ఏపీలో ఎదిగేందుకు పవన్ కల్యాణ్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం కష్టంగా మారింది. వైసీపీ కూడా జనసేనను ఇదే విషయంలో టార్గెట్ చేస్తోంది. దమ్ముంటే పవన్ మొత్తం నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాలని సవాల్ విసురుతోంది. పొత్తులు లేకుండా ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తోంది. ఏపీలో ప్రత్యర్థుల నుంచి ఆవిధమైన విమర్శలు ఎదుర్కొంటోన్న ఆ పార్టీ తెలంగాణలోనూ పోటీకి సిద్ధమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చింది. రాష్ట్రంలో 32 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన పవన్ సేన ఆయా స్థానాలకు కార్యనిర్వాహకులను ఎంపిక చేయడం విశేషం. ఏపీ కన్నా తెలంగాణలో ముందుగా ఎన్నికలుండడంతో జనసేన ఆ దిశగా దృష్టిసారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే టీడీపీ లాంటి బలమైన పార్టీయే తెలంగాణపై ఆశలు వదిలేసుకుంది. మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ అవి ఏమేరకు సఫలీకృతమవుతాయో తెలియని పరిస్థితి. ఇక గతంలో ఓ ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైసీపీ తెలంగాణలో మూటముళ్లె సర్దుకుంది. రాజన్న ఆశయ సాధనే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల వన్ ఉమెన్ షో చేస్తున్నారు. 3,500కి.మీ.కు పైగా పాదయాత్ర చేసినా, నిత్యం జనంలోనే ఉంటూ పోరాడుతున్నా, కేసీఆర్‌పై పోరాటంలో మీడియా కవరేజ్ లభిస్తున్నా ప్రజాధారణ మాత్రం దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీ విస్తరణకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు వృథా ప్రయాసే అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణపై జనసేన దృష్టిపెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనముండదనే భావన రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
గత ఎన్నికల్లో ఏపీలో కేవలం ఒక్క స్థానానికే జనసేన పరిమితమైంది. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. అయితే ఈసారి జగన్ సర్కార్ పై దూకుడుగా వెళ్తున్న పవన్ వైసీపీ విముక్త రాష్ట్రం కోసం విపక్షాలను కలుపుకొని పోతామంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని కుండబద్దలు కొడుతున్నారు. అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని శపథం చేస్తున్న పవన్ తెలంగాణలో గెలవమని తెలిసినా పోటీకి సిద్ధమంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో చిన్నా చితకా పార్టీలను మినహాయిస్తే మొన్న బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌తో పాటు ప్రధాన పార్టీలన్నీ జాతీయ పార్టీలే ఉన్నాయి. కేసీఆర్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఈనేపథ్యంలో జనసేన మరే పార్టీ పోటీ చేసినా అది ఓట్లు చీల్చడానికే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదనేది జగమెరిగిన సత్యం.