తుమ్మల అలక తీరే టైమ్ వచ్చిందా. మాజీ మంత్రి బల ప్రదర్శనతో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారా. తన మిత్రుడు చేజారి పోకుండా చూసుకునేందుకు ప్లాన్ రెడీ చేశారా. ఆయన ప్లాన్ దాదాపుగా వర్కవుట్ అయినట్లేనా..ఖమ్మం రాజకీయం మారినట్లేనా….
అవసరాన్ని బట్టి ఎలా తగ్గాలో తెలిసిన వాడేరా కేసీఆర్ అని చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. ఇప్పుడు కూడా గులాబీ దళపతి సేమ్ గేమ్ ఆడుతున్నారు. కందాల ఉపేందర్ రెడ్డిని కాదని పాలేరు టికెట్ తుమ్మల నాగేశ్వరరావుకు ఇవ్వలేని పరిస్థితుల్లో కేసీఆర్ తూచి తూచి ఆలోచించి కొత్త ఫార్ములాను రెడీ చేశారు. తుమ్మల గౌరవానికి భంగం కలగకుండా, ఆయనకు హోదా మరింతగా పెరిగే పదవిని సిద్ధం చేశారు. ఇక పబ్లిగ్గా ప్రకటించి.. తుమ్మలతో మమ అనిపించడమే మిగిలిందని బీఆర్ఎస్ పార్టీలో అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తుమ్మల చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదన్న కోపం ఆయనకు ఉంది. ఒక దశలో బీఆర్ఎస్లో ఉండాలా. పోవాలా అన్న మీమాంస కూడా ఆయనలో కలిగింది. తీరా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించే నాటికి ఆయన కోపం తారా స్థాయికి చేరింది. తనకు దక్కాల్సిన పాలేరు టికెట్ కుందాల ఉపేందర్ రెడ్డికి ఇచ్చెయ్యడం కూడా ఆయనకు ఏ మాత్రం నచ్చలేదు. పైగా తనకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడం ఆయన కోపానికి మరో కారణంగా చెబుతున్నారు. దానితో తుమ్మల ఖమ్మం వరకు భారీ ర్యాలీ తీశారు. వేలాది మంది కార్యకర్తలు, వందలాది వాహనాల్లో తరలి వచ్చిన ర్యాలీలో తుమ్మల భావోద్వేగానికి లోనయ్యారు. పూర్తి వ్యవహారంపై నివేదిక తెప్పించుకున్న కేసీఆర్.. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మలను వదులుకోకూడదని నిర్ణయించుకున్నారు.
టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్, తుమ్మల ఆప్త మిత్రులు. అందుకే అప్పటి టీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారు. పొంగులేటి దెబ్బ కొట్టడంతో 2018లో తుమ్మల ఓడిపోయారు. లేనిపక్షంలో ఆయనకు మంత్రిపదవి దక్కేది. ఇప్పుడు మళ్లీ తన మిత్రుడికి తగిన గౌరవం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. తుమ్మలను పార్టీలోనే కొనసాగేలా చేసేందుకు కేసీఆర్ రంగంలో దిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే టికెట్ దక్కని తుమ్మలను రాజ్యసభకు పంపించడంతో పాటు ఢిల్లీలో బీఆర్ఎస్ వ్యవహారాలు చూసుకునే బాధ్యతను ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు తుమ్మలతో రాయబారాలు చేస్తున్నారని టాక్. తుమ్మలతో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించినట్లు తెలిసింది. కె.కేశవరావును పొడిగించే అవకాశం లేదని, ఇక ఢిల్లీలో అధికారం తుమ్మలదే అని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.
మాస్టర్ ప్లాన్లు వేయడంతో కేసీఆర్ దిట్ట. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కొంచెం బలహీనంగా మారినట్లు ఆయన గుర్తించారు. పైగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంగబలం, అర్థబలంతో కాంగ్రెస్ ను బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానితో కేసీఆర్ కొంతమంది కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా తుమ్మలను వెళ్లకుండా ఆయన దాదాపు తనతో సమానమైన పదవి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా బీఆర్ఎస్ వైపే వస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ వైపుకు వెళ్లిపోతే, కమ్మ వారు తమ పక్కన ఉండారని ఆయన విశ్వాసం. చూడాలి మరి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…