సీట్లు వస్తే పవన్ కు తిరుగుండదా ?

By KTV Telugu On 10 November, 2023
image

KTV TELUGU :-

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. ప్రయత్నిస్తే అధికారానికి ఏదో విధంగా చేరువగా ఉండటం కష్టమేమీ కాదంటారు. బహుశా  పవన్ కూడా అదే ఆలోచిస్తూ ఉండొచ్చు. అందుకే తెలంగాణలో 32 స్థానాల్లో తనకు బలముందని ప్రకటించుకున్నా… బీజేపీ ఇచ్చిన ఎనిమిది సీట్లతో సరిపెట్టుకున్నారు. అందులోనూ ఒక గేమ్ ప్లాన్ ఉంది. పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో గరిష్టంగా ఎన్ని గెలవగలిగితే అంత మంచిదన్న ఫీలింగ్ లో జనసేన ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో జనసేనకు కూకట్ పల్లి మాత్రమే కేటాయించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని తప్పక గెలవాలన్న  దృఢ సంకల్పంలో పవన్ ఉన్నారు. సెటిలర్ల ఓట్లతో పాటు బీఆర్ఎస్ పై సిటీలో నెలకొన్న అసంతృప్తిని  క్యాష్ చేసుకోగలిగితే కూకట్ పల్లిలో గెలవడం కష్టమేమీ కాదన్న నమ్మకం జనసేనకు కలుగుతోంది. ఇక ఖమ్మం జిల్లాలో తనదైన మార్కు చూపించాలని కూడా జనసేన డిసైడైంది. సగానికి పైగా స్థానాలు సాధించి, తెలంగాణలో బీజేపీకి కూడా ఎక్కువ సీట్లు వస్తే తమ రేంజ్ మారిపోతుందన్న నమ్మకం కలుగుతోంది.

పవన్ కల్యాణ్ మదిలో మరో అంశం కూడా ఉందనుకోవాలి. ఏపీ అసెంబ్లీలో జనసేనకు ఒక సీటు కూడా లేదు. ఆ పార్టీ  తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వైసీపీలో చేరారు.  దానితో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనానికి జనసేనపై విశ్వాసం కలిగించుకునేందుకు తెలంగాణ ఎన్నికలు పనికి వస్తాయని పవన్ అంచనా వేసుకుంటున్నారు. తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచినా అది ఏపీ ఓటర్ల మనోభావాలపై ప్రభావం చూపుతుందన్న నమ్మకమూ పవన్ కు వస్తుంది. ఏప్రిలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనం ముందుకు వెళ్లి పవన్ ధైర్యంగా మాట్లాడే  అవకాశమూ కలుగుతుందని జనసేన వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. అందుకే తమ పార్టీకి కేటాయించిన ఎనిమిది స్థానాల్లో పక్షం  రోజులకు పైగా విస్తృత ప్రచారానికి జనసేన ప్లాన్ చేస్తోంది. జనసేన ఏపీ నేతలను  సైతం ప్రచారంలోకి దించుతుందని సమాచారం. పైగా తెలంగాణ పోటీ నుంచి టీడీపీ తప్పుకున్నందున తమకు ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుందని కూడా జనసేన భావిస్తోంది.  టీడీపీ బరిలో లేని కారణంగా తమకు ఓటెయ్యాలని నేరుగా చెప్పలేకపోయినా అలాంటి సందేశాలను అప్పుడప్పుడూ వదులుతూ ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్రధాని మోదీ నాయకత్వమే తెలంగాణలో గెలిపిస్తుందని పవన్ కల్యాణ్ విశ్వసిస్తున్నారు.  అందుకే లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ గర్జన సభలో  మోదీని ఆకాశానికెత్తేశారు. వరుసగా మూడో సారి ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని, విజన్ 2047 దిశగా దేశానికి దిశానిర్దేశం చేయాలని ఆకాంక్షించారు.బీసీలకు బీజేపీ ద్వారానే న్యాయం జరుగుతుందని ఆయన ప్రకటించారు. తెలంగాణ సమస్యలపై కూడా తనకు అవగాహన ఉందని చెప్పేందుకు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో బీజేపీ పెద్దలకు ఫుల్ క్లారిటీ ఉందని తేల్చారు.  పవన్ ప్రశంసల వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని చెప్పాలి. ఎవరు కాదన్నా ఏపీలో బీజేపీ, టీడీపీ మధ్య చాలా గ్యాప్ వచ్చిందని అంగీకరించాలి. ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు తాను వారధిలా పనిచేయాల్సిన అనివార్యత ఉందని, ఇప్పటికే తన వైపు నుంచి పొత్తును ప్రకటించడం ద్వారా కొంతమేర సక్సెస్ సాధించానని ఆయనకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన కోరిక నేరవేరాలంటే.. ఏపీలో  పొత్తు  పటిష్టం కావాలి. అది జరగాలంటే , తన వాదనను మిగతా పార్టీలు పరిగణించాలంటే.. తెలంగాణలో నాలుగైదు స్థానాలైనా గెలిచి విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలి. ఏం జరుగుతుందో చూడాలి…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి