కమ్మ కులానికి బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్

By KTV Telugu On 10 November, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ రాజకీయాలు  వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సీన్ లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. అన్ని  వర్గాలను కలుపుకుపోయేందుకు పార్టీలు   ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగానే అధికార బీఆర్ఎస్ కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం ప్రకటించిన తర్వాత పరిస్థితులను సమీక్షించిన  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..ఇంతకాలం తమకు దూరంగా ఉన్న సామాజికవర్గాలను, నేతలను దగ్గరకు చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సమయం లేదు మిత్రమా త్వరగా కలిసిపోదామన్న నినాదంతో ముందుకు కదులుతున్నారు…

తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంద‌ని ప్ర‌క‌టించ‌గానే బీఆర్ఎస్  నేతలు సీన్ మార్చేశారు.. ఆ వెంట‌నే మంత్రి కేటీఆర్ నుంచి కేసీఆర్ త‌న‌య క‌విత వ‌ర‌కు చంద్ర‌బాబుపై సానుభూతి వచనాలు పలికారు. ఇక‌, టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నాయ‌కుల‌కు కండువాలు క‌ప్పే ప్ర‌య‌త్నం కూడా చేశారు. ఇలా తొలుత రెడ్డి నేత‌ల‌ను, త‌ర్వాత క‌మ్మ నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. రెడ్డి వ‌ర్గం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ  మంత్రిగా పనిచేసిన నాగం జ‌నార్ధ‌న్‌రెడ్డి, రావుల చంద్ర‌శేఖ‌ర‌రెడ్డితో పాటు  ఎర్ర శేఖర్, మాజీ మంత్రి కోనేరు సత్యనారాయణ  ఇతర నేతలను చేర్చుకున్నారు. టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన అనుచరులతో వచ్చి బీఆర్ఎస్లో బేషరతుగా చేరారు. టీడీపీలో చేరి మోసపోయానన్న ఫీలింగ్ కాసానిలో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన  పనిలేదు.

ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్లగొండపై బీఆర్ఎస్  ప్రత్యేక దృష్టి పెట్టింది.  2014, 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఆయా వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పు కొనే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇంతకాలం టీడీపీ అంటే ఆంధ్రాపార్టీ అని ప్రచారం  చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అనివార్యంగా ఆ పార్టీ సానుభూతిపరులను  తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది.ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిందే. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల కమ్మ సామాజిక వర్గానికి బాగా కోపం వచ్చిందని బీఆర్ఎస్ గ్రహించింది. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వేధిస్తుంటే ఏపీ ప్రభుత్వానికి బీజేపీ సహకరిస్తోందన్న కోపం కమ్మ సామాజికవర్గంలో ఉంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ప్రాణం పోసే ప్రయత్నంగా జనసేన పొత్తు పెట్టుకుందని కమ్మ కులస్తులు ఆగ్రహం చెందుతున్నారు. అలాంటి అసంతృప్తిపరులను బీఆర్ఎస్ ఆకర్షించగలుగుతోంది. ఇటీవల రెండు విడతలుగా కొందరు కమ్మ సామాజికవర్గం ప్రతినిధులు బీఆర్ఎస్లో  చేరారు. వారంతా కేటీఆర్ సమక్షంలో ఆయనతో చర్చలు జరిపిన తర్వాతే తమ  భవిష్యత్  డిమాండ్లను  ప్రస్తావించి మరీ చేరినట్లు చెబుతున్నారు.ఇదీ తమకు పూర్తి అడ్వాంటేజ్ అని కేసీఆర్ భావిస్తున్నారు. సెటిలర్ల ఓట్లు పోలరైజ్ అయితే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని బీఆర్ఎస్ మొదటి నుంచి అంచనా వేసుకుంటోంది.  సెటిలర్ల ఓట్లు ఏకమొత్తంగా ఒకే పార్టీకి చేరితే తమకు ఇబ్బంది ఖాయమని భావిస్తున్న తరుణంలోనే బీజేపీ-జనసేన పొత్తు కుదరడం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అందుకు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవడం సాధ్యపడిందని చెబుతున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి