తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తే ఠక్కున వినిపించే పేరు కల్వకుంట్ల తారక రామారావు. నాలుగైదేళ్లుగా కేటీఆర్ సీఎం అనే ప్రచారం జరుగుతూనే ఉంది. 2018 ఎన్నికలకు ముందే ప్లీనరీ పెట్టినప్పుడు అందులోనే కేటీఆర్‌కు కేసీఆర్ సీఎం బాధ్యతలిస్తారన్న ప్రచారం జరిగింది. తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఇక టీఆర్ఎస్ గెలిస్తే సీఎం పీఠం ఎక్కేది కేటీఆరేనని చెప్పుకున్నారు. కానీ కేసీఆరే బాధ్యతలు తీసుకున్నారు. కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం తిప్పే పరిస్థితి వచ్చి ఉంటే ఏం జరిగి ఉండేదో కానీ ఆ తర్వాత మళ్లీ కేటీఆర్ సీఎం అనే ప్రచారం తగ్గిపోయింది. ఇటీవల మళ్లీ పెరిగింది. అయితే కేటీఆర్ ఇప్పటికిప్పుడు సీఎం అయ్యేంత అనుభవం సంపాదించుకున్నారా ? పాలనలో వచ్చే సవాళ్లను సులువుగా అధిగమించేంత పట్టు పాలనపై సంపాదించుకున్నారా?
కేటీఆర్ తెలంగాణ ఏర్పడినప్పటి నుండి దాదాపుగా మంత్రిగా ఉన్నారు. మొదటి సారి కానీ రెండో సారి కానీ ఆయన బాధ్యతలు తీసుకున్న శాఖలు మున్సిపల్, ఐటీ శాఖలే. ఈ రెండు అత్యంత ముఖ్యమైనవి. అందులో సందేహం లేదు. అదే సమయంలో ఈ రెండింటి విషయంలో చాలా సౌలభ్యం ఉంటుంది. దండిగా నిధులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ లాంటి ఐటీ ఫ్రెండ్లీ సిటీ ఉన్న రాష్ట్రానికి ఐటీ మంత్రి అయితే వచ్చే గ్లామర్ వేరు. అదంతా కేటీఆర్ కు ప్లస్ అయింది. ఓ రకంగా ఈ రెండు శాఖల్లో కేటీఆర్ విధినిర్వహణ కేక్ వాక్ అనుకోవచ్చు. కానీ సీఎం పదవి అంటే అంతకు మించిన సవాళ్లు ఉంటాయి. ఈ రెండు శాఖల్ని అద్భుతంగా నిర్వహించినంత మాత్రాన సీఎంగా అద్భుతంగా పరిపాలించేస్తారని చెప్పలేమని రాజకీయ నిపుణుల అంచనా.
ప్రభుత్వంలో నెంబర్ టు శాఖ హోంశాఖ. ఆ తర్వాత ఆర్థిక శాఖ. ఈ రెండు శాఖల్లోనే భారీ సవాళ్లు ఉంటాయి. ముఖ్యంగా హోంశాఖను సాధారణంగా బలమైన ముఖ్యమంత్రులు ఉన్న చోట పెద్దగా జోక్యం చేసుకోని మంత్రికి పదవి ఇచ్చి పాలనా వ్యవహారాలన్నీ సీఎం చక్క బెడుతూంటారు. తెలంగాణలో అదే జరుగుతోంది. మహమూద్ అలీ హోం మంత్రి అనే విషయం చాలా మందికి గుర్తు ఉండి ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సమీక్షలు చేసింది. కీలక నిర్ణయాలు తీసుకున్నది లేదు. అంతా సీఎం ఆదేశాల మేరకే జరుగుతుంది. అలాగే ఆర్థిక శాఖ కూడా కీలకమే. ఆర్థిక శాఖను ప్రస్తుతం హరీష్ రావు చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలివ్వలేకపోవడానికి ఆర్థిక సమస్యలే కారణమని హరీష్ రావు చెబుతున్నారు. అంటే ఓ రకంగా కత్తీమీద సాములా ఆర్థిక శాఖ ఉందన్నమాట. సీఎం అయితే ఇలాంటి సమస్యలను నేరుగా డీల్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టాస్కుల్ని ఎదుర్కొగలిగేలా కేటీఆర్ అనుభవాన్ని సంపాదించుకున్నారా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కొత్తగా చేస్తున్న విశ్లేషణ.
కేటీఆర్ రెండు శాఖల మంత్రే కాని చాలా రోజులుగా యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ పాలనా బాధ్యతల్లో అత్యధికంగా కేటీఆర్‌కు అప్పగించారు. అందుకే ప్రతీ శాఖపైనా కేటీఆర్ ముద్ర స్పష్టంగా ఉంటుంది. కానీ అది నేరుగా కాదు. ఎందుకంటే సీనియర్ మంత్రుల శాఖల్లో నేరుగా కేటీఆర్ జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు. అలా చేసుకుంటే మంత్రులు కూడా అసంతృప్తికి గురవుతారు. అది పార్టీలో అంతర్గతంగా అనేక సమస్యలను సృష్టిస్తోంది. అందుకే కేటీఆర్ తన శాఖల వరకూ యాక్టివ్ గా ఉంటున్నా ఇతర విషయాల్లో మాత్రం అంత చురుకుగా ఉండలేకపోతున్నారు. ఉండలేరు కూడా. ఎందుకంటే నిబంధనల ప్రకారం అయది సాధ్యం కాదు. ఏ శాఖకు సంబంధించిన కార్యక్రమం అయినా బయట జరిగే ప్రోగ్రామ్స్ కు మాత్రం కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతూంటారు. అలా వెళ్తేనే ఆ ప్రోగ్రామ్‌కు ప్రాధాన్యత వస్తుంది. కేసీఆర్ అత్యంత ముఖ్యమైనవాటికి తప్ప హాజరు కావడం లేదు. ఆ బాధ్యతల్ని కూడా కేటీఆరే తీసుకున్నారు.
భవిష్యత్ ఆలోచనలతో కేటీఆర్ ముందు నుంచి శాఖల విషయంలో వేరియేషన్స్ చూపించి ఉంటే ఈ పాటికి సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి అవసరమైన అన్ని రకాల అవగాహన ఆయనకు వచ్చి ఉంటుందన్న నమ్మకం కలిగి ఉండేది. మొదటి నుంచి రెండు శాఖలకే అదీ కూడా పెద్దగా సవాళ్లు ఉండని శాఖలకు పరిమితం కావడంతో ఇప్పుడు పాలనా పరంగా కేటీఆర్ సవాళ్లను అధిగమించగలరా అన్న చర్చ విశ్లేషణలు చేయడానికి అవకాశం ఏర్పడుతోంది.