మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలకు దారితీసింది. టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఆపరేషన్ ఆకర్స్‌కు తెరలేపారు. దాంతో టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి…. బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ నాలుగు కోట్ల రూపాయలతో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనే వార్త తెలంగాణలో కలకలం రేపింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులతో బీజేపీ బేరసారాలకు దిగినట్లు వార్తలొచ్చాయి. ఒక్కొక్కరికి వంద కోట్లు, కాంట్రాక్టులు ఎర చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలతో మధ్యవర్తులు డీల్ మాట్లాడుతున్నప్పుడు పోలీసులు రెయిడ్ చేసి గుట్టు రట్టు చేశారు. అయితే ఇదంతా పక్కా ప్లాన్ తో జరిగినట్లు తెలుస్తోంది.
బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి టీఆర్‌ఎస్ పన్నిన వ్యూహం అని అనుకుంటున్నారు. అందుకే ఈ డీల్‌కు సంబంధించి ముందుగానే సమాచారం అందడంతో 70 మంది పోలీసులు పక్కా ప్లాన్‌తో మూడు రోజులు నిఘా పెట్టారు. 84 సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సేకరించారు. అంతేకాకుండా డీల్ మాట్లాడే సంభాషణలను ఆడియో, వీడియో దృశ్యాలను కూడా హైక్వాలిటీ కెమెరాలతో రికార్డు చేశారు. ఫామ్‌హైస్ లోపల రికార్డు చేసిన గంటా ఇరవై నిమిషాల ఫుటేజి ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫామ్‌హౌస్‌లో ఎంత డబ్బు రికవరీ చేశారో తెలియట్లేదు. ఈ ఆడియో, వీడియో టేపులు సీఎం కేసీఆర్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి వివరాలు చెబుతారని అనుకుంటున్నారు. అసలింతకీ ఎమ్మెల్యే కొనుగోలుకు స్కెచ్ వేసిందెవరు…అసలు సూత్రదారులు ఎవరు అనేది తేలాల్సి ఉంది. బీజేపీ మాత్రం ఇదంతా ప్రగతిభవన్ కుట్ర అని చెబుతోంది. అయితే ఎపిసోడ్‌లో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనడం వల్ల బీజేపీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. నలుగురు ఎమ్మెల్యులు టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరడం వల్ల మునుగోడులో వారికి నాలుగు ఓట్లు కూడా అదనంగా పడవు. అలాంటప్పడు బీజేపీ ఎందుకు ఇలా చేస్తుందనే అనుమనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.