తెలంగాణ సర్కారుకు 920 కోట్ల జరిమానా

By KTV Telugu On 23 December, 2022
image

మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటె. మూడు నెలల్లోగా రూ.920 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌ – ఎన్జీటీ షాక్‌‌ ఇచ్చింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌ స్కీముల్లో పర్యావరణ ఉల్లంఘనలకు ఈ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోగా కృష్ణా బోర్డు వద్ద డిపాజిట్‌‌ చేయాలని ఆదేశించింది. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులు నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం యథేచ్చగా పనులు కొనసాగించడపైం ఎన్టీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌ స్కీములను చేపట్టి రిజర్వ్‌‌ ఫారెస్టులో పనులు చేస్తూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని ఏపీ ప్రభుత్వం కడప జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వర రెడ్డి మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్ గురువారం ఈ తీర్పు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని బెంచ్‌‌ జ్యుడీషియల్‌‌ మెంబర్‌‌ జస్టిస్‌‌ పుష్ప సత్యనారాయణ, ఎక్స్‌‌పర్ట్‌‌ మెంబర్‌‌ సత్యగోపాల్‌‌ తమ తీర్పులో పేర్కొన్నారు. ఏదైనా ప్రాజెక్టులో ఇరిగేషన్‌‌ కాంపోనెంట్స్‌‌ ఉంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరి. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు కొనసాగించారు. పనులు ఆపాలని ఎన్‌‌జీటీ ఆదేశించినా ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించారు అని ఆ తీర్పులో స్పష్టం చేశారు.

 

పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినందుకు వాటి నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానా చెల్లించాలని బెంచ్ ఆదేశించింది. పాలమూరు–రంగారెడ్డి నిర్మాణ ఖర్చు రూ.35,200 కోట్లు కాగా అందులో 1.5% అంటే రూ.528 కోట్లు, డిండి లిఫ్ట్‌‌ స్కీం నిర్మాణ ఖర్చు రూ.6,190 కోట్లలో 1.5 శాతం అంటే రూ.92.85 కోట్లు జరిమానాగా చెల్లించాలని పేర్కొంది. ఎన్‌‌జీటీ తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్టు తేలినందున ఇంకో రూ.300 కోట్లు పెనాల్టీ చెల్లించాలని చెప్పింది. మొత్తం రూ.920.85 కోట్లను 3 నెలల్లోగా కేఆర్‌‌ఎంబీ వద్ద జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం చెల్లించే జరిమానాతో కృష్ణా నదితో పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం తమ ఉత్తర్వులను కావాలనే ఉల్లంఘించిందని ఎన్​జీటీ అభిప్రాయపడింది. తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని చెప్తూ వేల కోట్ల ఖర్చు చేసి సాగు నీటిని ఇచ్చే పనులు చేస్తున్నారని తేలిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే క్రమంలో పర్యావరణానికి చేస్తున్న నష్టం, హాని ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదన్నారు. ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.