తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనుకున్నట్లుగా ఎన్నికల విజయం అంది వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్ని హామీలిచ్చినా కేసీఆర్ ను విశ్వసించేందుకు తెలంగాణ గ్రామీణ ప్రజలు సిద్ధంగా లేదని తెలిసిపోయింది. దానితో కేసీఆర్ కొత్త వ్యూహాలను అమలు చేయక తప్పడం లేదు. చివరకు బహిరంగ సభలకు వచ్చిన జనం దగ్గరే ఆయన సీక్రెట్ సర్వే చేయిస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీలో 15 చోట్ల బయట నుంచి వచ్చిన అభ్యర్థులు ఉన్నా… అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతున్నా సరే ఆ పార్టీ గ్రాఫ్ మాత్రం పెరుగుతోంది. అర్బన్లో టీఆర్ఎస్ పుంజుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం గులాబీ దళానికి చుక్కెదురవుతోంది. దళిత బంధు, ధరణి లాంటి వాటిలో అవకతవకల కారణంగా బీఆర్ఎస్ పట్ల గ్రామీణ ఓటర్లు తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. ఈ సారి బీఆర్ఎస్ ఓటెయ్యకూడదన్న భావన మెజార్టీ గ్రామీణుల్లో ఏర్పడినట్లు సమాచారం. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుండడంతో బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా హస్తం పార్టీకి గట్టి పట్టున్న సెగ్మెంట్లను గుర్తించి, అక్కడ పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా దసరా తరువాత సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న పబ్లిక్ మీటింగ్స్ మొత్తం కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే జరుగుతున్నాయి. అక్కడ ఫోకస్ పెట్టకపోతే కాంగ్రెస్ మరింత పుంజుకుని, పొరుగున ఉన్న సెగ్మెంట్లపై కూడా ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ తన ప్రసంగాల్లో ఆచి తూచి వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. ఎవరినీ ఎక్కువ తిట్టినట్లుగా కాకుండా, జనానికి కోపం రాకుండా చూసుకుంటున్నారు. పైగా అక్కడక్కడా సీమాంధ్రుల ప్రస్తావన తెస్తూ తెలంగాణ సెంటిమెంటును రగిల్చే ప్రయత్నంలో ఉన్నారు. ఐనా సరే సెటిలర్లను నొప్పించే మాటలు మాత్రం మాట్లాడటం లేదు. కేసీఆర్ మీటింగుకు జన సమీకరణ కూడా పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సారి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోందని స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రతీ సభకు కనీసం రెండు కోట్ల రూపాయలు ఖర్చవుతోందని పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. వచ్చిన జనాన్ని విందులు, వినోదాల్లో ముంచి వేసి బీఆర్ఎస్ పట్ల వారి మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. అందులోనూ ఎక్కువ మందిని గ్రామీణ ప్రాంతాల నుంచి తరలించి,,, వారి ఆలోచనలను బీఆర్ఎస్ వైపుకు మళ్లీంచేందుకు స్థానిక నాయకత్వంతో పాటు సర్వే సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే క్రమంలో కర్ణాటకలో తాజా వైఫల్యాలను కూడా కేసీఆర్ ప్రస్తావించడంతో పాటు ఆ సంగతిని జనంలోకి తీసుకెళ్లే పనిని సర్వే సంస్థలకు అప్పగించారు.
ఈ నెలాఖరున తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరుగుతున్నందున కేసీఆర్ ఆలోచనా విధానాన్ని మెల్లమెల్లగా జనంలోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఇంతవరకు పేద, అల్పాదాయ వర్గాలకు ఇచ్చిందేమిటో పూస గుచ్చినట్లు వివరించాలని కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నిక తరహాలో ప్రతీ వంద ఇళ్లను ఇద్దరు ముగ్గురు కార్యకర్తలున్న టీమ్ కు కేటాయిస్తే అనుకూల పరిణామాలకు అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది.ఐనా సరే ఏదో వెలితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పట్ల గ్రామీణులు అంత ఆసక్తిగా లేరన్న అనుమానాలు పెరుగుతున్న వేళ.. కేసీఆర్ అమ్ములపొది నుంచి కొత్త అస్త్రాలు బయటకు తీసే ప్రయత్నంలో ఉన్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…