బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఇబ్బడిముబ్బడిగా నేతలు వచ్చి చేరుతున్నారు. బెల్లం ఉన్న చోటికే ఈగెలు వస్తున్నాయని, తలా కాస్త పందేరం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వచ్చిన వాళ్లందరికే కాదు..కొందరికి కూడా పప్పుబెల్లాలు పెట్టే పరిస్థితి లేదని సీఎం రేవంత్ స్వయంగా తేల్చేశారు. మంత్రిపదవి అందని ద్రాక్షేనని సంకేతం ఇచ్చేశారు. దానితో రావాలా..వద్దా అన్న నిర్ణయం ఫిరాయింపుదారులకే వదిలేశారు. మరి తెలంగాణ రాజకీయాల్లో ఇకపై ఏం జరుగుతుందో….
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎక్కువ కాలం గడుపుతున్నారన్న చర్చ జరుగుతోంది. దేశ రాజధానికి వెళితే నాలుగైదు రోజులైనా అక్కడే గడిపేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లి డైరెక్షన్ తీసుకుంటున్నారనడంలో తప్పులేదు. కాంగ్రెస్ నేతల్ని అడిగితే అదే మాట చెబుతారు. పనిలో పనిగా కేంద్ర మంత్రులను కూడా కలుసుకోవడం వల్ల రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, విభజన హామీల అమలును చర్చించేందుకు వెళ్తున్నారని అనుకోవచ్చు. కాకపోతే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు బీఆర్ఎస్ నుంచి చాలా మంది పోటీ పడుతున్నందున వారికి ఇవ్వాల్సిన మంత్రి పదవులపై సోనియా, రాహుల్, ఖర్గే అనుమతి పొందేందుకు రేవంత్ తరచూ ఢిల్లీలో మకాం వేస్తున్నారని కూడా ఇంతకాలం వాదించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా అలాంటి చర్చకు తెరదించారు. ఆశలు పెట్టుకుని నిరాశ చెందవద్దని ఆయన హితవు పలికారు…
పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వలేమని రేవంత్ రెడ్డి తేల్చేశారు. అందుకు ఆయన ఒక కారణం చెప్పారు. కాంగ్రెస్ బీ ఫార్మ్ మీద గెలిచిన వాళ్లకే కేబినెట్లో చోటు దక్కుతుందని, ఈ మేరకు అధిష్టానం విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. దీనితో ఫిరాయించిన బీఆర్ఎస్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. కాంగ్రెస్లోకి వద్దామనుకుంటున్న వారు కూడా పునరాలోచనలో పడిపోయారు..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. మరో 13 నుంచి 15 మంది వరకు తక్షణమే చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వచ్చిన వారిలో హైదరాబాద్ కు చెందిన దానం నాగేందర్, ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన పోచారం శ్రీనివాస రెడ్డి ఉన్నారు. రాబోయే వారిలో కూడా హేమాహేమీలే ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిలో కొందరికైనా మంత్రి పదవులు ఇవ్వాల్సిన అనివార్యత ఉంది. ఎలా చేయాలి, ఎవరిని కేబినెట్లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి అంచనా వేసుకునే లోపే… కాంగ్రెస్ పార్టీ మినీ సంక్షోభాన్ని ఎదుర్కోంది. పార్టీ తీరుపై జీవన్ రెడ్డి అలిగారు. విషయం అధిష్టానం వరకు వెళ్లిపోవడంతో రేవంత్ రెడ్డి డిఫెన్స్ లోకి పడిపోయారు. పరిస్థితిని చక్కబెట్టే దిశగా వలస నేతలకు మంత్రి పదవులు ఉండవని తేల్చేశారు. ఆ సంగతి అర్థం చేసుకునే కాంగ్రెస్లోకి రావాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. అయితే వేరే పార్టీలో ఉండే కంటే కాంగ్రెస్లోకి వస్తేనే మంచిదన్న సందేశం కూడా ఇస్తున్నారు. బీఆర్ఎస్లో కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఉండదనే విషయాన్ని ఆ ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా రేవంత్ చెబుతున్నారు.. కాంగ్రెస్లో చేరితే ఇప్పుడు మంత్రి పదవి దక్కకపోయినా భవిష్యత్లో కచ్చితంగా ప్రాధాన్యం కల్పిస్తామని రేవంత్ హామీ పలుకుతున్నారు. ఇక ఓడిన పార్టీలో ఉండటం కంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో కొనసాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చచ్చిపోయిన పార్టీలో ఉండే కంటే భవిష్యత్తు ఉన్న పార్టీలో కలిస్తే మంచిదని చెబుతున్నారు. అప్పుడు అధికారంలో ఆధిపత్యం చెలాయించే వీలుంటుందని, ఒకటి రెండు సొంత పనులు చేయించుకోవచ్చన్న ఫీలింగు వాళ్లలో కలిగిస్తున్నారు.
మంత్రి పదవుల కోసం పోటీ పడే వారి సంఖ్య పెరిగిపోవడంతో కేబినెట్ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. రైతు రుణ మాఫీ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆగాలనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి నిజమో కాదో….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…