కేంద్ర కేబినెట్‌లోకి మరో తెలంగాణ ఎంపీ?

By KTV Telugu On 30 January, 2023
image

కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం అవుతోంది. 2024లో హాట్రిక్ విజయం లక్ష్యంగా కొత్త మంత్రుల ఎంపిక జరగనుంది. కేంద్ర మంత్రివర్గంలో మొత్తం 83 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 78 మంది ఉన్నారు. ఈ ఏడాదిలో 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి ప్రధాని మోడీ తన కేబినెట్‌లో పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం కొందరు మంత్రులు, సహాయ మంత్రులకు ఉద్వాసన పలకనున్నారు. ఇప్పటికే వాళ్లకు పరోక్షంగా సంకేతాలిచ్చినట్టు కూడా చెబుతున్నారు. నాలుగు శాఖలు మినహా మిగతా అన్ని శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్ బెర్తు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆ ఛాన్స్ ఎవరు కొడతారనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతుండగా అసెంబ్లీ ఎన్నికలతో శ్రేణులకు మరింత ఊపునిచ్చేలా రాష్ట్రానికి రెండో బెర్త్ కూడా కేటాయించబోతున్నారు.

మరో పది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. మోడీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను ఓడించాలనేది బీజేపీ లక్ష్యం. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈ సమయంలో తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి కేటాయించాలని బీజేపీ అధినాయత్వం భావిస్తోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం నలుగురు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషన్ రెడ్డిని మినహాయిస్తే మిగిలిన ముగ్గురు ఎంపీల్లో బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియనుంది. తిరిగి అధ్యక్షుడిగా కొనసాగిస్తారా లేక కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈటలకు పార్టీ బాధ్యతలు ఇచ్చే అంశం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అయితే బండి సంజయ్‌ను ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చటం సరి కాదనే అభిప్రాయాన్ని రాష్ట్ర నేతలు అధినాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.

రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి ఉండటంతో బీసీ వర్గానికి ఈ సారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇద్దరూ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారే. ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని భావిస్తే సోయంను తీసుకొనే అవకాశం ఉంది. సామాజిక-నాయకత్వ- ప్రాంతీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే ధర్మపురి అర్వింద్ కు ఛాన్స్ కనిపిస్తోంది. అందరిలో ఈ మధ్యే రాజ్యసభకు ఎన్నికైన లక్ష్మణ్ రేసులో ముందున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేరును పరిశీలిస్తున్నారట. ఆదివాసీల పోడు భూముల అంశం తెలంగాణ సర్కార్ కు తలనొప్పిగా మారింది. దీనిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న కేంద్రం సోయం బాపూరావును కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా బీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టొచ్చనే ఆలోచనతో ఉందట. ఏది ఏమైనా తెలంగాణలో కేసీఆర్ ను బలంగా కౌంటర్ చేసే నేతకే కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కుతుందని ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.

ఎన్నికలకు జరగనున్న 9 రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్‌లోకి తీసుకోవడంతో పాటు బడ్జెట్‌లోనూ ఆయా రాష్ట్రాలకు ఊరట కలిగించేలా మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. రేపటి నుండే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2 విడతలలో 66 రోజుల పాటూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందే ఛాన్స్ ఉంది. మొత్తంగా తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో చేరబోయే వ్యక్తి ఎవరనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. కొద్దిరోజుల్లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.