బేరసారాల కేసులో పాత్రధారులెవ్వరూ.. సూత్రధారులెవ్వరూ ? ఎవరు ట్రాప్ లో పడ్డారు.. ఎవరు ట్రాప్ లో పడేశారు… బీజేపీ వెర్షన్ ఏంటి.. టీఆర్ఎస్ గేమ్ ప్లాన్ ఏంటి.. పక్కాగా ఇది కేసీఆర్ మార్క్ పాలిటిక్సేనా… మునుగోడు ఉప ఎన్నికకు … ఎమ్మెల్యేల కొనుగోలుకు ఉన్న లింకేంటి..? వాచ్ దిస్ కేటీవీ స్పెషల్
ఎమ్మెల్యేలను కొనుగోలుచేయబోతు అడ్డంగా దొరికిన ముగ్గురు
మూడు దిక్కుల్లో ఉండే ముగ్గురికి ఎలా పరిచయం…. ఆరోపణలను కొట్టిపారేస్తున్న కమలం.
ఆకర్షణకు లోనైనట్లు నటించి ముగ్గులోకి లాగిన ఎమ్మెల్యేలు
తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయనే చెప్పాలి. ఒక పక్క ఆపరేషన్ ఆకర్ష్, మరోపక్క ట్రాప్ గేమ్ తో దెబ్బతీసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించాలన్న బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు…. తెలంగాణ సీఎం కేసీఆర్ ట్రాప్ గేమ్ కు తెరతీశారు. బీజేపీ నేతలు నేరుగా సీన్ లోకి రాకపోయినా… వారి మద్దతుదారులు ముగ్గురు వచ్చి బోనులో చిక్కారు. నిజంగానే ఆ నలుగురు ఎమ్మెల్యేలు వచ్చేస్తారన్న మితిమీరిన విశ్వాసంతోనే వాళ్లు ముగ్గురు వచ్చి ట్రాప్ లో పడిపోయారు. ఢిల్లీ ఫరీదాబాద్ టెంపుల్‌లో ఉండే రామచంద్రభారతి, తిరుపతిలో ఉండే సింహయాజులు స్వామిజీకి… హైదరాబాద్‌లోని ఓ హోటల్ ఓవర్ అయిన నందకుమార్ ఎలా.. ఎక్కడ పరిచయం అయ్యారో తెలియదు కానీ ముగ్గురూ కలిసి ఎమ్మెల్యేల్ని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించి బుక్కయ్యారు. అన్ని మాట్లాడుకున్న తర్వాత డీల్ సెట్ చేసుకోవడానికి రామచంద్రభారతి, సింహయాజులు హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది.
మధ్యవర్తులను నమ్మించడంలో ఎమ్మెల్యేలు సక్సెస్
ముందే కేసీఆర్ కు సమాచారం ఇచ్చిన ఆ నలుగురు… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ పోలీసులు
అనామకులే ఎందుకు వచ్చారో…
మధ్యవర్తులను నమ్మించడంలో నలుగురు ఎమ్మెల్యేలు సక్సెస్ అయ్యారు. బీజేపీలో చేరేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని చెప్పి… విశ్వాసం కలిగించారు. అందుకే ముగ్గురు మధ్యవర్తులు నేరుగా హైదరాబాద్ వచ్చి ధైర్యంగా వారిని కలిశారు. వారిని పట్టివ్వడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మినిట్ టు మినిట్ డీటెయిల్స్ హైకమాండ్ కు ఇవ్వడంతో కేసీఆర్ తనదైన శైలిలో ప్లాన్ ను అమలు చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే బాధ్యతను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు అప్పగించారు. నిజంగా బీజేపీ వాళ్లే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకుంటే.. ఒక్క కమలం పార్టీ నేత కూడా ఫ్రేమ్ లోకి ఎందుకు రాలేదన్నది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. ఎవరో అనామకులను తీసుకొచ్చి.. బీజేపీ జనం అని చెప్పించే ప్రయత్నం జరుగుతోందన్నది మరో వాదన.
ఎమ్మెల్యేలు నేరుగా ఫార్మ్ హౌస్ కు ఎందుకు వెళ్లారు ?
ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేదే… ఆ 400 కోట్లు ఎక్కడ
తెరవెనుక జరిగిందొక్కటీ .. బయటకు కనిపిస్తోంది మరోక్కటీ.. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు బీరం హర్షవర్థన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు నేరుగా ఫార్మ్ హౌస్ కు ఎందుకు వెళ్లారు. పైగా సెక్యూరిటీ సిబ్బందికి తెలియకుండా వారే కారు డ్రైవ్ చేసకుంటూ వెళ్లారని చెప్పడం కూడా నిజంకాదని తేలిపోయింది. చర్చలు జరిగిన అజీజ్ నగర్ ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిదే. దానితో టీఆర్ఎస్ గేమ్ ప్లాన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యవర్తులను నమ్మించేందుకే ఎమ్మెల్యే ఫార్మ్ హౌస్ ను చర్చలకు కేంద్రంగా మార్చారన్నది ఒక వాదన. ఇక ఎమ్మెల్యేకు 400 కోట్లు ఇవ్వజూపారన్న ఆరోపణల నడుమ.. ఆ డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చారు… ఎక్కడ దాచారు.. ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. స్వాధీనం చేసుకున్న డబ్బును పోలీసులు బయటపెట్టలేదు. . ఒక కారులో రెండు చిన్న బ్యాగులు మాత్రం చూపిస్తున్నారు. అందులో డబ్బులున్న సంగతి కూడా ప్రకటించాల్సి ఉంది. దానితో తెరవెనుక జరిగిందొక్కటీ… బయటకు కనిపిస్తున్నదొక్కటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది..
నందకుమార్ ఎవరికి క్లోజ్
పట్టుబడిన ముగ్గురిలో హైదరాబాద్ హోటల్ ఓనర్ నందకుమార్… ఎవరనేదానిపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నందకుమార్ కేంద్రం మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని టీఆర్ఎస్ అంటోంది. వారిద్దరూ ఉన్న ఫోటోలు కూడా విడుదల చేసింది. అయితే ఎమ్మెల్యే రఘునందన్ రావు సహా పలువురు బీజేపీ నేతలు మాత్రం గట్టి కౌంటరిస్తున్నారు. ఫార్మ్ హౌస్ ఓనర్ రోహిత్ రెడ్డి తమ్ముడికి నందకుమార్ అత్యంత సన్నిహితుడిగా బీజేపీ చెబుతోంది. పైగా టీఆర్ఎస్ నేతల ఇళ్లలో పెళ్లిళ్లకు, వాళ్లు కార్పొరేషన్ పదవులు చేపట్టినప్పడు జరిగే ఫంక్షన్లకు నందకుమార్ హాజరైన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నిందితులు ముగ్గురి కాల్ లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ.. హైదరాబాద్ తరలించిన 400 కోట్ల రుపాయలు ఎక్కడున్నాయో చెప్పాలంటోంది..
డైవర్షన్ కోసం కేసీఆర్ గేమ్ ఆడుతున్నారా… ?
అంతుపట్టని మునుగోడు జననాడి…. విజయావకాశాలపై పార్టీల్లో అనుమానాలు
మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే ఖచితంగా ఇలాంటి డ్రామాకు తెరతీయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మునుగోడు ఓటరు ఎటు వైపు ఉన్నాడో అర్థంకాక పార్టీలు తలబాదుకుంటున్న తరుణంలో కేసీఆర్ పాచిక వేశారని అనుకునే వాళ్లూ ఉన్నారు. మునుగోడు జనానికి మధ్యాహ్నం ఒకరు, రాత్రి ఒకరు భోజనం పెడుతుంటే హాయిగా తిని, తాగి తూగుతున్నారు తప్ప ఎవరికి ఓటేస్తారో చెప్పడం లేదు. ఎన్నికల ముందు రోజున డబ్బులు పంచిన వారికే జనం ఓటేసే అవకాశం ఉందన్న వార్తల నడుమ డబ్బులు తరలించడం ఇబ్బందికరంగా మారింది. కేంద్ర బలగాలు మునుగోడులో దిగడంతో రాష్ట్ర అధికారపార్టీకి దిక్కుతోచడం లేదు. పైగా పార్టీనేతల కదలికపై మీడియా నిఘా పెరిగింది. దానితో ఒకటి రెండు రోజులు డైవర్షన్ సృష్టించి… మునుగోడుకు డబ్బులు చేరవేసే ఏర్పాటు జరుగుతోందన్న ఆరోపణలూ వస్తున్నాయి.. ఎందుకంటే మునుగోడులో పరువు కాపాడుకోవడం టీఆర్ఎస్ కు చాలా అవసరం.