బీజేపీ నేతలే జనసేన అభ్యర్థులా..?

By KTV Telugu On 8 November, 2023
image

KTV TELUGU :-

జనసేన తెలంగాణ రాజకీయాల్లో ఏం చేస్తోంది. బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంది.  పట్టుమని పది మంది నేతలు కూడా కనిపించని  తెలంగాణ జనసేన అసలు ఎందుకు పోటీ చేస్తోంది. ఫైనల్ గా ఏం జరుగబోతోంది. ఇలాంటి ప్రశ్నలకు కూకట్  పల్లి సీన్ ఒక మంచి సమాధానంగా చెప్పుకోవచ్చు. కూకట్ పల్లిలో జనేసేన తరపున పోటీ చేయబోయేదెవ్వరో తెలిస్తే… బీజేపీ గేమ్ ప్లాన్ ఏమిటో కూడా అర్థమవుతుంది…

తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి పోటీ చేసి తీరుతామని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించి చాలా రోజులైంది. తమకు 32 చోట్ల బలముందని కూడా ఆయన చెప్పుకున్నారు. చివరాఖరుకు  జనసేనతో తమ మైత్రి తెలంగాణలో కూడా కొనసాగుతుందని ప్రకటించిన  పవన్ పార్టీకి 11 స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే ఒకచోట కూర్చుని చర్చించుకున్న సందర్భంగా తొమ్మిది స్థానాలకు ఫైనలైజ్ చేసుకోగా, అందులో నాలుగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు నిర్ధారించారు. హైదరాబాద్ లో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గాలను జనసేనకు వదిలేసేందుకు బీజేపీ  సిద్ధమైంది.దానితో ఆ రెండు నియోజకవర్గాల్లోని బీజేపీ ఆశావహులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరి ఏం చేయాలన్న   మీమాంస కొనసాగుతుండగా కూకట్ పల్లి బీజేపీ నేతకు అదృష్టం  బాగా కలిసొచ్చినట్లుగా తెలుస్తోంది..

కూకట్ పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అని ఒక నాయకుడున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణించిన ముమ్మారెడ్డి .. లయన్స్ క్లబ్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ కు చెందిన కాపు సామాజిక వర్గం నాయకుడైన ప్రేమ్ కుమార్ ఎలాగైనా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడయ్యారు. కూకట్ పల్లిపై ఆశలు పెట్టుకున్నారు. అక్కడ గత ఎన్నికల్లో బీజేపీ గెలవకపోగా డిపాజిట్లు కూడా రాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కొట్టడం మామూలు విషయం కాదని బీజేపీ గుర్తించింది. సెటిలర్ల ఓట్లు, బలమైన సామాజిక వర్గం ఓట్లు ఉంటేనే గెలుపు ఖాయమని అర్థం చేసుకుని ముమ్మారెడ్డి ప్రేమ్  కుమార్ ను ఆరు నెలల క్రితం పార్టీలో చేర్చుకుంది. కూకట్ పల్లి  టికెట్ ఆయనకే ఇస్తామని ఏర్పాట్లు  చేసుకోవాలని చెప్పడంతో ప్రేమ్ కూమార్ జనంలో తిరుగుతూ బాగానే ఖర్చుపెట్టారు. ఇంతలోనే  జనసేనతో పొత్తు చర్చలు జరగడం, కూకట్ పల్లిని జనసేనకు కేటాయిస్తారని తెలియడంతో ప్రేమ్  కుమార్ నిరాశ చెంది మౌనం వహించారు.

ప్రేమ్ కుమార్ నిరాశలో ఉండగానే అదృష్టం మరోలా కలిసొచ్చింది. జనసేన జరిపిన సర్వేలో ప్రేమ్ కుమార్ కు విజయవాకాశాలున్నట్లు తెలియడంతో ఆయనకు పార్టీ నుంచి ఆహ్వానం అందింది. పవన్ ఆశీస్సులతో పార్టీలో చేరిన సందర్భంగా కూకట్ పల్లి అభ్యర్థి కూడా ఆయనేనని తేల్చేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా జాబితా విడుదలవుతుంది. ఇలా పార్టీలో చేరిన వ్య‌క్తికి అలా టికెట్ ప్ర‌క‌టించ‌డంపై జ‌న‌సేన‌లోనూ చ‌ర్చ‌సాగుతోంది. అయితే, ప్రేమ్‌కుమార్‌కు ప‌వ‌న్‌కు మ‌ధ్య స్నేహం ఉంద‌ని.. ఎప్ప‌టి నుంచో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం కూడా ఉంద‌ని అందుకే టికెట్ ఇచ్చి ఉంటార‌ని కొంద‌రు చెబుతున్నారు. ఏదేమైనా.. కూక‌ట్‌ప‌ల్లిలో బీఆర్ ఎస్ అభ్య‌ర్థికి దీటుగా ప్రేమ్‌కుమార్ పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట మాత్రం వేరుగా ఉంది. కూకట్ పల్లిలో కొత్త వారిని నిలబెడితే జనసేన ప్రచారానికి ఇబ్బంది అవుతుందని, అదే ప్రేమ్ కుమార్ అయితే విజయవకాశాలు పెరుగుతాయని బీజేపీ వారే పవన్ కల్యాణ్ ను కన్విన్స్ చేసి జనసేనలో చేర్పించారని చెబుతున్నారు. అంటే పరోక్షంగా బీజేపీ తమ అభ్యర్థులకు జనసేన బీ ఫార్మ్ లు ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నంలో ఉందన్న టాక్ నడుస్తోంది.జనసేన టికెట్ ఉంటే సెటిలర్ల ఓట్లు కూడా ఏకమొత్తంగా తమ కూటమికి  వస్తాయన్న విశ్వాసం బీజేపీలో కలుగుతోంది. ఇదే ఫార్ములాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నాలుగు నియోజకవర్గాల్లో పాటిస్తారని కూడా అనుకుంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి