కేసీఆర్‌ అండ్‌ కో టార్గెట్‌గా కేంద్రం తీన్మార్‌

By KTV Telugu On 17 December, 2022
image

లెక్క బరాబర్‌. ఇంకా బరాబర్‌ కూడా కాలేదేమో.. బార్‌బార్‌ తీన్మార్‌ అంటోంది కేంద్రం. ఐటీ, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో ముచ్చటగా మూడు బ్రహ్మాస్త్రాలు. పుట్టలో వేలెడితే కుట్టకుండా వదులుతామా అన్నట్లుంది కేంద్రప్రభుత్వ రియాక్షన్‌. మీరు నోటీసులు పంపితే మేం ఎంక్వయిరీలదాకా వెళ్తామని హెచ్చరికలు చేస్తున్నట్లుంది పరిస్థితి చూస్తుంటే. ఫాంహౌస్‌కేసులో బీజేపీ కేంద్రపెద్దలకు సన్నిహితుడైన రామచంద్రభారతితో పాటు మరో ఇద్దరు దొరికినా టీఆర్‌ఎస్‌ అంతకంటే ముందుకెళ్లలేకపోతోంది. ముగ్గురినీ అరెస్ట్‌చేసి జైలుకు పంపింది. బీజేపీ జాతీయ నేత బీఎల్‌ సంతోష్‌ సహా మిగిలినవారిని విచారించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నా పరిస్థితులు సహరించటం లేదు. సిట్‌ చూపిన ఆధారాలు పక్కాగా లేకపోవటంతో కేసు దర్యాప్తు ఒకడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి అన్నట్లుంది. ఇదే సమయంలో తమపైనే స్టింగ్‌ ఆపరేషన్‌కి తెగబడ్డ కేసీఆర్‌పై కేంద్రం కన్నెర్ర చేస్తోంది. బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్‌ చేసుకుని దర్యాప్తుసంస్థలను రంగంలోకి దించుతోంది.

మెయినాబాద్‌ ఫాంహౌస్‌ కేసు స్టింగ్‌ ఆపరేషన్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డినే కీలకం. ఆ ఫాంహౌస్‌ కూడా ఆయనదే. ఆయనతో పాటు నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రతినిధులు బేరసారాలు చేశారన్నది అభియోగం. అయితే కొండను తవ్వితే దొరికింది చిట్టెలుకలే. ఆ ముగ్గురినీ తప్ప మిగిలినవారిని నిందితులుగా పరిగణించలేమని న్యాయస్థానం తేల్చేసింది. బీఎల్‌ సంతోష్‌ని అరెస్ట్‌ చేయకుండా ముందే స్టే ఇచ్చేసింది. ఈ ఆపరేషన్‌తో బీజేపీ దేశవ్యాప్తంగా బద్నాం అవుతుందనుకున్న కేసీఆర్‌ వ్యూహం ఫలించలేదు. దీంతో అసహనంగా రగిలిపోతున్న గులాబీ శ్రేణులకు కేంద్ర దర్యాప్తుసంస్థల దూకుడు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీస్‌ ఇచ్చింది. డిసెంబరు 19న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
నోటీసులకు రెండ్రోజులముందే ప్రజాసంగ్రామయాత్ర ముగింపుసభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అన్యాపదేశంగా హెచ్చరికలు చేశారు. బెంగళూరు డ్రగ్స్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నేతలను దర్యాప్తుసంస్థలు వదలవని ముందే జోస్యం చెప్పారు. ఆయన ఊహించారో లేదంటే ముందుస్తు సమాచారం ఉందోగానీ పైలెట్‌రెడ్డికి ఈడీ నోటీసులు అందాయి. దీంతో బీజేపీ కావాలనే కక్షసాధింపుచర్యలకు దిగుతోందని పైలెట్‌రెడ్డితో పాటు హరీష్‌రావులాంటి సీనియర్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈడీ సమన్ల ప్రకారం డిసెంబరు 19 ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ ఈడీ కార్యాలయంలో పైలెట్‌రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈడీ కోరిన వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఆధార్‌కార్డ్‌, పాన్‌కార్డ్‌, పాస్‌పోర్టు కాపీలు అడిగింది ఈడీ. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యుల పేరుమీద ఉన్న బ్యాంక్‌ అకౌంట్ల డీటైల్స్‌ చెప్పాలంది. తాండూరు ఎమ్మెల్యే చర, స్థిరాస్తులు, షేర్ల సమాచారం. ఆస్తుల క్రయవిక్రయాలు, ఆదాయపన్ను చెల్లింపు వివరాలతో తమ ముందుకు రావాలని చెప్పింది. 2015 ఏప్రిల్‌ 1 నుంచి రోహిత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల అధీనంలో ఉన్న సంస్థల వివరాలు, వాటి బ్యాంక్‌ ఎకౌంట్లు, ఆడిటింగ్‌ చేసిన బ్యాలన్స్‌షీట్ల కాపీలు, క్లోజ్‌ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఈడీ నోటీసులో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంతెంత రుణాలు తీసుకున్నారో, దేశవిదేశాల్లో ఏయే వ్యాపారాలున్నాయో, ఇదివరకు ఏయే దేశాలకు వెళ్లొచ్చారో ఈడీ అడిగింది. చివరికి ఆయన అడ్రస్‌, మెయిల్‌ ఐడీతో పాటు టోటల్‌ బయోడేటా సమర్పించాలని ఈడీ ఆదేశించటంతో ఇదెక్కడి విడ్డూరమని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి.

విచారణకు అడిగిన అన్ని వివరాలతో రావాలని, తప్పుడు సమాచారం ఇచ్చినా ఏదన్నా దాచిపెట్టినా కఠిన చర్యలుంటాయని నోటీసులో ముందే హెచ్చరించింది ఈడీ. హైదరాబాద్‌ ఈడీ జోనల్‌ కార్యాలయంలో ఈ ఏడాది 48వ నంబరుతో నమోదైన ECIR కేసు దర్యాప్తులో భాగంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ED ఈ నోటీసిచ్చింది.
బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఎమ్మెల్యేకు నోటీసులిచ్చారని భావిస్తున్నా పూర్తి క్లారిటీ లేదు. సినీ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్న బెంగళూరు పార్టీలో రోహిత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ పార్టీలో భారీగా డ్రగ్స్‌ దొరికాయి. అయితే కేవలం డ్రగ్స్‌ కేసుపైనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేని పిలుస్తున్నట్లు లేదు. గుట్కా వ్యాపారానికి సంబంధించిన హవాలా లావాదేవీలపై ఆరా తీస్తున్న క్రమంలోనే ఈడీ నోటీసులిచ్చిందనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే సన్నిహితులు ఆ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారనే అనుమానంతో పైలెట్‌నుంచి సమాచారం రాబట్టాలనే ఆలోచనతో ఈడీ ఉందంటున్నారు. కేసు వివరాలేవీ లేకుండా సమన్లు ఇచ్చారన్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విచారణకు హాజరవుతానన్నారు. బెంగళూరు డ్రగ్‌ కేసులో తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టంచేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదంటూ బండి సంజయ్‌ యాదాద్రి ఆలయంలో ప్రమాణంచేశారు. ఇప్పుడు పైలెట్‌ రోహిత్‌రెడ్డికూడా బీజేపీ నేతకు అలాంటి సవాలే విసిరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన రోహిత్‌రెడ్డి అమ్మవారి సాక్షిగా బండి సంజయ్‌కి సవాల్ చేశారు. బండి సంజయ్ తడి బట్టలతో భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి రావాలన్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చినట్లు చూపించాలని డిమాండ్‌ చేశారు. తనకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపీకి ముందే ఎలా తెలుసని పైలెట్‌ ప్రశ్నించారు.
ఫాంహౌస్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వ దూకుడుకి కళ్లెంవేసేందుకే కేంద్రం దర్యాప్తుసంస్థలను ఉసిగొల్పుతోందన్న చర్చ జరుగుతోంది. మంత్రి గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్ ఎంపీ రవిచంద్రల వ్యాపారసంస్థలు, గ్రానైట్‌ బిజినెస్‌పై ఈడీ, ఐటీ సోదాలు జరిపాయి. హవాలా నడిచిందన్న లీకులిచ్చాయి. మంత్రి మల్లారెడ్డి టార్గెట్‌గా ఐటీ భారీగా దాడులు నిర్వహించింది. నోటీసులిచ్చి ఇంకా మల్లారెడ్డి కుటుంబసభ్యులను, ఉద్యోగులను విచారిస్తూనే ఉంది. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో కేసీఆర్‌ కూతురు కవిత పేరుందని ముందే లీకులొచ్చాయి. చివరికి ఊహించినట్లే సీబీఐ నోటీసులిచ్చి కవితను ఆమె ఇంట్లోనే విచారించింది. మొదట సాక్షిగా ప్రశ్నించి తర్వాత నిందితురాలిగా చేర్చి కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పుడు పైలెట్‌కి ఈడీ నోటీసులతో నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరన్న చర్చ మొదలైంది. పక్కాగా ఫాంహౌస్‌లో ముగ్గురిని ఇరికించిన పైలెట్‌ ఈడీ కేసునుంచి సేఫ్‌గా బయటపడతారా? ఊబిలో కూరుకుపోతారా? యుద్ధం ఇప్పుడే మొదలైంది. అంతమెప్పుడో, విజేతలెవరో ఇప్పుడే చెప్పలేం.