తెలంగాణ సీఎస్.. ఆ ముగ్గురిలో ఎవరు ?

By KTV Telugu On 11 January, 2023
image

తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఉన్న సోమేశ్‌ కుమార్‌ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ హైకోర్టు తీర్పు వెలుడిన వెంటనే కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆయన్ను తెలంగాణ కేడర్‌ నుంచి రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల్లో ఏపీలో ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని సోమేశ్‌కుమార్‌ను ఆదేశించింది. దీంతో తదుపరి సీఎస్‌ నియామకం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పోస్టు కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే సీనియారిటీ ప్రకారం చూస్తే 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ వసుధ మిశ్రా సీఎస్‌ కావాలి అయితే ప్రస్తుతం డెప్యూటేషన్‌ మీద యుపీఎస్సీ సెక్రటరీగా ఉండడం మరో నెల రోజుల్లో రిటైర్ కానుండడంతో వసుధ మిశ్రా సీఎస్‌ రేసులో లేనట్లే అని భావిస్తున్నారు.

తరువాతి స్థానంలో రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ రాణి కుముదిని ఉన్నారు. అయితే ఆమెకు కూడా ఆరు నెలలకు మించి సర్వీసు లేదు. వీరిద్దరూ రేసు లో లేకపోవడంతో ప్రత్యేక ప్రధానకార్యదర్శులుగా ఉన్న శాంతి కుమారి, రామకృష్ణారావు, అరవిందకుమార్ లలో ఒకరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. అయితే పూర్తి స్థాయి సీఎస్‌ను నియమించాలా లేదా ఇన్‌చార్జి సీఎస్‌ను నియమించాలా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురిలో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న రామకృష్ణారావు పట్ల కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని కొత్త సీఎస్ గా ఆయననే నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఏపీకి వెళ్లిపోతున్న సోమేశ్‌కుమార్‌ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో సర్వీసు కూడా పెద్దగా లేకపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది.