కాంగ్రెస్ సీనియర్లపై కేసీఆర్ ఆకర్ష్ – కోరి కష్టాలు తెచ్చుకోవడమే !?

By KTV Telugu On 17 August, 2023
image

KTV Telugu ;-

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర పార్టీల్ని బలహీనం చేసేందుకు ఏదో ఓ మాస్టర్ ప్లాన్ వేయకుండా ఉండరు. బీజేపీపై ఆయన ఇప్పటికే బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. బీజేపీ విలవిల్లాడుతోంది. ఇక కాంగ్రెస్ మిగిలింది. కాంగ్రెస్ పైనా ఆయన ఇప్పటికే గాండీవాన్ని ప్రయోగించారని.. సరైన సమయంలో నొప్పి కాంగ్రెస్ కు తెలుస్తుదంని అంటున్నారు. ఆ ఆయుధం ఏమిటంటే చేరికలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పార్టీలో చేర్చుకోవడం. కొంత మంది సీనియర్లతో చర్చలు పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. అయితే ఆ సీనియర్ల పేర్లు విని కాంగ్రెస్ నేతలు సంబర పడుతున్నారు. వారు వెళ్తే మంచిదని అనుకుంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పుడెందుకు ఆ లగేజీ అని ఫీలవుతున్నారు. ఇంతకీ బీఆర్ఎస్‌లో చేరబోయే కాంగ్రెస్ సీనియర్ల వల్ల బీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందా ? కీడా ?

టీ పీసీసీ చీఫ్ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత చాలా మంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి నేరుగానే హైకమాండ్ పై కూడా విమర్శలు చేశారు. తర్వాత అందరూ సర్దుకున్నారు. ఇటీవల ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరింత ప్రో యాక్టివ్ అయ్యారు. రేవంత్ తో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైకమాండ్ ను కలిసి తాము విబేధాలన్నీ మర్చిపోయి పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో అంతా సర్దుకుపోయిందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సైలెంట్ గా ఉన్న నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ఉత్తమ్ కమార్ రెడ్డి, జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతారని దాదాపుగా అన్ని పార్టీల నేతలూ నమ్ముతున్నారు. దానికి ముహూర్తం దగ్గర పడిందని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

టీ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండాలనుకోవడం లేదు. ఎవరో ఊరూ పేరూ లేని వాళ్లు ఉత్తమ్ పార్టీ మారుతున్నారని ప్రచారం ప్రారంభించగానే.. ఆయన దీని వెనుక తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత ఉన్నారని.. హైకమాండ్ చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తూ తెర ముందుకు వస్తున్నారు. ఆయన తీరు చూస్తే.. బీఆర్ఎస్‌లో చేరిపోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొందరపడుతున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో .. తన దారి తాను చూసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఆయనకు తరచూ.. పార్టీలో తనపై కుట్ర జరుగుతోదంన్న సంగతి గుర్తుకు వస్తోంది. తరచూ లేఖలు విడుదల చేస్తున్నారు. బీఆర్ఎస్ లో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఈ ప్రచారం వెనుక కాంగ్రెస్ లో ముఖ్య నేత ఉన్నారని చెప్పుకొస్తున్నారు. రెండేళ్లుగా ఈ పరిస్థితి ఉందని.. హైకమాండ్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఉత్తమ్ చెబుతున్న ఆ ముఖ్య నేత రేవంత్ రెడ్డి అని అందిరకీ తెలుసు. రేవంత్ ను టార్గెట్ చేసుకునేందుకే.. ఉత్తమ్ ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ టిక్కెట్ ను ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉత్తమ్ , ఆయన భార్య రిజర్వ్ చేసుకున్నారని.. జంప్ కొట్టడానికి కారణాలు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా అదే చెప్పారు.

అయితే వేరే ఏ కారణాలు అయినా అనుకున్న లక్ష్యం నెరవేరదు కాబట్టి..ఆయన రేవంత్ నే టార్గెట్ చేసుకుంటున్నారు. ఆయనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పార్టీలో తన అనుచరుల్ని అణగదొక్కుతున్నారని అంటున్నారు. ఈ కారణం చెప్పి బీఆర్ఎస్‌లోకి వెళ్లడానికి ఉత్తమ్ తొందరపడుతున్నారు. మరో వారంలోనే ఆయన పార్టీ మారొచ్చని కాంగ్రెస్ లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఉత్తమ్ సీనియార్టీని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోంది. హఠాత్తుగా ఆయనకు హైకమాండ్ ఓ కీలక పదవి ఇచ్చింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఆయనను సభ్యుడిగా నియమించింది. ఈ స్క్రీనింగ్ కమిటీ టిక్కెట్లను ఖరారు చేస్తుంది. ఈ కమిటీలో ఉత్తమ్ కు చోటు లభించడంతో ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. అయితే ఆయన మాత్రం బీఆర్ఎస్‌లో చేరికకే ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. ఉత్తమ్ కోవర్టు అని.. కాంగ్రెస్ మెరుగుపడిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఓ రచ్చ చేసి.. పార్టీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ లోని మరో వర్గం విమర్శలు గుప్పిస్తోంది. తన రాజకీయ వారసుడు పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి పంపించింది చాలక.. ప్రతీ విషయంలోనూ బీఆర్ఎస్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని…. ఇటీవల కాంగ్రెస్ సోషల్ మీడియాను సైతం పోలీసుల సాయంతో ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు.

ఇక జగ్గారెడ్డి ఉత్తమ్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూంంటారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి ఆయనకు ఉక్కపోతగానే ఉంది. ఓ సారి తాను కాంగ్రెస్ పార్టీ సభ్యుడి కాదని కూడా చెప్పుకున్నారు. కేసీఆర్ వీరితో చర్చలు పూర్తి చేశారని.. సరైన సమయం చూసి బీఆర్ఎస్‌లో చేర్చుకుంటారని అంటున్నారు.

సీనియర్లను చేర్చుకుని కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు కానీ. వారి చేరిక వల్ల తమ పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న ఆలోచన చేయడంలేదని బీఆర్ఎస్ నేతలు గొణుక్కుంటున్నారు. కాంగ్రెస్ దరిద్రాన్ని తెచ్చుకుని మన నెత్తిపై పెట్టుకోవడం ఎందుకనేది ఎక్కువ మంది వాదన.

కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద మైనస్ సీనియర్ నేతలేనని ఆ పార్టీ క్యాడర్ అనుకుంటూ ఉంటారు. క్షేత్ర స్థాయిలో.. నియోజకవర్గ స్థాయిలో కనీసం ప్రజల్లో పట్టు సాధించరు కానీ ముఖ్యమంత్రి పదవికి తామే పోటీ దారులం అన్నట్లుగా వ్యవహరిస్తూంటారని మండిపడుతూ ఉంటారు. అది నిజమే . కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అభ్యర్థే. ఒక్కరికి పదవి వస్తే మిగతా వారంతా ఏకమై సొంత పార్టీపై యుద్ధం చేస్తారు. పోనీ తమలో ఒకరికి చాన్సిచ్చినా కలసి పని చేస్తారా అంటే. మళ్లీ అందరూ కలిసి పదవి వచ్చిన వారిపై విరుచుకుపడతారు. టీ పీసీసీ చీఫ్‌గా పని చేసిన వారందరిపై అలాగే విరుచుకుపడ్డారు. ఇలాంటి నేతల్ని బీఆర్ఎస్‌లో చేర్చుకుని ఏం ప్రయోజనం అన్న వాదన వినిపిస్తోంది. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ కు ఒక్క సీటు లేదు. ఇలాంటి సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని చేర్చుకుని ఆయనకు.. ఆయన భార్యకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల తెలంగాణ బీఆర్ఎస్ మొత్తం డిస్ట్రర్బ్ అవుతుందని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరాటానికి తెరపడుతుందని.. నల్లగొండ జిల్లా వరకూ కోమటిరెడ్డిదే రాజ్యం అవుతుందని అంటున్నారు.

ఇక జగ్గారెడ్డిని చేర్చుకుని కొత్తగా తెచ్చుకునే బలం ఏమిటన్న వాదన ఉంది. అక్కడ చింతా ప్రభాకర్ కీలక నేతగా ఉన్నారు. పార్టీకోసం కష్టపడి పని చేసిన వారు ఉన్నారు. వారిని కాదని.. వారికి వ్యతిరేకంగా పని చేసిన జగ్గారెడ్డిని రాత్రికి రాత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా అనే వాదన వినిపిస్తోంది. మరికొంత మంది సీనియర్ నేతల్ని కూడా చేర్చుకుంటారని భావిస్తున్నారు. అయితే కేసీఆర్ వారి వల్ల అదనపు లాభం వస్తుందని ఆశించడం లేదని.. కాంగ్రెస్ పార్టీని నైతికంగా… బలమైన దెబ్బకొట్టాలని అనుకుంటున్నారని అందుకే పార్టీలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. కానీ కాంగ్రెస్ ను బలహీనం చేయడానికి అక్కడి నేతల్ని తీసుకుని … తమ పార్టీని వర్గ పోరాటంలోకి నెట్టేసుకుంటున్నారన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వినిపిస్తోంది. కారణం ఏదైనా ఈ నెలలో .. కాంగ్రెస్ నుంచి సీనియర్లు బీఆర్ఎస్ లోచేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని కాంగ్రెస్ ఎలా ఎదర్కొంటుందన్నది కీలకం.

రాజకీయాల్లో తాము బలపడటం కన్నా ఒక్కో సారి ప్రత్యర్థిని బలహీనపర్చడం గొప్ప వ్యూహం అవుతుంది. కానీ ప్రత్యర్థిపై ఇలాంటి ప్లాన్ అమలు చేసే ముందుకు తమకు ఎఫెక్ట్ అవుతుందేమో పరిశీలించకపోతే… తమ వ్యూహం తమకే బూమరాంగ్ అవుతుంది. కాంగ్రెస్ సీనియర్ల విషయంలో కేసీఆర్ ప్లాన్ అలాంటిదే.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి