కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఫామ్ హౌస్ వ్యవహారం తెరమీదకు రావడంతో బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశామని కాంగ్రెస్ భావిస్తోంది. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తోంది. దీపావళి పార్టీని రేవ్ పార్టీగా, డ్రగ్స్ సెంటర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పది నెలలు దాటిన రేవంత్ రెడ్డి పాలనలో తొలి ఆరు నెలలు కాంగ్రెస్ పైచేయిగా నిలిచింది. తర్వాత బీఆర్ఎస్ వ్యూహం మార్చింది.. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా తెలంగాణ పాలిటిక్స్ మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అనివార్యత ఏర్పడింది. కొందరు మంత్రులు దూకుడుగా వ్యవహరించినా… ప్రభుత్వం మాత్రం సంయమనం పాటిస్తోంది. రెండు రోజుల్లో బాంబులు పేరబోతున్నాయని మంత్రి పొంగులేటి ప్రకటించి నాలుగు రోజులైనా సరే ఇంతవరకు ఎలాంటి దూకుడు లేకపోవడం కూడా మారుతున్న వ్యూహాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అదొక్కటే కాదు అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ నిదాన వైఖరే పాటిస్తోంది. ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా, చేసే పనుల్లో చట్టపరమైన చిక్కులు రాకుండా పార్టీ చూసుకుంటోంది…
కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేపట్టిన తొలి కార్యక్రమం ఆపరేషన్ ఆకర్ష్ అని చెప్పాలి. గతంలో కేసీఆర్ పాటించిన వ్యూహాన్నే రేవంత్ రెడ్డి కొనసాగించారు. ప్రధాన ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునేసి సమీకరణాలు మార్చాలని చూసింది. అవసరాన్ని, అవకాశాన్ని చూసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలు మారడం మొదలు పెట్టారు. ఇంకేముందీ బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రమే మిగులుతారని మిగతావారంతా జై రేవంత్ అనేస్తారని అంతా ఎదురుచూశారు. తొలి నాళ్లలో అదే ట్రెండ్ కనిపించినా.. ఇప్పుడు మాత్రం పెద్ద జర్క్ తో జాయినింగ్ ఎక్స్ ప్రెస్ కు బ్రేకులు పడుతున్నాయని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి….
ఒక్క కోర్టు కేసుతో చేరికలపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారందరికీ తలుపులు బార్లా తెరిచే ప్రక్రియను కొన్ని రోజులు పక్కన పెట్టి… సరికొత్త అజెండాను అమలు చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని గతంలో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూటు మార్చింది. ఆ ఎమ్మెల్యేలంతా మద్దతు మాత్రమే ఇస్తున్నారని పీసీసీ తాజా చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించి… మారిన పరిస్థితులకు దర్పణం పట్టారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రయత్నించగా, కొందరు గులాబీ ఎమ్మెల్యేలు ఓ టీమ్ గా ఏర్పడి, కాంగ్రెస్ కు మద్ధతు ఇచ్చారని వివరించారు. తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని జగిత్యాల, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు ప్రకటించడం కూడా ఇందుకు ఎక్స్ టెన్షన్ గానే భావించాలి. పైగా గతంలో ఎమ్మెల్యేలు వచ్చి సీఎం రేవంత్ ను కలిసినప్పుడు ఆయన కప్పినవి పార్టీ జెండాలు కాదని, కేవలం మూడు రంగుల కండువాలు మాత్రమేనని ఇప్పుడు అంటున్నారు. పార్టీ ఫిరాయింపు సమస్యలు రాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చుతోందని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ దూకుడును అడ్డుకునేందుకు కూడా ఇదీ మంచి ప్రయత్నమని చెప్పుకోవాల్సి ఉంటుంది.
కొందరు ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లడం కూడా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడటానికి కారణమవుతోంది. భద్రాచలం, స్టేషన్ ఘన్ పూర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు తమ పార్టీ బీ ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లారని బీఆర్ ఎస్ కోర్టుకు వెళ్లింది. ఇందులో దానం నాగేందర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారని పేర్కొన్నది. ఇది కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నది. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ విషయంలో అప్రమత్తమై.. టెక్నికల్ సమస్యలు లేకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడిందని పార్టీ నేతలు చెప్తున్నారు. వాళ్లతో రాజీనామా చేయించకపోవడమే కాకుండా, మూడు రంగులతో కూడిన కండువాలు మాత్రమే కప్పామని పార్టీ నేతలు వివరిస్తున్నారు. అయితే త్వరలో మరి కొన్ని జాయినింగ్స్ ఉంటాయని, కేటీఆర్ సన్నిహితులు కూడా తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ చెప్పారు. వారి విషయంలో కూడా కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే వ్యవహరించే అవకాశాలున్నాయి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…