ఒక రాష్ట్రం, రెండు సెంటిమెంట్లు

By KTV Telugu On 2 May, 2024
image

KTV TELUGU :-

కేసీఆర్, కేటీఆర్ మళ్లీ సెంటిమెంటునే నమ్ముకుంటున్నారు.  టీఆర్ఎస్  ను  మూసేసి  బీఆర్ఎస్ ను ప్రారంభించిన తర్వాత కూడా ఆ పార్టీ నేతలు  తెలంగాణ సెంటిమెంటునే పండించాలనుకుంటున్నారు. పార్టీ పేరులో  తెలంగాణను తొలగించినప్పటికీ..తాము ఆ వాదానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కీలకాంశాలను వాళ్లు మళ్లీ తెరపైకి తెచ్చారు. ఆ రెండు అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక కోలుకోవడం కష్టమని ఊరూరా వెళ్లి జనం చెవుల్లో ఊదేస్తున్నారు…..

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చావు దెబ్బతిన్నది. కాకపోతే కన్ను లొట్టబోయినట్లుగా 39 స్తానాల్లో గెలిచి పరువు కాపాడుకుంది. దానితో ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీఆర్ఎస్  భావిస్తోంది.ఇందుకోసం కేసీఆర్  స్వయంగా  రంగంలోకి దిగి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్ అయితే  రాత్రి పగలు తేడా  లేకుండా  తిరుగుతున్నారు. తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పుడు స్వర్గంలా మార్చామని, ఇప్పుడు కాంగ్రెస్‌ రాకతో నరకంగా మారిందని పేర్కొంటున్నారు .తమను ఎన్నికలో గెలిపించకపోతే.. తెలంగాణ ఉండదు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఒకరకంగా తెలంగాణ ప్రజలను భయపెడుతున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించకపోతే హైదరాబాద్‌ను యూటీ చేస్తారని కేటీఆర్ హెచ్చరించేశారు. ఆ దిశగా కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాజకీయ అవసరం కోసం హైదరాబాద్‌ యూటీ అంశాన్ని కేటీఆర్‌ తెరపైకి తెస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలతో ఉమ్మడి రాజధాని అనే డిమాండ్‌ను కూడా తెప్పించి కాస్త సెంటిమెంట్‌ రేపే ప్రయత్నం చేశారు. అయితే అది వర్కవుట్‌ కాలేదు.దానితో ఇప్పుడు యూటీ అంశాన్ని నెత్తికెత్తుకునేందు ప్రయత్నించారు…

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే, బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదమని కేసీఆర్, కేటీఆర్ కు తెలుసు. అందుకే ఏదో విధంగా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే  కీలకాంశాలను ప్రస్తావించేందుకు వెనుకాడటం లేదు..

బీఆర్ఎస్ ప్రస్తావిస్తున్న రెండో అంశం గోదావరి జలాలు. తెలంగాణ  ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు ఒక సెంటిమెంటు అని కేసీఆర్ కు తెలుసు. ఉద్యమకాలంలో కూడా ఆ మూడు అంశాలపైనే  సెంటిమెంటును రగిల్చారు. తెలంగాణ  ప్రజలను సంఘటితంగా ఉంచడంలో ఆ అంశాలకు కీలక ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఎన్నికల వేళ కేసీఆర్..గోదావరి జలాలను మోదీ ఎత్తుకుపోతారంటూ ప్రచారం మొదలు పెట్టారు. తాను ముఖ్యమంత్రిగా లేకపోవడంతో తెలంగాణలో సాగుత, తాగునీటికి గోస వచ్చిందని అని బెదిరిస్తున్నారు. అయితే జనం సెంటిమెంట్ మాత్రం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ఉంది. కేసీఆర్ ను జనం విశ్వసించే పరిస్థితి లేదని చెబుతున్నారు.

తాజా సర్వేలన్నీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు వస్తే గగనమని చెబుతున్నాయి. ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు నాలుగైదు సీట్లయినా సాధించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి