కాంగ్రెస్ ఓ మహాసముద్రం.. ఓడలు, పడవలు, తెప్పలు, బల్లలు.. ఎవరి ప్రయాణం వారిదే. ఒకరు ఎడ్డెమంటే మరొకరు తెడ్డెం. వరసగా రెండుసార్లు ఓడిపోయినా గతానుభవాలనుంచి ఆ పార్టీనేతలు పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇప్పటికీ అలకలు, గొడవలు, గ్రూపులు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కువ రాష్ట్రాల్లో ఆ పార్టీలో ఇప్పటికీ కుమ్ములాటలే. తెలుగురాష్ట్రాలు కూడా దీనికి భిన్నంగా ఏమీ లేవు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైపోయింది. తెలంగాణలో నేతల వలసలతో బలహీనపడ్డ పార్టీని పాడెక్కించే పనిలో ఉన్నారు పార్టీ లీడర్లు. అధికారపార్టీకి కాంగ్రెస్ ఒకప్పుడు ప్రధాన ప్రత్యర్థి. ఇప్పుడు మన్నుతిన్నపాములెక్క!
దేశంలో కాంగ్రెస్ నావను నడిపించేదెవరన్నది మొన్నటిదాకా ఓ పెద్ద పజిల్. రాహుల్‌గాంధీ ససేమిరా అన్నాక కొన్నాళ్లు పార్టీ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. చివరికో ఎన్నికల ప్రక్రియ నడిచి గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. మరో ఏడాదిలో ఎన్నికలు. లోటుపాట్లు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో కదనానికి సిద్ధం కావాల్సిన కాంగ్రెస్ కలహాలతో కాలక్షేపం చేస్తోంది. కొత్త కమిటీలు తెలుగురాష్ట్రాల్లోని చిచ్చురేపాయి. మునుగోడు ఎన్నికల్లో పార్టీకి ప్రచారం కూడా చేయని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం పక్కనపెట్టింది. సమయం వచ్చినప్పుడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు కోమటిరెడ్డి.
తెలంగాణలో రేవంత్‌రెడ్డి వర్సెస్ సీనియర్స్ అన్నట్లుంది కాంగ్రెస్ కాపురం. జగ్గారెడ్డిలాంటి నేతలు ఓసారి మనంమనం బరంపురం అంటున్నారు. మరోసారి నీకు నాకు రాంరాం అంటున్నారు. ఎంత జాగ్రత్తగా కూర్చినా టీపీసీసీలో పదవుల పందేరం కొత్త రచ్చకు కారణమైంది. జూనియర్లను రాజకీయ వ్యవహారాల కమిటీలో నియమించి తనను ఎగ్జిక్యూటివ్ కమిటీకి పరిమితం చేయడంపై కొండా సురేఖ కన్నెర్రచేశారు. ఎగ్జిక్యూటివ్ సభ్యురాలి పదవికి రాజీనామా చేస్తూ రేవంత్‌రెడ్డికి లేఖరాశారు. వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కూడా టీపీసీసీ కమిటీలో కొనసాగలేనంటూ పీసీసీ పెద్దలకు సమాచారం ఇచ్చారు.
ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినా కాంగ్రెస్‌ని పాత అవలక్షణాలు వదిలిపెట్టటం లేదు. గిడుగు రుద్రరాజుని ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాక కొత్త వివాదాలు మొదలయ్యాయి. ఏపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి అవమానించారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అలక వహించారు. ఆ పదవి వద్దంటూ తిరస్కరణ లేఖని అధిష్ఠానానికి పంపించారు. మిగిలిన పార్టీల్లాగే కాంగ్రెస్ కూడా అగ్రకులాలకు పెత్తనమిచ్చిందనేది హర్షకుమార్ ఆక్షేపణ. పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూడా అలకల జాబితాకెక్కారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసేసి మీడియా సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు ధన్యవాదాలు చెప్పారు. అదే సమయంలో ఆ పదవిని తాను తీసుకోవడం లేదంటూ తన అసంతృప్తిని బయటపెట్టుకున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా పదవులివ్వడం ఏపార్టీకి కూడా సాధ్యంకాదుగానీ ఎదురుదెబ్బల తర్వాతకూడా కాంగ్రెస్ మాత్రం మారలేదు!