తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఉమ్మడి పాలమూరులో గులాబీ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నా పట్టించుకోవడంలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్లు పార్టీ వీడినా నష్టం లేదనుకుంటున్నారా? అందుకే వారి గురించి పట్టించుకోవడంలేదా? పాలమూరు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ..
పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు..తమ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే పార్టీని వీడుతున్నట్టు అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రేస్‌లో చేరబోతున్న నేతలు ప్రకటిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి నష్టం జరుగకుండా వారిని బుజ్జగించటం వంటివి లేకపోవడంతో..పార్టీ నుంచి వెళ్లిపోతున్నవారి పట్ల బీఆర్‌ఎస్ నిర్లిప్తంగా ఉంటున్నదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ధిక్కార స్వరం వినిపించడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్దన్‌రెడ్డి తర్వాత బీఆర్ఎస్‌లో చేరడంతో…జూపల్లితో ఆయనకు తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. వారిద్దరి మధ్య సఖ్యత కుదర్చడంలో పార్టీ నాయకత్వం విఫలం కావడంతో జూపల్లి తన దారి తాను చూసుకున్నారు. నాగర్‌కర్నూల్ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డికి పొసగటం లేదు. తన వర్గీయులపై ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని దామోదర్‌రెడ్డి మీడియా ముఖంగానే ఆరోపించారు. దామోదరరెడ్డి పార్టీ వీడతారంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నా బీఆర్ఎస్ నాయకత్వం ఆయనతో ఎలాంటి చర్చలు జరపలేదు. దీంతో కూచుకుళ్ళ తన కుమారుడు రాజేశ్‌రెడ్డితో కలిసి కాంగ్రేస్ తీర్ధం పుచ్చుకోబోతున్నారు.
తనయుడి సీటుకోసమే ఆయన పార్టీ మారుతున్నాడని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇక గద్వాలలో జడ్పీ చైర్పర్సన్ సరితకు, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మద్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. వీరిద్దరి పంచాయితీపైనా అధిష్టానం దృష్టి పెట్టలేదు. అందుకే ఆత్మాభిమానం దెబ్బతిన్న సరిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొడంగల్ నుంచి 5 సార్లు గెలిచిన గుర్నాథ్‌రెడ్డి విషయంలో కూడ గులాబీ పార్టీ తీవ్ర వివక్షతతో వ్యవహరించిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ది కోసం ఎంత కష్టపడినా ఆయన గురించి పార్టీ పట్టించుకోలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు రెండేళ్ళ నుంచి దూరంగా ఉంటున్న గుర్నాథరెడ్డి ఇక కాంగ్రస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. వీళ్లే కాక చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదనే వాదన బలంగా ఉంది. ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటం వల్లే పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. ఇటువంటి వాళ్ళంతా సమయం చూసి గోడ దూకేందుకు సిద్దమవుతున్నారట. బీఆర్‌ఎస్ నాయకత్వం అప్రమత్తమై నష్టనివారణ చర్యలు చేపట్టకుంటే పార్టీకి నష్టం తప్పదనే టాక్ నడుస్తోంది.
పార్టీనుంచి వెళ్ళిపోదామనుకుంటున్నవారిని బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోవటం లేదో అర్దం కావటం లేదంటున్నారు స్దానిక నేతలు. అయితే మారాలని నిర్ణయించుకున్నవారితో చర్చించి ఫలితం లేదనే వారిని పట్టించుకోవడంలేదంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడేవారి సంఖ్య పెరిగిందని, అందుకే పోయేవాళ్లు పోతే ఉన్నవాళ్లతో ఇల్లు చక్కదిద్దుకోవచ్చనే వ్యూహంతోనే పార్టీ నాయకత్వం వారిని వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..