తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ పోటీ చేస్తోన్న రెండో నియోజక వర్గం కామారెడ్డి లో విపక్షాలకు అసలు అభ్యర్ధులే లేరా అన్న గుస గుసలు వినపడుతున్నాయి. గజ్వెల్ నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న కేసీయార్ కామారెడ్డి నుండి కూడా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఒక్కరే పోటీకి సిద్ధమయ్యారు. పార్టీలో ఆయనకు పోటీయే లేదు. కాని కాంగ్రెస్ ఫస్ట్ జాబితాలో ఆయన పేరు ఎందుకు లేదు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీలో సీనియర్లను కాదని, కొత్తగా వచ్చినవారిలో 11 మందికి టిక్కెట్లు ఇచ్చారంటూ ఇప్పటికే రభస జరుగుతోంది. అదంతా ఒక ఎత్తయితే..ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ షబ్బీర్ అలీ పేరును కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో ఒకరైన షబ్బీర్ అలీ 30 ఏళ్ల క్రితమే మంత్రి పదవి నిర్వర్తించారు. హస్తిన కాంగ్రెస్ పెద్దలతోనూ మంచి సంబంధాలే ఉండేవి. కాంగ్రెస్ వీడిన గులాం నబీ ఆజాద్ ఉన్నప్పుడు షబ్బీర్ అలీ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉండేది.
ఏఐసీసీ విడుదల చేసిన తొలి జాబితాలో కామారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత షబ్బీర్ అలీ పేరు దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం జరిగినా తొలి జాబితాలో లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అభ్యర్థిత్వం కోసం షబ్బీర్ అలీతో పాటు హైదరాబాద్ కు చెందిన ఓ నేత కూడా దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీతో పాటు ఇతర కమిటీల్లోనూ షబ్బీర్ అలీ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదిరింది. కాని షబ్బీర్ పేరు మాత్రం ప్రకటించలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేస్తున్న నేపథ్యంలో పార్టీ వ్యూహాత్మకంగానే కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థి పేరును ప్రకటించలేదని తెలుస్తోంది. ప్రచారంతో పాటు ఇతరత్రా విషయాల్లో ముఖ్యమంత్రిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే హస్తం పార్టీ అడుగులు వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే షబ్బీర్ అలీ పేరు ప్రకటించకపోవడం పట్ల అధిష్టానం పెద్దలు ఏం వ్యూహంతో ఉన్నారో పక్కన పెడితే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు షబ్బీర్ అలీకి కామారెడ్డి టికెట్ ఇవ్వడం లేదని, ఆయన మరో నియోజక వర్గానికి వలస వెళ్తారని ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే..ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే షబ్బీర్ అలీ వంటి నేత సరిపోరని..అంతకంటే గట్టి నాయకుడు అయితేనే కేసీఆర్‌కు గట్టి పోటీ ఇవ్వగలుగుతారని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు షబ్బీర్ అలీ పేరు ప్రకటించక పోవడంతో కామారెడ్డి నియోజకవర్గం అంతా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయనను ఎల్లారెడ్డి లేదా నిజామాబాద్ అర్బన్ కానీ పంపిస్తారంటూ ప్రచారం మొదలైంది. కామారెడ్డిలో నిజంగానే షబ్బీర్ అలీ పోటీ చేయడంలేదా? ఒకవేళ పోటీ చేయకపోతే…ఆ నిర్ణయం షబ్బీర్ అలీదా? లేక కాంగ్రెస్ పార్టీ నాయకత్వానిదా? కామారెడ్డి టిక్కెట్ విషయంలో నిజా నిజాలేంటో..రెండో జాబితా వస్తేనే తెలుస్తుంది.
గజ్వెల్ నియోజక వర్గం కేసీయార్ కు కంచుకోటగా ఉంటోంది. అయితే ఈ సారి అక్కడ కేసీయార్ కు గట్టి సవాలే ఎదురవుతోంది. బి.ఆర్.ఎస్. లో ఒకప్పుడు కేసీయార్ కు కుడిభుజంగా ఉన్న ఈటల రాజేందరే ఇపుడు గజ్వెల్ లో కేసీయార్ పై పోటీకి కదం తొక్కుతున్నారు. కేసీయార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరతానని ఆయన శపథం చేస్తున్నారు. తానేమీ ఆషామాషీగా కేసీయార్ పై పోటీ చేస్తానని అనలేదని ఈటల క్లారిటీ కూడా ఇచ్చారు.
ఈటల పోటీని దృష్టిలో పెట్టుకునే కేసీయార్ ముందస్తు జాగ్రత్తగా కామారెడ్డినుండి పోటీ చేస్తున్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే కేసీయార్ పోటీ చేసే రెండు చోట్లా భారీ మెజారిటీతో గెలిచి సత్తా చాటుతామని బి.ఆర్.ఎస్. నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
https://youtu.be/QtEruZFD8NU?si=bOH-5exGxH8P9Vtn
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…