే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి ఇలాంటి అనుమానితుల్ని శరవేగంగా పట్టుకున్నందుకు అభినందించాల్సింది పోయి ఇలా ఉగ్ర ముద్ర వేయడం ఏమిటన్నదిఎక్కువ మందికి అర్థం కాని విషయం. ఎంపీ ఓవైసీ కుటుంబానికి చెందిన ఆస్పత్రిలో పని చేస్తున్న వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందుకే ఓవైసీపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్. ఓ రకంగా బీజేపీ స్ట్రాటజీ హైదరాబాద్ పై ప్రభావం పడుతుందన్న ఆందోళన ఉంది.
దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం హైదరాబాద్. అందులో సందేహం లేదు. పీస్ ఫుల్ ఏరియాగా ప్రసిద్ది చెందింది. తెలంగాణ ఉద్యమం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని చాలా మంది కంగారు పడ్డారు. కానీ పూర్తి స్థాయి ప్రశాంత నగరంగా మారింది. ఎలాంటి కుల, మత, ప్రాంత పరమైన గొడవలు రాలేదు. ఉగ్రవాద కదలికలు అసలే లేవు. అందకే పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఇలాంటి వాతావరణాన్ని రాజకీయ కారణాలతో చెడగొట్టాలనుకోవడం నేతలకు ప్రయోజనం కల్పించదు. రాజకీయంగా కూడా లాభం ఉండదు పైగా సొంత రాష్ట్రానికి కీడు చేసిన వారవుతారు. మరి ఈ విషయంలో బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తారో లేదో మరి.