అనైక్యతే కాంగ్రెస్ పార్టీ సమస్యగా కనిపిస్తోంది. ఒకరు ఒక మెట్టు పైకి వెళితే నలుగురు కలిసి నాలుగు మెట్లు కిందకు లాగుతారు. విపక్షంలో ఉన్నప్పుడు ఐకమత్యంగా ఉండి అధికారం వైపు వడివడిగా అడుగులు వేయాల్సిన పార్టీ కొందరు నేతల పేరాశ క్రమశిక్షణారాహిత్యం కారణంగా టేకాఫ్ సమస్యలు ఎదుర్కొంటోంది. అందరూ కలిసి రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలని కేంద్రంలోని ఎన్డీయే అరాచకాలను ఎండగట్టాల్సింది పోయి పార్టీలోనే కీచులాటలు పెంచుకుంటున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అధిష్టానం మద్దతుతో సాగుతున్న యాత్రలో కొందరు సీనియర్లు పాల్గొంటున్నారు. సీతక్క యాత్రలో పాల్గొంటూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జనం భారీ సంఖ్యలో వచ్చి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనతో తమ బాధలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల జాప్యాన్ని కొన్ని ప్రాజెక్టులను బుద్ధిపూర్వకంగా వదిలెయ్యడాన్ని రేవంత్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూన్నారు. అధికారానికి రాగానే వాటిని పూర్తి చేస్తామంటున్నారు.
రేవంత్ కు జనం నీరాజనం పడుతున్నప్పటికీ కాంగ్రెస్లో కొందరు మాత్రం లొల్లి పెడుతున్నారు. రేవంత్ నాయకత్వాన్ని ఎందుకు అంగీకరించాలనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. అందులో ఇప్పుడు నిర్మల మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాయి. తెలంగాణలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీకి చైర్మన్ గా ఉన్న మహేశ్వర్ రెడ్డి అసలు రేవంత్ ను ఎందుకు లెక్క చేయాలన్న ఆలోచనతో తొందరపాటు చర్యలను ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ యాత్ర సాగుతుండగానే మహేశ్వర్ రెడ్డి కూడా పోటీ పాదయాత్ర చేశారు. పైగా తన యాత్రకు ఏఐసీసీ అనుమతి ఉందని చెప్పుకున్నారు. నిర్మల ఆయన అడ్డా అయినప్పటికీ కొంచెం ఓవరాక్షన్ చేసి భైంసా నుంచి పాదయాత్రను ప్రారంభించారు. నాలుగు రోజులకే ఆయన యాత్ర పలుచబడిపోయింది.
ముథోల్ నియోజకవర్గంలోని భైంసాలో ప్రారంభమైన యాత్రకు సీనియర్లు ఉత్తమ్, భట్టి, రాజనరసింహతోపాటు పలువురు హాజరయ్యారు. ఆ తర్వాత రోజు జరిగిన యాత్రలో సీనియర్లతో కలిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు థాక్రే పాల్గొన్నారు. మూడో రోజు దామోదర రాజనరసింహ మాత్రమే హాజరు కాగా నాలుగో రోజు మహేశ్వర్‌రెడ్డి ఒంటరిగానే పాదయాత్రను ముగించేశారు. అలా నిదానంగా యాత్రను జనం మరిచిపోయే పరిస్థితి వస్తోంది. హైదరాబాద్ చేరే సరికి మహేశ్వర్ రెడ్డి ఒంటరైపోతారనే చర్చ మొదలైంది. రేవంత్‌రెడ్డికి పోటీ యాత్ర అంటూ భారీగా హైప్ క్రియేట్ కావడంతో ఆయనతో టచ్‌లో ఉండే నేతలెవరూ పాదయాత్రకు హాజరు కావడం లేదు. తొలి రోజు యాత్రలో కనిపించిన జిల్లా సీనియర్ నేత ప్రేమ్‌సాగర్‌రావు మళ్ళీ అటు తిరిగి చూడలేదు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ సహా పలువురు నేతలు రెండో రోజు నుంచే ముఖం చాటేశారు.
పలువులు నేతలు యాత్రలు చేయాల్సి ఉండగా వారిలో ఇప్పుడు చాలా మంది పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఉత్తమ్, భట్టీ లాంటి వాళ్లు పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత యాత్ర చేస్తారని చెబుతున్నప్పటికీ వాటి కొనసాగింపు అనుమానమేనంటున్నారు. పైగా ప్లేటు ఫిరాయించినట్లుగా రేవంత్ నిర్వహించిన కరీంనగర్ బహిరంగ సభకు ఉత్తమ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. మహేశ్వర్ రెడ్డి యాత్రకు ప్రజా స్పందన రాకపోవడం రేవంత్ విజయంగా భావించాల్సి ఉంటుంది. పీసీసీ చీఫ్ వ్యతిరేకవర్గం నేలవిడిచి సాము చేస్తోందన్న అభిప్రాయం బలపడటంతో వారిని అధిష్టానం కట్టడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడాలంటే నాయకత్వం పటిష్టంగా ఉండాలి. లేని పోని ఓవరాక్షన్ చేసి మహేశ్వర్ రెడ్డి లాంటి వారు తాము అభాసుపాలైంది కాకుండా పార్టీని పలుచన చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ సీనియర్లు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టగలిగితే స్థూలంగా రాష్ట్రంలో పార్టీ అధికారానికి రావడం ఖాయమవుతోంది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా బీఆర్ఎస్ బలంగా ఉందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అధికార పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కూడా బాగా పెరుగుతోంది. జనం కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులకంటే రేవంత్ నే ఎక్కువగా నమ్ముతున్నారు. రేవంత్ కోసం కాంగ్రెస్ కు ఓటేసే పరిస్తితి రావచ్చు. పార్టీలో రేవంత్ వ్యతిరేక వర్గం ఇప్పటికైనా అర్థం చేసుకుని సహకరిస్తే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.