తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు ఉంటాయో ఊహించడం కష్టం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యర్థిపై పోరాడటం కన్నా తమలో తాము పోరాడుకుంటూ ఉంటారు. అలాంటి పోరాటంలో తమ పార్టీ అంతిమంగా నష్టపోయినా నష్టపోతుందని తెలిసినా వారు ఏ మాత్రం తగ్గరు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మరోసారి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయనకు తిరుగులేదన్నట్లుగా పరిస్థితి మారుతోంది. సీనియర్లు పార్టీలో ఉండాలా బయటకు పోవాలా అని ఆలోచించుకుని రేవంత్ రెడ్డికి పార్టీని వదిలి వెళ్లడం ఏమిటని తీర్మానించుకుని చివరికి ఆయననే బలహీనం చేయాలని డిసైడయ్యారు. చేయగలిగినవన్ని చేశారు ఇప్పుడు భట్టి విక్రమార్క పాదయాత్రకు లేనిపోని హైప్ క్రియేట్ చేసుకుని దళిత ముఖ్యమంత్రి నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు.
ఇటీవల రేవంత్ రెడ్డికి పోటీగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించారు. పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మంచిర్యాలలో నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే రావడంతో పాటు రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చారు. అయితే సభలో సీనియర్ నేతల హడావుడే ఎక్కువ కనిపించింది. సభలో మాట్లాడిన వక్తలందరు దళిత వాదాన్నే వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో దళిత వర్గాలకు చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దళిత సీఎం హామీ మూడు ఎకరాల భూ పంపిణీ ఏమైంది. పోడు భూముల సమస్యతో పాటు కేసీఆర్ మంత్రి వర్గంలో సామాజిక న్యాయం కొరవడిందంటూ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఓ రకంగా దళిత మహా గర్జన అన్నట్లుగా సభను నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే మొదటి సీఎం దళితుడేనని హామీ ఇచ్చి దళిత వర్గాలను మోసం చేశారని విమర్శిస్తున్నామని అదే కాంగ్రెస్లో దళిత సీఎం నినాదం తీసుకుంటే బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టవచ్చని దళిత వర్గాల ఓట్లన్నీ గుంపగుత్తగా పడతాయని సీనియర్లు భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి చూచాయగా ఈ విషయాన్ని తీసుకెళ్లిన నేతలు హైకమాండ్ వద్దకు సమగ్ర ప్రతిపాదనలతో వెళ్లాలని అనుకుంటున్నారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలిచేస్తుదంన్న అంకెలతో సర్వే రిపోర్టులతో వారు హైకమాండ్ వద్దకు వెళ్లే అకాశాలు ఉన్నాయి. ఇదంతా మల్లు భట్టివిక్రమార్క కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.
నిజానికి సీనియర్లు దళిత సీఎం వాదన ఎందుకు తీసుకు వచ్చారో చెప్పడం కష్టం ఏమీ కాదు వారి టార్గెట్ రేవంత్ రెడ్డి. ఆయన సీఎం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యం. దళిత సీఎం నినాదంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దూకుడుకు చెక్ పెట్టొచ్చనే ఆలోచనతో సీనియర్ నాయకులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నానని తానే సీఎంననే భావనలో ఉన్నారు. కానీ ఇటీవల ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయనకు పోటీగా మల్లు భట్టివిక్రమార్కను హైకమాండ్ ప్రోత్సహిస్తోంది. ఈవిషయాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మిగతా సీనియర్ల మధ్య విబేధాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. పార్టీలో టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నాయకత్వాన్ని ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు భరించలేకపోతున్నారు. అందుకే చెక్ పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు దళిత సీఎం అనే నినాదంతో గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీనియర్ల ఈ ప్రతిపాదన ప్రస్తుతం వారి దగ్గరే ఉంది హైకమాండ్ వద్దకు చేరలేదు. చేరిన తర్వాత ఎలా స్పందిస్తారనేది కీలకం. దాన్నే బట్టే కాంగ్రెస్లో తదుపరి రాజకీయాలు ఉంటాయని అనుకోవచ్చు.