నిజామాబాద్ లోక్ సభా నియోజకవర్గంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారా ? ఎంపీ అరవింద్ ను ఓడించి తీరాల్సిందేనని డిసైడయ్యారా ? అందుకు అన్ని వైపుల నుంచి కమ్ముకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా..? ఈ దిశగా నిజామాబాద్ శ్రేణులకు ఆదేశాలిచ్చారా.
టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన ఎంపీ అరవింద్
కవితపై ఆరోపణలతో గులాబీ పార్టీని ఇబ్బంది పెడుతున్న వైనం
ఈసారి అరవింద్ ను ఓడిచేందుకు కేసీఆర్ వ్యూహం
ప్రగతి భవన్ భేటీలో నేతలకు దిశానిర్దేశం
నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు
జిల్లా నేతలకు సీక్రెట్ మిషన్
నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కవిత ఓడిపోవడం సీఎం కేసీఆర్‌కు అసలు మింగుడు పడటం లేదు. 2019 ఎన్నికల ఫలితాన్ని సీఎం తన వ్యక్తిగత ఓటమిగా పరిగణిస్తున్నారు. పసుపు రైతుల సహా అన్ని సమస్యలు ఒకే సారి వచ్చి పడటంతో కవిత అవమానకర రీతిలో ఓడిపోయారు. కవిత ఇప్పటికీ అది టెక్నికల్ డిఫీట్ అని చెబుతుంటారు. పైగా గెలిచినప్పటి నుంచి అరవింద్ దూకుడును పెంచి కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడుతున్నారు. తన భాష, యాస ప్రయోగాలతో ఇరుకున పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమాలకు అరవింద్ నాయకత్వం వహిస్తున్నారు. ఓ దశలో అధికార పక్షమైన టీఆర్ఎస్‌ను చేష్టలుడిగేలా చేసి అంగ, అర్ధ బలాలు ప్రదర్శించారు. ఈ క్రమంలోనే కొంతకాలంగా ఎమ్మెల్సీ కవితను మరింత టార్గెట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరుందని తెలిసినప్పటి నుంచి అరవింద్ కౌంటర్లు ఎక్కువయ్యాయి. ఆమె జైలుకు వెళ్ళడం ఖాయమని ప్రచారం చేస్తూ ఒత్తిడి తెస్తున్నారు. పైగా కవిత కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని ఆయన కనిపించిన వారందరికీ చెబుతున్నారు. దానితో కేసీఆర్ కూతురికి బాగా కోపమొచ్చింది. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కవిత సమాధానం ఇచ్చారు. అయినా అరవింద్ దూకుడు తగ్గడం లేదు. తనను చంపుతానని బహిరంగంగా ప్రకటించారంటూ అరవింద్ కోర్టును ఆశ్రయించారు. ఆమెపై కేసు నమోదు చేయాలని కోరారు. ఇలా మాటల యుద్ధం కాస్త ఫిర్యాదులు, కేసుల వరకు వెళ్ళడంతో అరవింద్ వర్సెస్ కవిత ఎపిసోడ్ వేడెక్కింది. ఇదీ తెలంగాణ సీఎంకు సుతారమూ నచ్చలేదు. పైగా కొందరు టీఆర్ఎస్ నేతలు అరవింద్ తో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం ఆయనకు ఆగ్రహం తెప్పిస్తోంది. టీఆర్ఎస్ నిజామాబాద్ నేతలు అరవింద్ ను కౌంటర్ చేయడంలో కూడా విఫలమవుతున్నారు.
నిజామాబాద్ పరిస్థితులు నానాటికీ చేజారుతుండడంతో గులాబీబాస్ స్పందించక తప్పలేదు. ఇటీవల నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వారి తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తరహాలో ఎదురుదాడులు చేయాలని అందరినీ ఆదేశించారు. టీఆర్ఎస్ తరపున ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని ఆయన సూచించారు. స్థానిక నేతలకు ఇబ్బందులు లేకుండా నిధులు కూడా కేటాయిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాలో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిలో భాగంగానే నిజామాబాద్ నగరాన్ని మరింత ముస్తాబు చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ పాటికే మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. నిజామాబాద్ రైతులు వెళ్లి ధాన్యాన్ని అరవింద్ ఇంటి ముందు పారబోయడం లాంటి పరిణామాలను మెచ్చుకున్న గులాబీ బాస్ భవిష్యత్తులో కూడా అలాంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కొందరు నేతలకు సీఎం ఒక సీక్రెట్ మిషన్ అప్పగించిట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి అరవింద్ పోటీ చేయకుండా చూడాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ పదవికి కాకుండా ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలని అరవింద్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడైనా మనసు మార్చుకుని తిరిగి నిజామాబాద్ ఎంపీ బరిలో నిలుస్తారన్న అనుమానాలు టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తున్నారు. కవిత నిజామాబాద్ బరిలోకి దిగిన పక్షంలో ఆమె విజయానికి అరవింద్ అడ్డురాకూడదన్నది కేసీఆర్ ఉద్దేశంగా తెలుస్తోంది అందుకే రోజుకో కార్యక్రమంతో బీజేపీ ఎంపీని ఇబ్బంది పెట్టాలని సీఎం తీర్మానించారు..