అడ్డంగా బుక్కవుతున్న కేటీఆర్ తో పార్టీకి కష్టాలు…

By KTV Telugu On 24 September, 2024
image

KTV TELUGU :-

బీఆర్ఎస్ పార్టీలో మునపటి వేగం, దూకుడు కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా కేటీఆర్, హరీష్ రావు పోరాడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. పార్టీ పెట్టి తెలంగాణ తెచ్చిన ఘనుడిగా పేరు పొందిన కేసీఆర్ ఇప్పుడు భూతద్దం పెట్టి వేదికినా ఎక్కడా కనిపించడం లేదు. తన అచ్చమైన తెలంగాణ మాండలీకంతో జనాన్ని ఆకట్టుకుని,భావోద్వేగాలను రెచ్చగొట్టిన కేసీఆర్ తొమ్మిది నెలలుగా మన్నుతిన్న పాములా మారిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యూహాత్మక మౌనమని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నప్పటికీ స్పందించాల్సిన అంశాల్లో కూడా ఆయన మెదలకుండా ఉండటం ఆశ్చర్యకర పరిణామమే అవుతుంది. దశాబ్దంకాలం తెలంగాణ ప్రజలపై పెత్తనం చేసిన పార్టీ ఇప్పుడు మెత్తబడి, చప్పబడి, నీరసపడిపోయినా కేసీఆర్ కు చీమకుట్టినట్లుగా కూడా లేదని అంకితభావంతో పనిచేసే బీఆర్ఎస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనంలో ఉండాల్సిన అగ్రనేత ఫామ్ హౌస్లో కునుకుతీయడమేంటని కార్యకర్తలు ప్రశ్నించుకుంటున్నారు. అడపా దడపా నిర్వహించే సమీక్షలతో పార్టీ బలపడుతుందా అని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇబ్బంది పడుతుంటే వారిని కార్నర్ చేసే అంశంలో పార్టీని లీడ్ చేయాల్సిన కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా తయారయ్యారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్ నేతలు, మంత్రులు దూకుడుగా వ్యవహరిస్తుంటే.. బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయిందని, తమపై ఆరోపణలకు బదులిచ్చేందుకు కేసీఆర్ ఏ మాత్రం ప్రయత్నించడం లేదని కేడర్ ఆందోళన చెందుతోంది. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ రిటైర్డు జస్టిస్‌తో విచారణ చేపట్టింది. అలాగే జీఎస్టీ స్కామ్ పైనా విచారణ జరుగుతోంది. ఇంకా గొర్రెల స్కీమ్‌పైనా ఆరోపణలు వచ్చాయి. మిషన్ భగీరథలోనూ 20వేల కోట్ల అక్రమాలు జరిగాయంటూ కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న తరుణంలో వాటికి దీటైన బదులివ్వాలని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉండి వ్యూహరచన చేస్తున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అదే నిజమనుకున్నా.. వ్యూహరచనకు ఎన్ని రోజులు పడుతుందనేది పెద్ద ప్రశ్న. కేసీఆర్ జనంలోకి వచ్చేందుకు ఎన్ని నెలలు ఎదురుచూడాలో ఒక్కసారి చెబితే బావుంటుందని పార్టీ కేడర్ నిలదీసే పరిస్థితి కూడా రావచ్చు…

కేసీఆర్ కు బదులుగా కేటీఆర్, హరీష్ రావు చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థులకు సమాధానం చెప్పే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. హరీష్ రావు కాస్తలో కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నప్పటికీ..కేసీఆర్ మాత్రం ఆవేశంగా మాటలు జారుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన వ్యాఖ్యలు కేటీఆర్ పై బూమరాంగ్ అయ్యాయి. ఇప్పుడు ఆయన మరో భారీ తప్పు చేసినట్లేనని భావించాలి. కేంద్రప్రభుత్వ అమృత్ పథకం నిధుల్లో 8 వేల 888 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.దీనితో కాంగ్రెస్ పార్టీకి మంచి టాపిక్ దొరికినట్లయ్యింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన తన ఆరోపణలను నిరూపించలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పొంగులేటి హెచ్చరించారు. ప్రాజెక్టుకు 3వేల 516 కోట్ల రూపాయల అనుమతులు వచ్చాయని, పన్నులు ఇతరత్రా ఖర్చులు కలిపినా 5 వేల 385 కోట్లు లెక్క అవుతుందని ఆయన గుర్తుచేశారు. ఆ ప్రాంజెక్టులో 8 వేల 888 కోట్ల స్కాం ఎలా జరుగుతుందని ఆయన ఎదురు ప్రశ్న వేయడంతో తెల్లమొహం వేయడం బీఆర్ఎస్ వంతయ్యింది. పైగా సృజనా రెడ్డి .. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది అంటూ కేటీఆర్ కలిపిన వరసలు కూడా నిజం కాదని తేలిపోయింది. ఆయన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడని కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆయనకు 2,300 కోట్ల ప్రాజెక్టును నజరానాగా ఇచ్చిందని గుర్తుచేశారు. దానితో ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీనే డిఫెన్స్ లో పడిపోయింది. బీఆర్ఎస్ నేతలు ఎలాంటి హోం వర్క్ లేకుండా, సరైన అధ్యయనం చేయకుండానే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకుంటున్నరని మరోసారి తేలిపోయింది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి