తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. అరెస్ట్ సందర్భంగా లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని పేర్కొన్నారు. సరైన ఆధారాలు లేవన్న న్యాయస్థానం వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించడంతో టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. వెంటనే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అంటూ ఒక ఆడియో వెలుగులోకి వచ్చింది.
ఆ ఆడియోలో స్వామిజీ రామచంద్ర భారతి.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో మాట్లాడుతూ…. నందు మేము మాట్లాడుకున్నాము. మాకు కొన్ని వివరాలు చెప్తే సార్ తో మాట్లాడతాను, ఇప్పటికై ఈ విషయంపై సార్ తో మాట్లాడాను వారి పేరు పంపితే బాగుంటుంది అని అడగ్గ…పేర్లు చెప్పడం కష్టం అని ఇప్పటికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారని, వారిని కలిసి మాట్లాడితే బాగుంటుందన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈ విషయం బయటపడితే మా సీఎంతో కష్టం అంటూనే, ప్రస్తుతం ఎలక్షన్ ఉండటం వల్ల బయటికి రాలేమని, అందుకే మీరే హైదరాబాద్ వచ్చి కలిస్తే బాగుటుందని ఎమ్మెల్యే చెప్పగా… హైదరాబాద్లోని ఏదో చోటికి వస్తాను. కలుద్దాం అని స్వామిజీ చెప్పినట్లు ఆ ఆడియోలో ఉంది. ఈ ఆడియో సంభాషణ ఎంత వరకు నిజం అన్నది తెలియదు. ఈ ఆడియో ఆధారంగా టీఆర్ఎస్ బీజేపీ మీద విమర్శలు కంటిన్యూ చేసే అవకాశం ఉంది.