టార్గెట్‌ టీఆర్‌ఎస్‌..మోదీ టూర్‌తో హీట్‌వేవ్‌!

By KTV Telugu On 12 November, 2022
image

ముసుగులో గుద్దులాటల్లేవ్‌..డైరెక్టే ఫైటే ఇక!

దుబ్బాకలో జాక్‌పాట్‌, హుజూరాబాద్‌లో మరో మ్యాజిక్‌ మునుగోడులోనే గెలుపు వాకిలిదాకా వెళ్లి వెనక్కి తిరగాల్సి వచ్చింది. మునుగోడులో కూడా గెలిచాక ఇక టీఆర్‌ఎస్‌ని ఓ చూపు చూద్దామనుకుంటే లెక్కతప్పింది. ఫాంహౌస్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌తో మొదటిసారి సీన్‌ రివర్స్ అయింది. ఆ ఫ్రస్టేషన్‌ అంతా మోడీ మాటల్లో కనిపించింది. ప్రధాని తెలంగాణ టూర్‌తో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య అంతిమ సమరానికి సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది.
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు ప్రధాని. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. ఎప్పుడో ఉత్పత్తి మొదలుపెట్టిన ఫ్యాక్టరీకి ఇప్పుడు రిబ్బన్‌ కటింగేంటని టీఆర్‌ఎస్‌ నేతలు వెక్కిరించినా, మోడీ గో బ్యాక్‌ ఫ్లెక్సీలు వెలిసినా ఇరుగుదిష్టి పొరుగుదిష్టి అన్నట్లే తీసుకుంటోంది బీజేపీ.

బేగంపేటలో విమానం దిగగానే కార్యకర్తలనుద్దేశించి సాగిన మోడీ ప్రసంగం టీఆర్‌ఎస్‌నే టార్గెట్‌ చేసుకుంది. నేరుగా కేసీఆర్‌ పేరెత్తకపోయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రధాని ప్రసంగం సాగింది. టీఆర్‌ఎస్‌తో చెడాక మోడీ ఇంత తీవ్రస్వరంతో మాట్లాడటం ఇదే మొదటిసారి. తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన ఇంకెంతో కాలం సాగదని మోడీ అన్నారు. పేదలను దోచుకునేవాళ్లని వదిలిపెట్టేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. తనను ఎన్ని తిట్టుకున్నా ఇబ్బందిలేదని కానీ తెలంగాణ ప్రజలను నిందిస్తే సహించబోమంటూ సెంటిమెంట్‌ డైలాగ్‌ వదిలారు.
ఐటీరంగానికి కేరాఫ్‌గా ఉన్న రాష్ట్రంలో మూఢనమ్మకాలతో కాలం గడిపే ప్రభుత్వం నడుస్తోందంటూ తీవ్రవ్యాఖ్యలుచేశారు. తెలంగాణ పేరు చెప్పి పార్టీలు పెట్టినవారు ప్రజలను వదిలేసి తమ బాగోగులు చూసుకుంటున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు బీజేపీకి భరోసా ఇచ్చారంటూ తెలంగాణలో కమల వికాసం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. మోడీ టూర్‌ బీజేపీలో జోష్‌ నింపింది. ఫ్లెక్సీలు పెట్టి నాలుగు నల్లబెలూన్లు వదలిన టీఆర్‌ఎస్‌ ప్రధాని వ్యాఖ్యల్ని తిప్పికొడుతోంది.